రాజధానిలో సమైక్య శంఖారావం విజయం జిల్లాలోని కాంగ్రెస్, దేశం పార్టీల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. భారీ వర్షాలు ... వెల్లువెత్తుతున్న వరద ... తెగిపోయిన రహదారులు ...
సాక్షి, విజయవాడః రాజధానిలో సమైక్య శంఖారావం విజయం జిల్లాలోని కాంగ్రెస్, దేశం పార్టీల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. భారీ వర్షాలు ... వెల్లువెత్తుతున్న వరద ... తెగిపోయిన రహదారులు ... రైలు పట్టాలపై వరద నీరు ... ఇన్ని ఇక్కట్ల మధ్య జిల్లా దాటలేని పరిస్థితి. ఇంకెక్కడ హైదరాబాదుకు పయనం ... సభ విజయం అంటూ చంకలు గుద్దుకున్న అధికార, విపక్షాలు శనివారం సాయంత్రం ఐదు గంటల తరువాత గొంతులో పచ్చి వెలక్కాయపడ్డట్టయింది. బయటకు రావడానికి ... తమ అనుచరుల్లో కలుసుకోవడానికి కూడా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు.
ఒక వైపు చంద్రబాబు రాష్ట్ర విభజనకు కట్టుబడి ఉన్నానని, సీమాంధ్ర కోసం ప్యాకేజ్‌లు ప్రకటించడమే కాకుండా ఏకంగా ఢిల్లీ వెళ్లి విభజనకు అనుకూలంగా ధర్నా చేసిన నేపథ్యంలో జననేత జగన్‌మోహన్‌రెడ్డి సమైక్యాంధ్రప్రదేశ్‌కు సంపూర్ణమద్దతు ప్రకటించడంతో జిల్లా తెలుగుదేశం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం జిల్లాలో పర్యటించినప్పుడైనా అనుకూలంగా మాట్లాడాడంటే అదీ లేదాయే. ఈ సమయంలో జనంలోకి ఎలా వెళ్లేదీ ... ఏ సమాధానం చెప్పేదంటూ తమ ద్వితీయ క్యాడర్ వద్ద నేతలు వాపోతున్నారు.
దీనికి తోడు ఆ పార్టీ నుంచి వచ్చిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఏకంగా ఆ వేదికపై నుంచి ‘దేశం’ పార్టీకే కాదు ఈ జిల్లా నేతలకు కూడా తన ఉపన్యాసంలో మర ఫిరంగులే విసిరారు. విభజన ప్రక్రియను చేపట్టిన దుర్మార్గుడు చంద్రబాబునాయుడని, ఒక ఓటు.. రెండు రాష్ట్రాలన్న బీజేపీతో 1999లో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ఆ విషయాన్ని మరిచిపోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు తన పిచ్చికుక్కలను తమ నాయకుల మీదకు వదిలితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 150 మంది సంతకాలు పెట్టినా పదవికి ఆశ పడని నైజం జగన్‌దని, కానీ చంద్రబాబు మాత్రం ఎమ్మెల్యేలతో వైస్రాయ్ హోటల్‌లో క్యాంపు రాజకీయాలు నడిపి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన విషయాన్ని ‘తెలుగుదేశం’ దొంగలు తెలుసుకోవాలని ఘాటుగా చురకలు అంటించడంతో జిల్లా నేతల గుండెల్లో గుబులు పుడుతోంది.
జగన్, బాబులపై చర్చ...
జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రబాబునాయుడుల ప్రసంగాల్లో ఎంతో వ్యత్సాసం ఉందని, జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంగా తన అభిప్రాయాన్ని చెబితే చంద్రబాబునాయుడు ‘నీకు ఎంత మంది కొడుకులు.. నువ్వు ఎవర్ని ప్రేమిస్తావంటూ’ ప్రశ్నలతో వేధిస్తూ ఉండటంతో ప్రజల్లో పార్టీ పలచనై పోతోందని సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సభకు వచ్చినవారికి కృతజ్ఞతలు : భాను
అత్యంత ప్రతికూల పరిస్థితిలో సైతం... భారీ వర్షాలు, తుపాన్‌తో అష్టకష్టాలు పడుతున్నా హైదరాబాద్ సమైక్య శంఖారావానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలు, నేతలకు వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సభకు కార్యకర్తలకే కాకుండా ఉద్యోగ సంఘాల జేఏసీ తరఫున కూడా వేలాది సంఖ్యలో తరలివచ్చి పాల్గొన్నారని చెప్పారు.