పిక్టో‘రియల్‌’లో దిట్ట సోమరాజు

National Photography Awards Won Mereti Somaraju - Sakshi

2019లో నాలుగు జాతీయ పురస్కారాలు

నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం

సాక్షి, కరప (కాకినాడ రూరల్‌): చేసే వృత్తి ఏదైనా ఏకాగ్రత, పట్టుదలతో పనిచేస్తే రాణించవచ్చని అనాదిగా నిరూపణ అవుతూనే ఉంది. గురు ముఖతా కొందరు, జిజ్ఞాసతో కొందరు కొన్ని సాధన చేసి సాధిస్తారు. అటువంటి వారిలో అభీష్టం కొద్దీ ఫొటోలు తీయడం ప్రారంభించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు మండలంలోని గొర్రిపూడి గ్రామానికి చెందిన మేరేటి సోమరాజు. చేనేత కార్మిక కుటుంబానికి చెంది మగ్గం పట్టాల్సిన చేతులు కెమెరా పట్టి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందారు. స్వయంకృషికి తోడు కుటుంబ సభ్యుల ప్రోద్బలం, స్నేహితుల ప్రోత్సాహంతో 2016లో అమెరికా వారి నుంచి రెండు, రాష్ట్రం నుంచి మరొకటి పురస్కారాలు గెలుచుకుని పిక్టోరియల్‌ ఫొటోగ్రఫీలో సత్తా చాటుకున్నారు సోమరాజు.

2017లో తెనాలి శ్రీఅజంతా కళారామం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరో జాతీయస్థాయి పోటీల్లో ఫొటోగ్రఫీ విభాగంలో ద్వితీయ బహుమతి గెలుపొందారు. 2019లో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా మత్స్యకారుల జీవనవిధానంపై తీసిన చిత్రం జాతీయస్థాయిలో నాలుగు పురస్కారాలు దక్కించుకున్నారు. సొంతూరు గొర్రిపూడి గ్రామమైన కాజులూరు మండలం గొల్లపాలెంలో కాకినాడలోని సర్పవరం వద్ద గాయత్రీ ఫొటో స్టూడియో నిర్వహిస్తున్న సోమరాజు తన ప్రస్థానాన్ని తెలియజేస్తూ.. గొర్రిపూడి గ్రామానికి చెందిన మేరేటి రామారావు, లక్ష్మీకాంతం తన తల్లిదండ్రులని తెలిపారు. కాకినాడలో ఐటీఐ వరకు చదివానని, ఆ సమయంలోనే యషికా కెమెరాతో సరదాగా ఫొటోలు తీసేవాడినని తెలిపారు.

1996లో తల్లిదండ్రులు వివాహం చేయడంతో చేనేతవృత్తిలో స్థిరపడడం ఇష్టంలేక జీవనోపాధి కోసం గొల్లపాలెంలో ఫొటో స్టూడియో పెట్టానని, ప్రస్తుతం సర్పవరం జంక్షన్‌వద్ద ఫొటో స్టూడియో నిర్వహిస్తున్నానని తెలిపారు. స్నేహితులు తుమ్మల వీరభద్రరావు (కాకినాడ), వడ్డాది సూర్యప్రకాశరావు (వెల్ల)లకు ఫొటోగ్రఫీలో అవార్డులు రావడంతో వారిని స్ఫూర్తిగా తీసుకుని వారి నుంచి మెళకువలు తెలుసుకుని సాధన చేశారు సోమరాజు. మొదటిసారి స్నేహితులతో కలసి 2015 మేనెలలో విశాఖ జిల్లా అరకు వెళ్లినప్పుడు అక్కడ గిరిజనుల జీవనశైలిపై ఫొటోలు తీశానని, అదే యేడాది అక్టోబరులో, 2016 జనవరిలో అరకు, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు వరకు వెళ్లి గిరిజనుల జీవనశైలిపై ఫొటోలు తీసి స్నేహితుల ద్వారా అమెరికా, లండన్, ఫ్రాన్స్‌లకు పంపినట్టు తెలిపారు.

