ఫీజులుం | parents are worried of private schools | Sakshi
Sakshi News home page

ఫీజులుం

Jun 23 2015 3:23 AM | Updated on Sep 3 2017 4:11 AM

ఫీజులుం

ఫీజులుం

సామాన్య మధ్య తరగతికి చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించాలని అనుకోవడం సాధారణమే...

తిరుపతిలో ఉంటున్న ఓ చిరు వ్యాపారి కృష్ణమూర్తి తన కుమార్తెను సెంట్రల్ సిలబస్ స్కూల్లో 5వ తరగతిలో చేర్చేందుకు ఓ ప్రయివేటు పాఠశాలకు వెళ్లాడు. అడ్మిషన్ ఫీజు రూ.15 వేలు, ట్యూషన్ ఫీజు రూ.50 వేలు, వ్యాను ఫీజు రూ.10 వేలు, పుస్తకాలు, బ్యాగులు, యూనిఫాం అంతా కలపి మరో రూ.10వేలు.. మొత్తం కలిపితే ఏడాదికి రూ.80 వేలు చెల్లించాలన్నారు. దీంతో ఆయనకు దిక్కుతోచలేదు.
 
- చుక్కలు చూపిస్తున్న ప్రయివేటు స్కూళ్లు
- బెంబేలెత్తుతున్న తల్లిదండ్రులు

 
చిత్తూరులో నివాసం ఉంటున్న వెంకటరెడ్డి ఇటీవల ఉద్యోగ రీత్యా మదనపల్లె నుంచి వచ్చి చిత్తూరులో ఉంటున్నారు. తన కుమారుడిని నర్సరీలో చేర్చేందుకు ఓ కార్పొరేట్ పాఠశాలకు వెళితే ఫీజు రూ.23,000, అడ్మిషన్ ఫీ రూ.5 వేలు, వ్యానుకు మరో రూ.7 వేలు, విద్యార్థుల కిట్ పేరుతో మరో రూ.5వేలు.. ఇలా మొత్తంగా రూ.40 వేలు అవుతుందని చెబితే ఆయన కంగు తిన్నారు.
 
తిరుచానూరు: సామాన్య మధ్య తరగతికి చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించాలని అనుకోవడం  సాధారణమే. తాము బాగా చదువుకోకపోవడం వల్లే కష్టాలు  పడుతున్నామని, తమలా తమ పిల్లలు  కష్టాలు  పడకూడదనే నెపంతో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో  చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీరి ఆసక్తిని పలు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యం వేలాది రూపాయల ఫీజుల రూపంలో చుక్కలు చూపుతూ క్యాష్ చేసుకుంటోంది.
 
నిబంధనలకు విరుద్ధంగా...
జిల్లాలోని తిరుపతి, చిత్తూరు నగరాలు,  ప్రధా న పట్టణాల్లోని పలు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా టెక్నో, ఒలంపియాడ్, గ్లోబల్, ఐఐటీ వంటి పేర్లతో తల్లిదండ్రులను బురిడి కొట్టిస్తోంది. విద్యాశాఖ నిబంధనల ప్రకారం పాఠశాలల వెనుక ఇలాంటి పేర్లను ఏర్పాటుచేయకూడదు. అయినా ఇవేమీ పట్టించుకోకుండా పలు పాఠశాలలు వ్యవహరిస్తున్నాయి. దీంతో ఆయా పేర్లను చూసి తల్లిదండ్రులు మోసపోతున్నారు.  చర్యలు తీసుకోవాల్సిన విద్యాశాఖ అధికారులకు పాఠశాలలు తెరిచినా ఇంకా సెలవు మత్తులో నుంచి మేలుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
 
ఎల్‌కేజీకే ఎంబీబీఎస్ ఫీజులు :
కొత్తగా పిల్లలను పాఠశాలలో చేర్పించే తల్లిదండ్రులకు పాఠశాలల యాజమాన్యాలు చుక్కలు చూపిస్తోంది. తమ పాఠశాలలో అత్యాధునిక  వసతులున్నాయంటూ ఎల్‌కేజీకి ఎంబీబీఎస్ ఫీజులను వసూలు చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎల్‌కేజీ పిల్లలకు ఏడాదికి సుమారుగా రూ.10వేలు ఫీజు, దీనికి తోడు డొనేషన్, అడ్మిషన్ ఫీజు, పుస్తకాలు, వ్యాను, యూని ఫాం, బూట్లు, షాక్సులంటూ అదనంగా మరో రూ.10వేలు వరకు దండుకుంటున్నారు. కార్పొరేట్, సెంట్రల్ సిలబస్ స్కూళ్లలో భారీ స్థాయిలో వసూలు చేస్తున్నారు. 1నుంచి 5వ తరగతి వరకు దాదాపు ఏడాదికి రూ.50వేలుకుపైగా ఖర్చవుతోంది. 6నుంచి 10వ తరగతి వరకు ఏడాదికి సుమారుగా రూ.60నుంచి రూ.80వేలు వరకు తల్లిదండ్రులు ఖర్చు పెట్టాల్సి ఉంది. సంఘంలో గౌరవం కోసం స్తోమతకు మించి ఫీజులు చెల్లిస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
 
అర్హత లేని వారితో విద్యాబోధన : వేలాది రూపాయలు ఫీజుల రూపంలో ముక్కుపిండి వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలు దానికి తగ్గ ఉపాధ్యాయులను నియమించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.  కొన్ని పాఠశాలల్లో విద్యాబోధనలో అనుభవం, అర్హత లేని వారికి నామమాత్రపు వేతనాలతో సరిపెట్టుకుంటూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి.
 పాఠశాలల నోటీసు బోర్డులో ఉపాధ్యాయుల అర్హత, ఫీజుల వివరాలు, పాఠశాల గుర్తింపు వంటి వివరాలను నమోదు చేయాల్సి ఉంది. అయితే  ఎక్కడా ఈ నిబంధనలను పాటిస్తున్న దాఖలాలు లేవు. కొన్ని పాఠశాలలకు గుర్తింపు లేకపోయినా యథేచ్ఛగా పాఠశాలలు నడుపుకుంటున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement