‘సైబర్‌ మిత్ర’కు కేంద్రం అవార్డు | National Award for State Police Department | Sakshi
Sakshi News home page

‘సైబర్‌ మిత్ర’కు కేంద్రం అవార్డు

Dec 7 2019 4:59 AM | Updated on Dec 7 2019 5:03 AM

National Award for State Police Department - Sakshi

అవార్డును అందుకుంటున్న ఏపీ టెక్‌ సర్వీసెస్‌ డీఐజీ పాల్‌రాజ్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అమలు చేస్తున్న ‘సైబర్‌ మిత్ర’కు కేంద్ర ప్రభుత్వ అవార్డు లభించింది. ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖ.. డేటా సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (డీఎస్‌సీఐ) ఎక్స్‌లెన్సీ అవార్డు–2019ను ప్రకటించింది. దీన్ని శుక్రవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఏపీ పోలీస్‌ టెక్‌ సర్వీసెస్‌ డీఐజీ పాల్‌రాజ్‌ అందుకున్నారు. మహిళలపై పెరిగిపోయిన సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో కొద్ది రోజుల కిత్రం ‘సైబర్‌ మిత్ర’ను ప్రారంభించారు. ‘సెక్యూరిటీ ఫర్‌ ఉమెన్‌ ఇన్‌ సైబర్‌ స్పేస్‌’ పేరుతో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పర్యవేక్షణలో సైబర్‌ మిత్ర మంచి ఫలితాలను సాధిస్తోందని పాల్‌రాజ్‌ చెప్పారు. ఇప్పటివరకు 400కు పైగా సైబర్‌ సంబంధిత ఫిర్యాదులను పరిష్కరించామన్నారు.

నిరంతరం అందుబాటులో సైబర్‌ యోధులు..
- సైబర్‌ మిత్రలో భాగంగా జిల్లా, సబ్‌ డివిజన్‌ స్థాయిల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సైబర్‌ వారియర్‌ (సైబర్‌ యోధులు) అనే కాన్సెప్ట్‌ ద్వారా నిపుణుల సేవలను అందుబాటులోకి తెచ్చారు. వీరు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటారు. 
సైబర్‌ బృందాలకు సాఫ్ట్‌వేర్‌తో కూడిన ఆధునిక పరికరాలను, సైబర్‌ కిట్లను అందుబాటులో ఉంచారు. సైబర్‌ నేరగాళ్లు వాడే సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ వంటి వాటిని సులువుగా తెలుసుకోవడానికి సైబర్‌ బృందాలు వీటిని వినియోగిస్తాయి.
సైబర్‌ సంబంధిత సమస్యలు ఎదుర్కొనేవారు ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేశారు. 
సమస్య ఉత్పన్నమైనప్పుడు తక్షణం స్పందించి పరిష్కరించడానికి పోలీస్‌ శాఖ సహాయం అందిస్తుంది. 
సైబర్‌ నేరాల బారిన పడే మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు నేరుగా 112, 181, 100 టోల్‌ఫ్రీ నంబర్లు, 9121211100 వాట్సాప్‌ నంబర్‌కు ఫిర్యాదు చేసేలా పాఠశాలలు, కళాశాలల్లో ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement