ఓట్ల చేర్పుల్లో అధికారులు అనుసరిస్తున్న పక్షపాత ధోరణితో విలువైన ఓటు పొందే అవకాశాన్ని పౌరులు కోల్పోతున్నారు.
కందుకూరు, న్యూస్‌లైన్: ఓటు పొందే పౌరుడి కనీస హక్కుని కూడా అధికారులు కాలరాస్తున్నారు. ఓట్ల చేర్పుల్లో అధికారులు అనుసరిస్తున్న పక్షపాత ధోరణితో విలువైన ఓటు పొందే అవకాశాన్ని పౌరులు కోల్పోతున్నారు. దరఖాస్తులపై ఎలాంటి విచారణ లేకుండా..కార్యాలయాల్లో కూర్చొని గంపగుత్తగా ఓట్లు చేర్చుతూ అవకతవకలకు పాల్పడుతున్నారు.
వచ్చే సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించాలని ఎన్నికల కమిషన్ భావించింది. దీనిలో భాగంగా గత నవంబర్ 19 నుంచి డిసెంబర్ 23వ తేదీ వరకు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రజలకు కల్పించింది. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక బీఎల్‌ఓను నియమించడంతో పాటు, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 86,148 మంది ఓటు హక్కు కోసం బీఎల్‌ఓలకు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో కందుకూరు నియోజకవర్గంలో ఉన్న 220 పోలింగ్ బూత్‌ల్లో 6,322 దరఖాస్తులు వచ్చాయి. అలాగే దర్శి నియోజకవర్గంలో 7379, పర్చూరు 8636, అద్దంకి 5204, చీరాల 2162, సంతనూతలపాడు 6406, ఒంగోలు 7587, కొండెపి 9207, మార్కాపురం 8249, గిద్దలూరు 7020, కనిగిరి నియోజకవర్గంలో 9994 మంది ఓటు కోసం దరఖాస్తులు అందజేశారు.
ఇవికాక ఓట్ల తొలగింపు, సవరణలు, పోలింగ్‌బూత్ మార్పు కోసం వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఇవి కేవలం బీఎల్‌ఓలకు అందిన దరఖాస్తులు మాత్రమే. ఇవి కాక ఆన్‌లైన్, మీ-సేవ కేంద్రాల ద్వారా వేల మంది ఓటు కోసం పేరు నమోదు చేసుకున్నారు. ఇవి లెక్క తేలలేదు. దరఖాస్తుల రూపంలో బీఎల్‌ఓలకు అందిన వాటితో పాటు, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన ప్రతి అప్లికేషన్‌పై అధికారులు విచారణ జరిపి ఓటు హక్కు కల్పించాల్సి ఉంది. బీఎల్‌ఓలు ఈనెల 31వ తేదీ లోపు దరఖాస్తులపై విచారణ చేయాలి. కానీ జిల్లాలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఓట్ల చేర్పుల్లో అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారు. ఎలాంటి విచారణ చేయకుండానే దరఖాస్తులను తిర స్కరిస్తున్నారు. ఈ వ్యవహారం కందుకూరు నియోజకవర్గంలో మరీ శ్రుతిమించుతోంది. ఉలవపాడు, వలేటివారిపాలెం మండలాల్లో జరిగిన సంఘటనలు దీనికి ఉదాహరణలు. ఉలవపాడులోని ఓ ప్రభుత్వ వార్డన్ కుటుంబం ఓటు కోసం దరఖాస్తు చేసుకుంది.
అయితే వీరికి ఓటు హక్కు కల్పించేందుకు ఉలవపాడు తహసీల్దార్ నిరాకరిస్తున్నారు. మీకు ఇన్నిరోజుల వరకు ఓటు ఎందుకు లేదు, మీకు ఎక్కడా ఓటు లేనట్లు ఆధారాలు తెస్తేనే ఓటు చేర్చుతానంటూ నానా ఇబ్బందులు పెడుతున్నారు. వాస్తవానికి ఇప్పటి వరకు ఆ కుటుంబ సభ్యులు ఎక్కడా ఓటు హక్కు పొందలేదు. అలాగే కరేడు, బద్దిపూడి, చాకిచర్ల తదితర గ్రామాలకు చెందిన దరఖాస్తులను నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తున్నారు. ఇక వలేటివారిపాలంలోని శాఖవరం గ్రామంలో కొందరి దరఖాస్తులను విచారణ జరిపి, వారు అక్కడ నివసిస్తున్నట్లు బీఎల్‌ఓ సంతకాలు తీసుకొని వచ్చారు. కానీ తరువాత వారి దరఖాస్తులు తిర స్కరిస్తున్నట్లు చెప్పారు. కారణం వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతిపరులు కావడం.
ఇక లింగసముద్రం మండలం రాళ్లపాడు గ్రామంలో 29 ఓట్ల తొలగింపునకు టీడీపీ నాయకులు బీఎల్‌ఓకు దరఖాస్తులు ఇచ్చారు. వీరంతా గ్రామంలో వివాహమై మరో ఊరు వెళ్లిన వివాహిత మహిళలు, చనిపోయిన వారు... ఇతర కారణాలు ఉన్నాయి. వీటిలో 6 ఓట్లు తొలగించి, మిగిలిన 23 మాత్రం అలాగే ఉంచారు. వీటిలో చనిపోయినవారికి ఓటు ఉంచారు. వీరంతా అధికార పార్టీకి చెందిన వారు కావడం గమనార్హం. అసలు ఈ 29 దరఖాస్తులపై ఎటువంటి విచారణ లేకుండా అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి విచిత్రాలు కేవలం కందుకూరుకే పరిమితం కాలేదు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే తిరస్కరణే...
ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకున్న వారు మరో ప్రధానమైన సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆన్‌లైన్ ద్వారా ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి దరఖాస్తును విచారించి అర్హులైతే ఓటు హక్కు కల్పించాలి. అయితే అధికారులు వాటిని తిరస్కరిస్తున్నట్లు మెసేజ్‌లు వస్తున్నాయి. లింగసముద్రం మండలంలో పెదపవని గ్రామంలోని మీ-సేవ కేంద్రం ద్వారా 88 మంది దరఖాస్తులపై ఎటువంటి విచారణ లేకుండానే దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు వారి సెల్‌ఫోన్‌లకు మెసేజ్‌లు వెళ్లాయి. అసలు తమని ఎవరూ అడగకుండా, తమ ఇళ్లకు వచ్చి విచారణ చేయకుండా దరఖాస్తులు ఎలా తిరస్కరిస్తారని వాపోతున్నారు.
ఇదే పరిస్థితి నియోజకవర్గ వ్యాప్తంగా చోటు చేసుకుంది. ఆన్‌లైన్ దరఖాస్తులపై అధికారులు ఎటువంటి విచారణ చేయడం లేదు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారిలో అధికంగా ఉద్యోగాలు చేస్తూ హైదరాబాద్, బెంగళూర్ వంటి నగరాల్లో నివసిస్తున్న వారు, కూలి పనులకు ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు ఉన్నారు. అయినా బీఎల్‌ఓలు సదరు కుటుంబ సభ్యులను విచారించకుండా, ఇంటి అడ్రస్‌కు వెళ్లకుండానే తిర స్కరిస్తున్నట్లు చెప్తుండడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
కార్యాలయాల్లో గంపగుత్తగా ఓట్ల చేర్పు..
కందుకూరు నియోజకవర్గంలో ఓట్ల చేర్పు వ్యవహారం అడ్డగోలుగా జరుగుతోంది. ఓట్ల చేర్పుల్లో తహసీల్దార్లే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కార్యాలయాల్లో కూర్చొని అధికార పార్టీకి చెందిన ఓట్లను గంపగుత్తగా ఓటర్ల జాబితాలో చేర్చుతున్నారు. ప్రతిపక్షాలైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టీడీపీలకు సానుభూతిపరులుగా ఉండే వారి ఓట్లను చేర్చేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు. అసలు బీఎల్‌ఓలతో విచారణలు చేయించకుండా స్వయంగా తహసీల్దార్లే రంగంలోకి దిగి అధికార పార్టీ ఓట్లు చేర్చుతున్నారు. ఇక్కడ జరుగుతున్న వ్యవహారం పై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నా వారు ఏమాత్రం లెక్క చేయడం లేదు. దీంతో అర్హులై ఉండి..ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది.