కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలకు సౌకర్యాల లేమి | No facilities for Family planning operations camp | Sakshi
Sakshi News home page

కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలకు సౌకర్యాల లేమి

Nov 6 2013 6:02 AM | Updated on Sep 2 2017 12:20 AM

కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న వారికి ప్రభుత్వం నగదు ప్రోత్సాహమిస్తోంది. దీనిపై క్షేత్రస్థాయి నుంచి ప్రచారం నిర్వహిస్తోంది.

ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న వారికి ప్రభుత్వం నగదు ప్రోత్సాహమిస్తోంది. దీనిపై క్షేత్రస్థాయి నుంచి ప్రచారం నిర్వహిస్తోంది. కానీ ఎక్కువ మంది ప్రభుత్వ వైద్యశాలల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకునేందుకు వెనుకంజ వేస్తున్నారు. దీనికి అధికారుల ఉదాసీన వైఖరే కారణమని మంగళవారం ఒంగోలులోని మాతా శిశు వైద్యశాల వద్ద పీపీ యూనిట్‌లో నిర్వహించిన కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల వైద్య శిబిరం నిర్వహణే నిదర్శనం. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల కోసం ముందుగా 88 మంది దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు మాత్రం 40 మడత మంచాలను తెప్పించారు. రెగ్యులర్ యూనిట్‌లో మరో 20 మంచాలున్నాయి. అయితే బాలింతలతోపాటు బంధువులు వచ్చారు. వీరి కోసం కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేదు. తల్లులు శస్త్ర చికిత్సలకు వెళ్లినప్పుడు చంటి పిల్లలతో బంధువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అక్కడే చెట్లకు ఊయలలు ఏర్పాటు చేసుకుని పిల్లలను ఆడించారు.
 
 మొత్తం 68 మంది బాలింతలకు శస్త్రచికిత్సలను నిర్వహించినట్లు పీపీ యూనిట్ క్యాంప్ అధికారి డాక్టర్ జే నాగేశ్వరరావు తెలిపారు. వీరికి 8,880 నగదు ప్రోత్సాహం, ధ్రువీకరణ పత్రాలు అందించామన్నారు. రిమ్స్ శస్త్రచికిత్సల నిపుణుడు డాక్టర్ వెంకయ్య శస్త్ర చికిత్సలను పర్యవేక్షించారన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు తిరుమలరావు, సాయికృష్ణ, వసుధ పాల్గొన్నారు.
 
 డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ
 కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల శిబిరాన్ని డీఎంహెచ్‌ఓ డాక్టర్ రామతులశమ్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవలపై బాలింతలతో మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement