
25న జిల్లా వ్యాప్తంగా నిరసనలు
వామపక్షాలు, ప్రజాస్వామిక శక్తులపై ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ అప్రజాస్వామిక దాడులను ఖండిస్తూ ఈ నెల 25వ.....
కర్నూలు(అర్బన్): వామపక్షాలు, ప్రజాస్వామిక శక్తులపై ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ అప్రజాస్వామిక దాడులను ఖండిస్తూ ఈ నెల 25వ తేదీన జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వామపక్ష నేతలు వెల్లడించారు. సోమవారం ఉదయం స్థానిక సీపీఎం కార్యాలయం సుందరయ్య భవన్‌లో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి. షడ్రక్ అధ్యక్షతన వామపక్ష నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఢిల్లీలోని జేఎన్‌యూ, జాదవ్‌పూర్ వర్సిటీ తదితర ఉన్నత విద్యా కేంద్రాల్లో ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ శక్తులు ప్రగతిశీల విద్యార్థులు, ప్రజాస్వామిక శక్తులను కేంద్రంగా చేసుకుని దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జేఎన్‌యు విద్యార్థి కన్హయ్యకుమార్‌పై ఏకంగా దేశద్రోహం కేసు నమోదు చేయడం దారుణమన్నారు. ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఇలాంటి చర్యలను ఖండించాలని కోరారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి కె. ప్రభాకర్‌రెడ్డి, జిల్లా నాయకులు టి. రమేష్‌కుమార్, గౌస్‌దేశాయ్, ఈ. పుల్లారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి కె. రామాంజనేయులు, నగర కార్యదర్శి ఎస్‌ఎన్ రసూల్, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు వెంకటేశ్వర్లు, ఎస్‌యూసీఐ జిల్లా నాయకుడు నాగన్న, ఫార్వర్డ్‌బ్లాక్ నాయకుడు చక్రవర్తి పాల్గొన్నారు.