ఏపీలో కొత్త ఉద్యోగ సంఘాల జేఏసీ

New Employee JAC In Andhra Pradesh - Sakshi

సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో మరో కొత్త ఉద్యోగ సంఘాల జేఏసీ ఏర్పాటైంది. అశోక్‌బాబు, బొప్పరాజు సంఘాల వల్ల ఉద్యోగులు నష్టపోతున్న కారణంగా ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్ సమాఖ్య ఏర్పాటు చేసినట్లు నూతన జేఏసీ కన్వీనర్‌ వెంకట్రామి రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పుడున్న ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల సమస్యల కోసం పోరాడకుండా ప్రభుత్వ భజన చేస్తున్నాయని మండిపడ్డారు. ఐఆర్‌, ఇళ్ల స్థలాలు ఇచ్చారంటూ సన్మానాలు, పాలాభిషేకాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ‘ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కోసం అమరావతిలో ఎకరానికి కోటికి పైగా రూపాయలు ఇస్తే.. దానికి సంబరాలు చేసుకున్నారు. ప్రైవేటు సంస్థలకు రూ. 30 లక్షలకు, రూ. 50లక్షలకు ఇచ్చిన ప్రభుత్వం....ఉద్యోగుల దగ్గర  కోటి రూపాయలు వసూలు చేసి.. స్థలాలు ఇస్తుందా’ అని ప్రశ్నించారు.

మీకసలు సిగ్గుందా?
కొత్తగా ఏర్పడే ఉద్యోగ సంఘాల సమాఖ్య ఉద్యోగుల సమస్యలపై పోరాడుతుందన్న వెంకట్రామిరెడ్డి... ‘సీపీఎస్ కోసం అనేక పోరాటాలు చేసాము. అయినా ప్రభుత్వం స్పందించలేదు. 54 సంఘాలు  ఇప్పటి వరకు మాకు మద్దతు ఇచ్చాయి. అమరావతి జేఏసీలో ఉన్న ఉద్యోగ  సంఘాలు కుడా మద్దతు తెలుపుతున్నాయి. మేము ఏర్పాటు చేస్తున్న సమాఖ్యలో వారంతా కలుస్తున్నారు. కొంతమంది రాజకీయ పదవుల కోసం సిగ్గు లేకుండా ప్రభుత్వం భజన చేస్తున్నారు. అసలు మీకు సిగ్గుందా.. ఉద్యోగుల సమస్యలు మీకు పట్టవా’ అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు అశోక్‌ బాబు ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు తనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన... టీడీపీతోనే రాష్ట్రభివృద్ధి సాధ్యమని చెప్పుకొచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top