
గూగుల్‌లో నాకే ఉద్యోగం రాలేదు..మీకొస్తుందా?
ప్రపంచంలో అతి పెద్ద స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదివిన తనకే గూగుల్‌లో ఉద్యోగం రాలేదని..
యువతతో చులకనగా మాట్లాడిన నారా లోకేష్
యాంటీ ర్యాగింగ్ సమావేశానికి విద్యార్థుల కొరత
విజయవాడ : ప్రపంచంలో అతి పెద్ద స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదివిన తనకే గూగుల్‌లో ఉద్యోగం రాలేదని.. మీకెలా వస్తుందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు విద్యార్థి వర్గంలో కలకలం రేపాయి. నిత్యం ఎంతోమంది కార్యకర్తలు తమ పిల్లలకు గూగుల్‌లో ఉద్యోగానికి సిఫార్సు చేయాలంటూ తనవద్దకు వస్తున్నారని, తనకే రానప్పుడు వారికెలా వస్తుందని చెప్పి తిరిగి పంపించి వేస్తున్నట్లు లోకేష్ పేర్కొనడం చర్చనీయాంశమైంది. బుధవారం దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియంలో తెలుగునాడు విద్యార్థి సమాఖ్య(టీఎన్‌ఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి యాంటీ ర్యాగింగ్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన లోకేష్ పైవ్యాఖ్యలు చేయడం విద్యార్థుల్లో చర్చనీయాంశంగా మారింది. బాగా చదివితే గూగుల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించడం కష్టమా? స్టాన్‌ఫర్డ్‌లో చదవితేనే అందులో ఉద్యోగాలు వస్తాయా? అంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. కార్యకర్తల బిడ్డల్ని ప్రోత్సహించాల్సిన లోకేష్ వారిని నీరుగార్చేలా మాట్లాడటం తగదంటున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు సత్య నాదెళ్లను ఉదాహరణగా చెబుతుంటే మరోవైపు లోకేష్ తన గురించి చెప్పుకోవడంపై విద్యార్థులు పెదవి విరుస్తున్నారు.
లోకేష్‌ను కలిసిన రిషితేశ్వరి తల్లిదండ్రులు
రిషితేశ్వరి తల్లిదండ్రులు మురళీకృష్ణ దంపతులు నారా లోకేష్‌ను కలిశారు. రిషితేశ్వరి మరణానికి కారణమైన వారు ఏ స్థాయిలో ఉన్నా ప్రభుత్వం శిక్షించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
విద్యార్థుల తరలింపు
నగరంలో కార్పొరేట్ విద్యాసంస్థల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు లోకేష్ ప్రసంగం ఉంటుందని చెప్పడంతో విద్యార్థులను తీసుకువచ్చారు. సాయంత్రం ఐదు గంటల వరకు లోకేష్ రాకపోవడంతో వారిని వెనక్కి తీసుకువెళ్లిపోయారు. దీంతో లోకేష్ మాట్లాడే సమయంలో సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి.
స్పృహతప్పిన విద్యార్థి సంఘ నేత
సమావేశాన్ని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేయడంతో ఫ్యాన్ల సౌకర్యం సరిగా లేక ఉక్కపోతతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. లోకేష్ ప్రసంగిస్తుండగానే పశ్చిమగోదావరి జిల్లా టీఎన్‌ఎస్‌ఎఫ్ నేత పత్తిపాటి ధర్మేంద్ర స్పృహతప్పి పడిపోయాడు. దీంతో అతడికి ప్రథమ చికిత్స చేశారు.