మద్యం అక్రమంగా తరలిస్తే నాన్‌ బెయిలబుల్‌ కేసులు

Non Bailable Cases On Liquor Smuggling - Sakshi

పలుమార్లు పట్టుబడితే 8 ఏళ్ల జైలు శిక్ష

స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోకు చట్టబద్ధత

ఎక్సైజ్‌ చట్టంలోనూ సవరణలు 

గెజిట్‌ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, అమరావతి: మద్యం అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను మరింత కఠినతరం చేసింది. ఎవరైనా మద్యం అక్రమంగా రవాణా చేస్తే కఠిన చట్టాలు అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. నాన్‌ బెయిలబుల్‌ కేసులతో పాటు పదే పదే మద్యం అక్రమంగా తరలిస్తూ పట్టుబడితే ఎనిమిదేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్టాలను సవరించారు. వివరాలిలా ఉన్నాయి.. 

► రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూరోకు చట్టబద్ధత కల్పిస్తూ ఉత్తర్వులు 
జారీ అయ్యాయి.  
► పోలీస్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ అమలు చేస్తూనే ఎక్సైజ్‌ చట్టంలో పలు సవరణలు చేశారు.  
► తాజాగా సవరించిన ఎక్సైజ్‌ చట్టం 34 (ఏ) ప్రకారం ఒకే వ్యక్తి పలుమార్లు ఎక్సైజ్‌ నేరాలకు పాల్పడితే ఐదు నుంచి ఎనిమిదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. 
► సాధారణ కేసుల విషయంలోనూ రెండేళ్లకు తగ్గకుండా శిక్షలు పడే విధంగా చట్టాన్ని పటిష్టం చేశారు.  
► ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ స్థానంలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ప్రధాన పాత్ర పోషిస్తుంది.  
► ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా రవాణా కాకుండా, ఏపీలో సారా రూపంలో కల్తీ మద్యం తయారు కాకుండా నిరోధించేందుకు ఎస్‌ఈబీ స్వతంత్ర వ్యవస్థగా పనిచేస్తుంది.  

మద్య నియంత్రణకు వేగంగా అడుగులు
దశల వారీ మద్య నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖను నిర్వీర్యం చేశారు. ఇప్పుడు పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు కలిసి అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎస్‌ఈబీకి చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేయడం హర్షణీయం.
– వి.లక్ష్మణరెడ్డి, మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top