ఏజెన్సీలో చొరబడి గిరిజనుల ఆస్తులను ధ్వంసం చేస్తూ వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న
కురుపాం: ఏజెన్సీలో చొరబడి గిరిజనుల ఆస్తులను ధ్వంసం చేస్తూ వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న అడవి ఏనుగులను తరిమికొట్టేందుకు అటవీ శాఖాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ‘ఆపరేషన్ గజ’ కార్యక్రమాన్ని సోమవారం నుంచి నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా అటవీశాఖాధికారి ఏవీ రమణమూర్తి తెలిపారు. మండలంలోని తిత్తిరి పంచాయతీ ఎగువగుండాం గిరిశిఖర గ్రామంలో వారం రోజులుగా నాలుగు ఆడ అడవి ఏనుగులు తిష్ఠ వేసి రెండు గిరిజన గ్రామాల్లో 15 ఇళ్లను, అరటి, వరి పంటలతోపాటు గిరిజనులు దాచుకున్నధాన్యం బస్తాలను సైతం ధ్వంసం చేసిన సంఘటన విదితమే.
ఈ మేరకు డీఎఫ్‌ఓ రమణమూర్తి ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ ఇప్పటికే ఏనుగులను తరలించేందుకు బెంగళూరు నుంచి నిపుణుడైన వైల్డ్ ఎలిఫెంట్ ఎక్స్‌పర్ట్ రుద్రాదిత్య వస్తున్నారని తెలిపారు. విశాఖ జిల్లా ఐఎఫ్‌ఎస్ అధికారి ఎన్.ప్రదీప్‌కుమార్ ఆధ్వర్యంలో ఆపరేషన్ గజ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఒడిశా లేదా శ్రీకాకుళం అడవుల్లోకి తరలించేందుకు చర్యలు కురుపాం ఏజెన్సీలోకి ప్రవేశించిన నాలుగు అడవిఏనుగులను శ్రీకాకుళం జిల్లా లేదా ఒడిశా అడవుల్లోకి ప్రణాళికా పరంగా తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డీఎఫ్‌ఓ రమణమూర్తి అధికారులు తెలిపారు.
ఎలిఫెంట్ ట్రంజ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు
గజరాజుల ప్రభావిత ప్రాంతాలకు మూడు కిలోమీటర్ల మేరలో గిరిశిఖరాల చుట్టూ ఎలిఫెంట్ ట్రంజ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేశామని డీఎఫ్‌ఓ తెలిపారు. ఈ ఎలిఫెంట్ ట్రంజ్ వల్ల గజరాజులు గ్రామాల్లోకి వచ్చే ప్రసక్తి లేదని భయంతో వెను తిరగడమే కాకుండా గిరిజన గ్రామాల వైపు భవిష్యత్‌లో కూడా రాకుండా ఉంటాయని తెలిపారు.