అంతర్జాతీయ పురస్కారాల ఎంపిక ఇలా..
ఏటా బ్రిటిష్‌ రాయల్‌ ఫొటోగ్రఫీ సొసైటీ (లండన్‌), ఫొటో సొసైటీ ఆఫ్‌ అమెరికా (అమెరికా), ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్‌ డీలా ఆర్ట్స్‌ ఫొటోగ్రఫీ (ఫ్రాన్స్‌)లతో పాటు ఇమేజ్‌కాలేజ్‌ సొసైటీ ఆఫ్‌ అమెరికా సంస్థలు ఉత్తమ ఫొటోగ్రాఫర్లను గుర్తించి అవార్డులు ప్రదానం చేస్తుంటారు. 2017లో ఆ పోటీలకు అంతర్జాతీయంగా అనేక దేశాలు పోటీపడగా గిరిజన జీవనశైలిపై తాను తీసిన ఛాయాచిత్రాలకు అత్యున్నత పురస్కారం లభించిందని అన్నారు. అమెరికాకు చెందిన ఇమేజ్‌ కాలేజ్‌ సొసైటీ చైర్మన్‌ టోని లికిస్‌తాన్‌ న్యాయనిర్ణేతగా వ్యవహరించిన ఈ పోటీల్లో తనను పురస్కారానికి ఎంపిక చేయడమే కాకుండా సొసైటీలో జీవితకాల సభ్యత్వం ఇచ్చారన్నారు.

ఈ అవార్డులను ఆ సంస్థలు విజయవాడలోని ప్రతినిధులకు పంపించగా 2016 సెప్టెంబరులో ఆంధ్రప్రదేశ్‌ ఫొటో అకాడమీ నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవంలో ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌ చేతులమీదుగా అందుకున్నట్టు తెలిపారు. అలాగే 2017లో ఆంధ్రప్రదేశ్‌ భాషా సాంస్కృతికశాఖ సాఫల్య పురస్కారం (అచీవ్‌మెంట్‌ అవార్డు) అందజేసినట్టు ఆయన చెప్పారు. 2017లో జాతీయస్థాయిలో ద్వితీయ బహుమతి: తెనాలిలోని శ్రీఅజంతా కళారామం ఏటా పెయింటింగ్, క్రాఫ్ట్‌వర్క్, ఫొటోగ్రఫీ విభాగాల్లో జాతీయస్ధాయిలో పోటీలునిర్వహిస్తుంటారు. ఫొటో గ్రఫీ విభాగంలో ‘గో టు ఫీల్డ్‌’ ఛాయాచిత్రానికి ద్వితీయ బహుమతి లభించింది. గిరిజనులు మేకలను తోలుకెళ్తున్నట్టు తీసిన చిత్రం బహుమతి తెచ్చిపెట్టింది.

2019లో జాతీయస్థాయిలో నాలుగు అవార్డులు: ఈ ఏడాది 180వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ ఫొటోగ్రఫీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో న్యూఢిల్లీ, బెంగళూరు, గౌహతి, ఇండోర్‌ కేంద్రాలుగా జాతీయస్థాయిలో నిర్వహించిన పోటీలకు సోమరాజు మత్స్యకారుల జీవన విధానంపై పిక్టోరియల్‌ ఫొటోగ్రఫీలో పంపిన ‘డే ఎండ్‌’ చిత్రాలకు నాలుగు కేంద్రాల్లో పురస్కారాలు లభించాయి. మత్స్యకారులు కాకినాడ బీచ్‌లో పడవ తోసుకుని సముద్రంలోకి వెళ్తున్నప్పుడు తీసిన చిత్రానికి జాతీయస్థాయిలో నాలుగు పురస్కారాలను సోమరాజు సొంతం చేసుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top