ఉద్యమం ఉధృతం

Movement escalates - Sakshi

ప్రత్యేక హోదా కోసం నిరసనలు

ఎస్వీయులో బంద్‌     విజయవంతం

తిరుపతిలో   వైఎస్సార్‌సీపీ కొవ్వొత్తుల ర్యాలీ

 అంబేడ్కర్‌ విగ్రహం వద్ద  అర్ధనగ్న ప్రదర్శన

ఢిల్లీలో ధర్నాకు మద్దతుగా  జిల్లావ్యాప్తంగా ఆందోళనలు

సాక్షి, తిరుపతి: ప్రత్యేక హోదా ఉద్య మం ఉధృతమైంది. ఎన్నికల ముందు బీజేపీ, టీడీపీ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చకపోవటంతో ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పోరుకు సిద్ధమయ్యారు. మూడున్నరేళ్లుగా ప్రత్యేక హోదా కోసం అలుపెరగకుండా ఉద్యమబాట పట్టారు. అధినేత పిలుపుతో జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళనలు చేస్తున్నారు. ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద సోమవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు చేపట్టిన ధర్నాకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో పార్లమెంటరీ నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సుధీర్‌ ఆధ్వర్యంలో బంద్‌ పాటించారు.

ఎస్వీయులోని అన్ని కార్యాలయాలు, కళాశాలలను బహిష్కరించి ప్రత్యేక హోదా నినాదాలతో హోరెత్తించారు. టంగుటూరి ప్రకాశం పంతులు భవనం వద్ద నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి అంబేడ్కర్‌ విగ్రహం వద్ద వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి ఆదేశాల మేరకు రాత్రి పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో క్యాండిల్‌ చేతబట్టి ప్రత్యేక హోదానే ముద్దు అంటూ ర్యాలీ నిర్వహించారు. చంద్రగిరిలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు నిరసన తెలియజేశారు.

శ్రీకాళహస్తిలో నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో గాలిగోపురం వద్ద వైఎస్సార్‌ సీపీ నేతలు మోకాళ్లపై నిల్చొని నిరసన తెలియజేశారు. కార్వేటినగరంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. పలమనేరులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ప్రత్యేక హోదాకోసం దీక్షలు నిర్వహించారు. కుప్పంలో నియోజకవర్గ సమన్వయకర్త చంద్రమౌళి ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. బస్టాండు ప్రాంగణంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టి, ప్రత్యేక హోదా తమ హక్కు అంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా రైతులు, వ్యాపారులు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top