బూర్జ: నాగావళి నది ఎడారిని తలపిస్తుంది. చుక్కనీరులేని పరిస్థితి నెలకొంది. వర్షాభావ పరిస్థితి కారణంగా నది ఇంకిపోయింది. ప్రతి ఏడాది ఆగస్టులో నది ఉగ్రరూపం దాల్చేది.
బూర్జ: నాగావళి నది ఎడారిని తలపిస్తుంది. చుక్కనీరులేని పరిస్థితి నెలకొంది. వర్షాభావ పరిస్థితి కారణంగా నది ఇంకిపోయింది. ప్రతి ఏడాది ఆగస్టులో నది ఉగ్రరూపం దాల్చేది. అటువంటిది ఈ ఏడాది నదిలో ఇసుకతిన్నెలు కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో విశిష్ట ప్రాధాన్యం సంచరించుకున్న నాగావళి నది నిండుకుంది. దీంతో ఆయకట్టు రైతులు ఈ ఏడాది ఖరీఫ్ వరి సాగుచేసేందుకు చుక్కనీరు అందించే పరిస్థితి కనిపించటంలేదు. ఏటా ఈ సమయానికి నదీతీరంలో ఉన్న ప్రాంతంలో ఉభాలు పూర్తయ్యేవి. ఈ ఏడాది నాట్లు పడక పొలాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బూర్జ, ఆమదాలవలస, పొందూరు, సంతకవిటి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, గార, మండలాలకు చెందిన 107 గ్రామాల్లోని 12 వేల మంది రైతులకు సంబంధించి 36,830 ఎకరాలకు ఏటా సాగునీరు అందించేది.
ఈ ఏడాది 1000 ఎకరాలకు కూడా సాగునీరు అందే పరిస్థితి లేదు. నదిలో నీరు లేకపోవడంను చూసి రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయానికి నారాయణపురం ఆనకట్టవద్ద గళగళ ప్రవహించే గంగమ్మ నదిలో కానరాకుండా పోయింది. వరుణుడు కూడా కరుణించే పరిస్థితి కనిపించటంలేదు. ప్రతి రోజు మేఘాలు ఊరిస్తున్నాయి తప్ప చినుకులు కూడా పడటంలేదు. నిత్యం రైతులు ఆకాశం వంక చూస్తు నీరుగారిపోతున్నారు. నాగావళి నదిలో నారాయణపురం ఆనకట్టను 7,774 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించారు. అయితే ప్రస్తుతం ఆనకట్ట వద్ద 200 కూసెక్కులు నీరు ఉంది.
ఈ పరిస్థితికి నీటిపారుదల శాఖ అధికారులు ముందు జాగ్రత్త లేకపోవటం కూడా ప్రధాన కారణమని రైతులు చెబుతున్నారు. నీరు నిల్వ చేసి ఉంటే ప్రస్తుతం ఖరీఫ్ దమ్ములు చేసుకునేందుకు ఇబ్బందులు ఉండేవి కావని వాపోతున్నారు. నదిలో నీరు లేక, వర్షాలు పడకపోవడంతో దమ్ములు చేయలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. మరో వారం రోజుల్లో వర్షాలు కురవకుంటే ఈ ఏడాది ఖరీఫ్ పంట కష్టమేనని అంటున్నారు. గత ఏడాది హుద్‌హుద్ తుపానుతో పంట కోల్పోయామని, ఈ ఏడాది అనావృష్టితో పంట చేతికందే పరిస్థితి లేదని చెబుతున్నారు. దీంతో వలసలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.