న్యాయవాది కిడ్నాప్‌నకు యత్నం | Nellore Polices failed to kidnap Lawyer against Case for Nellore ZPTC elections | Sakshi
Sakshi News home page

న్యాయవాది కిడ్నాప్‌నకు యత్నం

Jul 16 2014 2:17 AM | Updated on Oct 20 2018 6:23 PM

న్యాయవాది కిడ్నాప్‌నకు యత్నం - Sakshi

న్యాయవాది కిడ్నాప్‌నకు యత్నం

నెల్లూరు జెడ్‌పీటీసీ ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందంటూ హైకోర్టులో రిట్‌లు దాఖలు చేసిన న్యాయవాదిని..

* నెల్లూరు జెడ్‌పీ ఎన్నికలపై హైకోర్టుకు ఫిర్యాదు చేసిన న్యాయవాది కిడ్నాప్‌నకు యత్నం
* హైదరాబాద్‌లో తెగబడ్డ ఆగంతకులు - స్థానికుల ప్రతిఘటనతో పలాయనం
* ఆగంతకులు మఫ్టీలో వచ్చిన నెల్లూరు పోలీసులుగా అనుమానం
* బంజారాహిల్స్ పీఎస్‌లో న్యాయవాది ఫిర్యాదు

 
సాక్షి, హైదరాబాద్: నెల్లూరు జెడ్‌పీటీసీ ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందంటూ హైకోర్టులో రిట్‌లు దాఖలు చేసిన న్యాయవాదిని.. నెల్లూరుకు చెందిన పోలీసులుగా భావిస్తున్న వారు హైదరాబాద్‌లో కిడ్నాప్ చేసేందుకు మంగళవారం సాయంత్రం విఫలయత్నం చేశారు. న్యాయవాది, స్థానికులు ప్రతిఘటించడంతో కారులో వచ్చిన మఫ్టీ పోలీసులు పారిపోయారు. నెల్లూరు జెడ్‌పీటీసీ ఎన్నికలు సక్రమంగా జరగడంలేదని, పోలీసులు - అధికార పక్ష నేతలు కుమ్మకై అక్రమాలకు పాల్పడుతున్నారని, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపిస్తూ సుధాకర్‌రెడ్డి మంగళవారం హైకోర్టులో నాలుగు రిట్‌లు దాఖలు చేశారు. ఈ రిట్‌లు బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. రిట్ దాఖలు చేసిన సుధాకర్‌రెడ్డి.. ఇద్దరు స్నేహితులు, ఏజీపీ అల్లం రమేశ్‌లతో కలిసి సాయంత్రం 5.30 గంటలకు హైకోర్టు నుంచి బంజారాహిల్స్‌లోని తన కార్యాలయానికి బయలు దేరా రు. వీరి కారు వెనుకే ఇన్నోవా సిల్వర్ కలర్ కారు (నంబర్ ఏపీ 26ఏపీ 9559) అనుసరించసాగింది. ఈ విషయాన్ని గమనించిన సుధాకర్‌రెడ్డి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13 (మినిస్టర్ రోడ్డు)లోకి కారును నడిపిం చారు. శ్మశాన వాటిక సమీపంలో సుధాకర్‌రెడ్డి కారును ఇన్నోవాలోని వారు అడ్డగించి ఆపారు. అందులోంచి ఇద్దరు యువకులు దిగి ‘‘సీఐ సారు పిలుస్తున్నార’’ంటూ సుధాకర్‌రెడ్డిని బలవంతంగా కారులోంచి దించి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆయన వెంట ఉన్న ఏజీపీ రమేష్‌తో పాటు స్థానిక యువకులు వారిని అడ్డుకున్నారు.
 
 అప్పటికే సివిల్ దుస్తుల్లో ఉన్న సీఐ.. ‘‘నెల్లూరు రూరల్ డీఎస్‌పీ రాంబాబు నిన్ను ఈడ్చుకు రమ్మన్నాడురా.. నీవు మా మీదనే హైకోర్టులో రిట్ వేస్తావా..? రేపు కోర్టులో ఎలా వాదిస్తావో చూస్తామురా...’’ అంటూ సుధాకర్‌రెడ్డిని   దుర్భాషలాడాడు. ‘‘నిన్నే కాదు వైఎస్సార్‌సీపీ నామిని అయిన రాఘవేందర్‌రెడ్డిని ఈరోజు రాత్రికి ఎత్తుకెళ్తున్నామురా’’ అంటు హెచ్చరించారు. ఇంతలో పెద్ద సంఖ్యలో స్థానికులు పోగైన విషయం గమనించిన ఇన్నోవాలో వచ్చిన వారంతా అక్కడి నుంచి జారుకున్నారు. అనంతరం సుధాకర్‌రెడ్డి నేరుగా బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తన ను నెల్లూరు పోలీసులు కిడ్నాప్ చేసేందుకు యత్నించారని, తన ప్రాణానికి హాని ఉందని వారిపై చర్యలు తీసుకోవాలని లిఖిత పూర్వకంగా ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. రాజకీయ రాక్షసులు తనపై వేధింపులకు పాల్పడుతున్నారని సుధాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. తన వృత్తిపరంగా ప్రాణం పోయి నా.. కడదాక న్యాయం కోసం పోరాడుతానని మీడియాతో పేర్కొన్నారు.
 
 న్యాయవ్యవస్థపై దాడి దుర్మార్గం: కాకాణి
 నెల్లూరు: అధికారాన్ని అడ్డుపెట్టుకుని న్యాయవ్యవస్థపై దాడి చేయడం దుర్మార్గమని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్‌పీటీసీలకు న్యాయం చేసేందుకు కోర్టులో పోరాడుతున్న న్యాయవాది సుధాకర్‌రెడ్డిని పోలీసుల ద్వారా కిడ్నాప్‌నకు యత్నించడం టీడీపీ పాలన అరాచకత్వానికి పరాకాష్ట అని ధ్వజమెత్తారు. అధికారపక్షం పోలీ సులతో కుమ్మక్కయి న్యాయవాదిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించటం.. ప్రజాస్వామ్య విలువలు దారుణంగా పడిపోయాయనేందుకు నిదర్శనమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement