‘నాలా’ బిల్లుకు ఆమోదం

'Nalla' bill passed - Sakshi

చట్టసభలు ఆమోదించిన బిల్లుపై సంతకం చేసిన గవర్నర్‌

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ భూ వినియోగ మార్పిడి (నాలా) చట్ట సవరణ బిల్లుకు ఎట్టకేలకు గవర్నర్‌ నరసింహన్‌ ఆమోద ముద్ర వేశారు. శాసనసభ, శాసనమండలి గత నెలలో ఆమోదించి పంపిన నాలా బిల్లుపై గవర్నర్‌ గురువారం సంతకం చేశారని హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌ వర్గాలు ధ్రువీకరించాయి.

నాలా రుసుము తగ్గింపు, నిబంధనల సవరణపై ఆర్డినెన్స్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడు నెలల క్రితం పంపిన ప్రతిపాదనలపై గవర్నర్‌ పలు సందేహాలను వ్యక్తం చేయడమే కాకుండా పునఃపరిశీలించాలంటూ ఫైల్‌ వెనక్కి పంపటం తెలిసిందే. అయితే దీన్ని పట్టించుకోకుండా, సందేహాలను నివృత్తి చేయకుండా ఆర్డినెన్స్‌ ఫైల్‌ను పక్కన పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం అవే అంశాలతో చట్టసభల్లో బిల్లు ఆమోదించింది.

రాజకీయ విమర్శలవల్లే గవర్నర్‌ లేఖ: తెలంగాణలో నాలా బిల్లును ఆమోదించిన గవర్నర్‌ ఆంధ్రప్రదేశ్‌ చట్టసభలు ఆమోదించిన నాలా బిల్లును మాత్రం పక్కనపెట్టటం వివక్షకు నిదర్శనమంటూ బీజేపీ శాసన సభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు విమర్శలు చేయటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. విష్ణుకుమార్‌రాజుతో సీఎం చంద్రబాబే ఈ విమర్శలు చేయించినట్లు రాజ్‌భవన్‌కు వేగులు చేరవేశారు. తనపై రాజకీయ విమర్శలపై కలత చెందిన నరసింహన్‌ కొందరు ఉన్నతాధికారులతోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు.

సీఎంకు లేఖ రాసిన గవర్నర్‌: ఈ నేపథ్యంలో  పూర్తి వివరాలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో నాలా ఆర్డినెన్స్, బిల్లు విషయాల్లో జరిగిన పరిణామాలను విశదీకరిస్తూ గవర్నర్‌ నేరుగా సీఎం చంద్రబాబుకే లేఖ రాశారు. ఈ పరిణామాల నేపథ్యంలో బిల్లుపై గవర్నర్‌ గురువారం సంతకం చేశారు.గవర్నర్‌ ఆమోదించిన నేపథ్యంలో త్వరలో నాలా సవరణ ఉత్తర్వులు జారీ కానున్నాయి. దీంతో విశాఖపట్నం, విజయవాడలో నాలా రుసుము 5 నుంచి 2 శాతానికి, మిగిలిన చోట్ల 9 నుంచి 3 శాతానికి తగ్గనుంది.

ఆరోపణల్లో నిజం లేదు: రాజ్‌భవన్‌ వర్గాలు: తెలంగాణ ప్రభుత్వం పంపిన నాలా బిల్లును ఆమోదించిన గవర్నర్‌ ఆంధ్రప్రదేశ్‌ చట్టసభలు ఆమోదించిన బిల్లును పక్కన పెట్టారంటూ కొందరు చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని రాజ్‌ భవన్‌ వర్గాలు స్పష్టం చేశాయి. ‘అసలు తెలంగాణ సర్కారు నుంచి నాలా బిల్లు ఇప్పటివరకూ రాజ్‌భవన్‌కే రాలేదని తెలిపాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top