మంచినీటికి ‘మహా’ కష్టం

Officials Break Yeleru Canal Water Visakhapatnam - Sakshi

ఏలేరు గండితో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు

రెండు మూడు రోజుల పాటు కష్టకాలమే

ప్రవాహం తగ్గకపోవడంతో గండి పూడ్చే పనుల్లో జాప్యం

మరో గండి కొట్టినా ఫలితం శూన్యం

శ్రమిస్తున్న జీవీఎంసీ అధికారులు

అసలే వేసవి కాలం.. చుక్క నీటిని సైతం జాగ్రత్తగా ఒడిసిపట్టుకోవాల్సిన పరిస్థితి. ఉన్న నీటి వనరులతో ఈ ఎండాకాలాన్ని ఎలాగైనా గట్టెక్కించాలన్న మహా విశాఖ నగర పాలక సంస్థ అధికారులకు పుండు మీద కారం చల్లినట్టు ఏలేరు కాల్వకు పడిన గండి వల్ల నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కాలువలో నీటి ప్రవాహం తగ్గకపోవడంతో గండి పూడ్చే పనుల్లో జాప్యం జరుగుతోంది. ఈ కారణంగా ఆది, సోమ వారాల్లో గ్రేటర్‌ పరిధిలో నీటి సరఫరాకు ఇబ్బందులు తప్పవని జీవీఎంసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

విశాఖసిటీ :ఏలేరు కాలువ ద్వారా నగర వాసుల వేసవి కష్టాలు గట్టెక్కుతాయని ఊపిరి పీల్చుకున్న మహా విశాఖ నగర పాలక సంస్థ అధికారులు.. ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. అన్ని రిజర్వాయర్లూ ఖాళీ అయిపోవడంతో ఉన్న ఒకే ఒక్క వనరైన ఏలేరు నుంచి వస్తున్న నీటితో నగరంలో నీటి సరఫరాను జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు. వర్షాకాలం వరకూ ఈ నీటితోనే ప్రజల అవసరాలు తీర్చాలని భావించిన జీవీఎంసీకి గండి రూపంలో అవరోధం ఎదురైంది. మాకవరపాలెం మండలం రాచపల్లి వద్ద గురువారం మధ్యాహ్నం ఏలేరు కాల్వకు పడిన గండి కారణంగా పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. రెండు రోజులుగా 220 ఎంజీడీల మంచినీరు వృథా అయ్యింది. అంటే.. విశాఖ ప్రజల తాగునీటి అవసరాలతో పాటు పారిశ్రామిక అవసరాలకు రెండు రోజుల పాటు వినియోగించే నీరంతా వృథాగా పోయింది. దీంతో పరిస్థితి ఒక్కసారి తల్లకిందులుగా మారింది. ఈ గండి వల్ల రాబోయే రోజుల్లో నీటి సరఫరా మహా కష్టంగా మారే ప్రమాదముంది.

మరో గండి కొట్టినా..
రాచపల్లి వద్ద గండి పడి రోజున్నర గడిచినా నీటి ప్రవాహం తగ్గడం లేదు. దీంతో పూడ్చే పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద నీటిని తగ్గించేందుకు గండి పడిన చోటుకు 200 మీటర్ల దూరంలో కొండల అగ్రహారం వద్ద గురువారం సాయంత్రం అధికారులు మరో గండి కొట్టారు. శుక్రవారం సాయంత్రం గడిచినా.. ప్రవాహం ఏ మాత్రం తగ్గకపోవడంతో పనులు నిర్వహించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో  నర్సీపట్నం సమీపంలో శుక్రవారం సాయంత్రం మరో గండి కొట్టి నీటిని దారిమళ్లించారు. రాత్రివరకు పనులు ప్రారంభం అయ్యే అవకాశం కనిపించలేదు. ఏలేశ్వరం నుంచి 153 కిలోమీటర్ల దూరంలో గండి పడటంతో ఈ 153కిమీ పొడవునా ఉన్న కాల్వలో నీరు పూర్తిగా పోయేందుకు కొంత సమయం పడుతుందని జీవీఎంసీ నీటి సరఫరా విభాగం ఈఈ రాజారావు తెలిపారు. రాచపల్లి వద్ద తాటి దుంగలు వేసి ప్రవాహాన్ని ఆపే ప్రయత్నం చేశామన్నారు. అయితే  30 మీటర్ల మేర గండి పడటంతో మధ్యాహ్నం సమయంలో పూడ్చే పని చేసినా  అది కూడా వరద ఉధృతికి కొట్టుకుపోయిందని వెల్లడించారు. దీంతో పనులు పూర్తిగా నిలిపేశామన్నారు. నీటి ప్రవాహం గురువారం అర్ధరాత్రికి తగ్గే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నామని, ప్రవాహం తగ్గిన వెంటనే పనులు ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని రాజారావు వివరించారు.

రెండు మూడు రోజులు కష్టమే
శుక్రవారం రాత్రి ఏ సమయానికైనా వరద ఉధృతి తగ్గిపోయే ప్రమాదం ఉండటంతో.. గండి పూడ్చేందుకు అవసరమైన యంత్రాంగాన్ని జీవీఎంసీ అధికారులు సిద్ధం చేశారు. కావాల్సిన మట్టి, ఇతర సరంజామాను సిద్ధంగా ఉంచి ప్రవాహం తగ్గిన వెంటనే పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం నాటికి మూడు గండ్లూ పూడ్చేయ్యాలని భావిస్తున్నారు. శనివారం సాయంత్రం పురుషోత్తపట్నం నుంచి నీటిని విడుదల చేసినా.. నగరానికి చేరుకునే సమయానికి రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉంది. ఆ నీరు వచ్చేంతవరకూ నగరంలో మంచినీటి సరఫరాకు ఆస్కారమే లేదు. అంటే.. నగరానికి ఆదివారం నుంచి నీటి సరఫరా రెండు మూడు రోజుల పాటు నిలిచిపోయే ప్రమాదముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top