సౌర వెలుగులపై నిర్లక్ష్యపు నీడ..! | negligence on solar power projects | Sakshi
Sakshi News home page

సౌర వెలుగులపై నిర్లక్ష్యపు నీడ..!

Feb 19 2018 2:31 PM | Updated on Oct 22 2018 8:31 PM

negligence on solar power projects - Sakshi

విజయనగరం, పార్వతీపురం: సౌర విద్యుత్‌ వెలుగులకు మున్సిపాలిటీలు దూరమవుతున్నాయి. పాలకులు, అధికారుల అలక్ష్యంతో బిల్లుల భారాన్ని మోస్తున్నాయి. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో సోలార్‌ విద్యుత్‌ ఉత్పాదక కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు జిల్లా అధికారులు ప్రతిపాదనలు సైతం పంపించారు. అయితే... యూనిట్లు కేవలం విజయనగరం, బొబ్బిలి మున్సిపాలిటీల్లోనే ఏర్పాటుచేశారు. మిగిలిన నెల్లిమర్ల, సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీల్లో యూనిట్ల ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణలో అధికారుల నిర్లక్ష్యం వెలుగులను దూరం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ పరిస్థితి...
విద్యుత్‌ బిల్లుల భారాన్ని తగ్గించుకోవాలని కేంద్రం సూచించింది. యూనిట్ల ఏర్పాటుకు 60 శాతం నిధులను సమకూర్చుతామని, మిగిలిన 40 శాతం నిధులను మున్సిపాలిటీలు భరించుకోవాలని సూచించింది. ఇందులో భాగంగా విజయనగరం, బొబ్బిలి పురపాలక సంఘాలు సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటుచేసుకుని ప్రస్తుతం విద్యుత్‌ బిల్లుల భారాన్ని 30 శాతం మేర తగ్గించుకున్నాయి. మిగిలిన మున్సిపాలిటీల్లో ఈ సౌర విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయడంలో పాలకులుగాని, అధికారుల గాని చొరవచూపడం లేదు. వాస్తవంగా 25 సంవత్సరాల పాటు లీజు ప్రాతిపధికన సౌర విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసి తక్కువ ధరకే విద్యుత్‌ను అందించాలనేది ప్రతిపాదన. 25 సంవత్సరాల తరువాత ఈ సౌర విద్యుత్‌ ప్లాంట్లను మున్సిపాలిటీలకు అప్పగించాలన్నది నిబం ధన.

పార్వతీపురం మున్సిపాలిటీలో రూ.5 కోట్లతో 25 సంవత్సరాల లీజు ప్రాతిపదికన నెడ్‌ క్యాప్‌ అధికారులు ప్రతిపాదనలు చేశారు. ఇందుకు వెంకపేట గోరీల వద్ద స్థల పరిశీలన చేశారు. అయితే, ఆ స్థలం చెరువుగా గుర్తించి కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు అంగీకారం తెలపలేదు. తర్వాత తోటపల్లి పంపుహౌస్‌వద్దకు మార్చారు. అక్కడ ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రత్యేక ఎలక్ట్రికల్‌ ఫీడర్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఆ శాఖ అధికారులు చెప్పడం, దీనికోసం రూ.50 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనాలు వేశారు. ఇంత ఖర్చు ఇప్పట్లో భరించలేమంటూ మున్సిపల్‌పాలకులు, అధికారులు చేతులెత్తేశారు.

సాలూరులో సోలార్‌ యూనిట్‌ ఏర్పాటుచేస్తే వీధిలైట్ల బిల్లు నెలకు రూ.1.06 లక్షలు, ము న్సిపల్‌ కార్యాలయానికి వెయ్యి, పంపు హౌస్‌ నుంచి రూ.2.20 లక్షలు, పైలెట్‌ పథకాలకు రూ.45వేల విద్యుత్‌ బిల్లులు ఆదా అయ్యే అవకాశం ఉన్నా అడుగు ముందుకు పడడం లేదు.

నెల్లిమర్లలో....
నెల్లిమర్ల తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఎకరన్నర స్థలంలో సోలార్‌ విద్యుత్‌ ప్లాంటు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సుమారు రూ.30 లక్షలు ఖర్చు అవుతుందని అంచనాలు రూపొందించారు. ఇక్కడ కూడా అడుగు  ముందుకు పడలేదు. ప్రసత్తుం అన్ని కేటగిరీల్లో రూ.3.20 లక్షల వరకు విద్యుత్‌ బిల్లు వస్తోంది. సోలార్‌ విద్యుత్‌ కేంద్రం ఏర్పాటైతే ఈ బిల్లులో 30 శాతం ఆదా అయ్యేదని విద్యుత్‌ శాఖ అధికారులే చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement