ఆ జరిమానా.. అయ్యిందా నజరానా? | Offering .. Is that fine? | Sakshi
Sakshi News home page

ఆ జరిమానా.. అయ్యిందా నజరానా?

Jul 13 2016 2:27 AM | Updated on Aug 16 2018 4:36 PM

ఏజెన్సీలోని చింతపల్లి మండలం లోతుగెడ్డ పంచాయతీ ఉమ్మరాసగొందిలో విలువైన నల్లరాయి కొండలు ఉన్నాయి.

కిడారి బినామీ క్వారీకి రూ.78 లక్షల ఫైన్
క్రిమినల్ కేసులూ నమోదు చేయాలని సిఫారసులు
పచ్చ చొక్కా వేసుకున్నాక పట్టించుకోని అధికారులు
 వేధింపులు.. బెదిరింపులపైనా కేసుల్లేవు

 
విశాఖపట్నం:  ఏజెన్సీలోని చింతపల్లి మండలం లోతుగెడ్డ పంచాయతీ ఉమ్మరాసగొందిలో విలువైన నల్లరాయి కొండలు ఉన్నాయి. వీటిపై కన్నేసిన అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తవ్వకాల లెసైన్సు కోసం తన అనుచరుడైన ఓ గిరిజనుడితో దరఖాస్తు చేయించారు. గత ఏడాది అనుమతులు వచ్చాయి. అయితే మైనింగ్ శాఖ అనుమతిచ్చిన చోట కాకుండా దానికి 200 మీటర్ల దూరంలో ఉన్న విలువైన మరో నల్లరాయి కొండను నిబంధనలకు విరుద్ధంగా తవ్వేయడం ప్రారంభించారు. హైపవర్ యంత్రాలతో లోతుగా తవ్వకూడదనే నిబంధనలను సైతం పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా మైనింగ్ చేపట్టారు. భారీ పేలుళ్ల ధాటికి భ యాందోళనకు గురైన క్వారీ సమీపంలోని ఉమ్మరాసగొంది, దబ్బగరువు, కిన్నెర్ల గ్రామాల గిరిజనులు సమావేశమయ్యారు. పేలుళ్లు, అక్రమ క్వారీపై అధికారులకు ఫిర్యాదు చేయాలని భావించారు. అయితే ఎమ్మెల్యే సర్వేశ్వరరావుకు చెందిన క్వారీ కావడంతో.. ఎందుకొచ్చిన గొడవని వెనక్కి తగ్గారు. అయితే ఆ తర్వాత ఈ క్వారీ పేలుళ్లలో జి.మాడుగుల  మండలానికి చెందిన ఓ కూలీ తీవ్రంగా గాయపడటంతో మేల్కొన్న గిరిజనులంతా రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. క్వారీలో అడ్డగోలు తవ్వకాలను అడ్డుకోవాలని వేడుకున్నారు.

పట్టించుకోకపోగా.. వేధింపులు : ఆ ఫిర్యాదును అధికారులు పట్టించుకోకపోగా గిరిజనులకు ఎమ్మెల్యే  నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఫిర్యాదు చేసిన గిరిజనులను అన్నవరం పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి బెదిరించారనే వాదనలు కూడా అప్పట్లో వెల్లువెత్తాయి.క్వారీ పేలుళ్లలో తీవ్ర గాయాలపాలైన గిరిజనుడి వివరాలను కూడా పోలీసులు నమోదు చేయలేదు. అయితే అప్పట్లో  గ్రామాన్ని సందర్శించిన బీజేపీ నేత లోకులగాంధీకి గిరిజనులు క్వారీ కష్టాలను వివరించారు. స్పందించిన గాంధీ అక్రమంగా సాగుతున్న నల్లరాయి తవ్వకాలను ఫొటోలతో సహా జిల్లా కలెక్టర్, మైనింగ్‌శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎట్టకేలకు అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. అప్పటి సబ్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, మైనింగ్ శాఖ అధికారులు వేర్వేరుగా క్వారీలో తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేకుండా అక్రమ తవ్వకాలు జరిగాయని, ఇప్పటికే విలువైన నల్లరాయిని లూటీ చేశారని మైనింగ్ విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.

రూ.78 లక్షల జరిమానాతో పాటు, క్వారీ నిర్వహకులందరిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని సూచించింది. కానీ కిడారి అధికార తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయిన దరిమిలా పరిస్థితిలో మార్పువచ్చింది. కనీసం నోటీసులు కూడా తీసుకోకుండా కాలయాపన చేసినా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నోటీసులే తీసుకోని వాళ్లు జరిమానా ఏం చెల్లిస్తారు.. ఒక్క పైసా కూడా కట్టలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement