ఫోనే.. పర్సులాగా

Online Transactions Should Be Increased Central government - Sakshi

డెబిట్, క్రెడిట్‌ కార్డులను దాటేసిన ఫోన్‌ చెల్లింపులు

జీడీపీలో 10 శాతానికి చేరిన లావాదేవీల విలువ

ప్రతినెలా సగటు లావాదేవీల సంఖ్య 115 కోట్లు

ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న యూపీఐ విధానం

ఇండియా విధానం అమలు చేయాలంటూ అమెరికా ఫెడరల్‌ బ్యాంకుకు గూగుల్‌ లేఖ

సాక్షి, అమరావతి: పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు చెలామణిని తగ్గించి, ఆన్‌లైన్‌ లావాదేవీలు పెంచాలనే లక్ష్యంతో 2016లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ) విధానం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా గూగుల్‌ పే, ఫోన్‌పే, పేటీఎం రంగ ప్రవేశంతో చెల్లింపులు చాలా సులభమయ్యాయి. చివరికి కిరాణా షాపులో అర్ధ రూపాయి పెట్టి చాక్లెట్‌ కొనుక్కున్నా సరే మొబైల్‌ ఫోన్‌ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. ఒక ఖాతా నుంచి మరో ఖాతాలోకి క్షణాల్లోనే రియల్‌టైమ్‌లో నగదు పంపించే యూపీఐ విధానం గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించింది.

ఇప్పటికే సింగపూర్‌ప్రభుత్వం యూపీఐ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించింది. విజయవంతం కావడంతో వచ్చే ఏడాది నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయనుంది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కూడా యూపీఐ విధానం అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా అంతర్జాతీయ ఐటీ కంపెనీ గూగుల్‌ కూడా యూపీఐ విధానాన్ని అమెరికాలో అమలు చేయాలంటూ ఫెడరల్‌ బ్యాంకుకు లేఖ రాసింది. అమెరికా ఫెడరల్‌ బ్యాంకు 24 గంటలు నగదు బదిలీ చేసే విధంగా ఆర్‌టీజీఎస్‌ను అభివృద్ధి చేయనున్నట్లు గత నవంబర్‌లో ప్రకటించడంతో గూగుల్‌ ఈ సూచన చేసింది.

కార్డులను దాటేసిన యూపీఐ లావాదేవీలు
2018 వరకు ఆన్‌లైన్‌ లావాదేవీల్లో అగ్రస్థానంలో ఉన్న డెబిట్, క్రెడిట్‌ కార్డులు ఈ ఏడాది జనవరి ప్రారంభం నుంచి ఆ హోదాను కోల్పోయాయి. జనవరిలో యూపీఐ లావాదేవీల సంఖ్య కార్డు లావాదేవీల సంఖ్యను మించిపోయింది. ఆ నెలలో యూపీఐ ద్వారా జరిగిన లావాదేవీల విలువ రూ.1.09 లక్షల కోట్లు కాగా, కార్డుల ద్వారా జరిగిన లావాదేవీల విలువ రూ.1.05 లక్షల కోట్లు మాత్రమే. అప్పటి నుంచి యూపీఐ లావాదేవీలు భారీగా పెరిగాయి. ఏప్రిల్‌లో రూ.1.42 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరగ్గా, నవంబర్‌ నాటికి రూ.1.89 లక్షల కోట్లకు చేరాయి. సంఖ్యాపరంగా చూస్తే 2019 నవంబర్‌లో 121.9 కోట్ల లావాదేవీలు జరిగాయి. 2016లో యూపీఐని ప్రవేశపెట్టినప్పుడు ఈ సంఖ్య నెలకు కేవలం లక్ష వరకు ఉండేది.

రెండు రెట్లు పెరిగిన లావాదేవీలు
గతేడాదితో పోలిస్తే 2019 జూలై–సెప్టెంబర్‌ త్రైమాసిక కాలంలో యూపీఐ లావాదేవీలు సుమారు రెట్టింపయ్యాయి. 2019లో సంఖ్యాపరంగా ఇప్పటిదాకా 270 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఇదే కాలంలో లావాదేవీల విలువ 189 శాతం వృద్ధితో రూ.4.6 లక్షల కోట్లుగా నమోదైనట్లు ఇండియా డిజిటల్‌ పేమెంట్స్‌ నివేదిక వెల్లడించింది. ప్రవేశపెట్టిన మూడేళ్లలోనే యూపీఐ లావాదేవీల విలువ జీడీపీలో 10 శాతానికి చేరుకుంది. వచ్చే నాలుగేళ్లలో యూపీఐ లావాదేవీల విలువ రెట్టింపు అవుతుందని అసోచామ్‌–పీడబ్ల్యూసీ సంస్థ అంచనా వేసింది.
2019లో యూపీఐ లావాదేవీల సంఖ్య

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top