రాజధానిలో ఇసుక తవ్వకాల వివరాలివ్వండి

NGT command to the both the telugu state govts - Sakshi

ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశం 

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో సాగుతున్న ఇసుక తవ్వకాలపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్జీటీ) ఆదేశించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విచ్చలవిడిగా కొనసాగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను సవాల్‌ చేస్తూ ‘రేలా’అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ యూడీ సాల్వీ నేతృత్వంలోని ఎన్జీటీ ధర్మాసనం బుధవారం విచారించింది.

ప్రకాశం బ్యారేజీలో పూడికతీత పేరుతో ప్రభుత్వం భారీ యంత్రాలతో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతోందని పిటిషనర్ల తరఫు న్యాయవాది శ్రావణ్‌కుమార్‌ పేర్కొన్నారు. అక్కడ లభ్యమయ్యే ఇసుకను రాజధాని నిర్మాణానికి మాత్రమే వినియోగిస్తున్నామని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది ప్రమోద్‌ వెల్లడించారు. రాజధాని ప్రాంతంలో కాంట్రాక్టు సంస్థలు చేపట్టే నిర్మాణాలకు గాను ఇసుక కోసం ప్రభుత్వం ఇస్తున్న నిధులపై పూర్తి వివరాలను తమకు అందజేయాలని ఎన్జీటీ ట్రిబ్యునల్‌ ఆదేశించింది. అనంతరం అక్కడ జరుగుతున్న ఇసుక తవ్వకాలు అక్రమమా? సక్రమమా? అనేది తేలుస్తామని స్పష్టం చేసింది.

తెలంగాణ వివరాలు కూడా ఇవ్వండి : తెలంగాణ రాష్ట్రంలో పూడికతీత పేరుతో నదుల నుంచి ఇసుకను తవ్వేస్తూ, అక్కడి ప్రభుత్వం అమ్ముకుంటోందని, వీటికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని న్యాయవాది శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. తెలంగాణలో తవ్వుతున్న ఇసుకను ప్రజోపయోగ ప్రాజెక్టుల నిర్మాణాలకు వినియోగిస్తున్నట్టు తెలంగాణ తరఫు న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్‌ చెప్పారు. దీంతో తవ్వకాలు జరుగుతున్న తీరు, ఇసుక వినియోగానికి సంబంధించి వివరాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ట్రిబ్యునల్‌ ఆదేశించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top