‘పట్టిసీమ’లో పరమ రహస్యం!

‘పట్టిసీమ’లో పరమ రహస్యం! - Sakshi


* పట్టిసీమ ఎత్తిపోతల లక్ష్యం పోలవరం ప్రాజెక్టుతో నెరవేరుతుంటే కొత్తగా ఈ ‘లిఫ్ట్’ ఎవరి కోసం?

* రూ.1,300 కోట్ల దుబారా ఎందుకు?.. కాంట్రాక్టుల్లో కాసులు దండుకోవడానికే అని విమర్శలు

* పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే నీటిలో పొరుగు రాష్ట్రాల వాటా సంగతి మరిచారా?

* కృష్ణా, గోదావరికి ఒకే సమయంలో వరద వస్తే ఎత్తిపోతల నీటిని ఎక్కడ నిల్వ చేస్తారు?

* ఎనిమిది నెలలుగా ఒక్క పనీ చేయని సర్కారు.. ఏడాదిలో ఎత్తిపోతల నిర్మాణం పూర్తి చేస్తుందట!


 

 సాక్షి, హైదరాబాద్:
పట్టిసీమపై పట్టు ఎందుకు...? పోలవరంతో నెరవేరబోయే లక్ష్యాన్నే కొత్తగా చూపడం దేనికి..? ఒకటి కాదు రెండు కాదు.. రూ.1,300 కోట్లను ఎవరి జేబుల్లోకి ఎత్తిపోసేందుకు ఈ ఎత్తిపోతల..? పట్టిసీమ ఎత్తిపోతలపై చంద్రబాబు సర్కారు తీరుపై అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలివే! నాలుగేళ్లు గడిస్తే పోలవరం పూర్తవుతుంది.. గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు మళ్లించే అవకాశం ఏర్పడుతుంది..  ఇంతలోనే రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా పట్టిసీమ ఎత్తిపోతల అంటోంది! రూ.1,300 కోట్లు నీటిలో పోసేందుకు సిద్ధమవుతోంది. గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు మళ్లించాలన్న లక్ష్యం పోలవరంతో నెరవేరుతున్నప్పుడు పట్టిసీమ ఎందుకన్నది ప్రశ్న.

 

 అదీగాకుండా ఇందులో చిక్కుముడులున్నాయి. పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల నీటిలో పొరుగు రాష్ట్రాలు తమ వాటా అడిగే అవకాశం ఉంది. దీనికి ప్రభుత్వం వరద నీటిని లిఫ్ట్ చేసుకుంటే వాటా ఇవ్వాల్సిన అవసరం లేదంటోంది. అలాగయితే గోదావరికి వరదలు వచ్చే సమయంలోనే కృష్ణాకు కూడా వరదలు వస్తాయి. అప్పుడు పట్టిసీమ లిఫ్ట్ చేసిన నీటిని ఎక్కడికి పంపుతారు? చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడేనాటికే పోలవరం కుడికాలువ పనుల్లో 70 శాతం పూర్తయ్యాయి. మరో 30% పూర్తి చేస్తే సరిపోతుంది.ఈ ఎనిమిది నెలల్లో ఈ పనులు అంగుళమైనా కదల్లేదు. దీనికి చొరవ చూపని ప్రభుత్వం.. పట్టిసీమ ఎత్తిపోతలకు మాత్రం ఉత్సాహం చూపుతోంది.  ఈ ఎత్తిపోతలను  ఏడాదిలోనే పూర్తి చేస్తామని చెబుతుండడం హాస్యాస్పదంగా మారింది.

 

 పట్టిసీమ ఎత్తిపోతల పథకం అంతర్ రాష్ట్ర విభేదాలకు బీజం వేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోలవరం కుడి కాల్వ ద్వారా కృష్ణాడెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి నీటిలో ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకకు 35 టీఎంసీల వాటా ఉంది. ఈ మేరకు కృష్ణా నీటిని అదనంగా ఎగువన వినియోగించుకోడానికి బచావత్ ట్రిబ్యునల్ ఆయా రాష్ట్రాలకు అవకాశమిచ్చింది. పోలవరం ప్రాజెక్టు డీపీఆర్‌లోనే ఈ నిబంధన ఉంది. మిగతా 45 టీఎంసీల వాటా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందింది. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో.. ఈ 45 టీఎంసీల్లో తెలంగాణ కూడా వాటా అడిగే అవకాశం లేకపోలేదు. ఫలితంగా నీటిని 58:42 నిష్పత్తిలో పంచాల్సి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌కు దక్కేది 26 టీఎంసీలే. కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులతో సంబంధం లేకుండా నీటిని వాడుకుంటే.. వాటాల విభజన నుంచి తప్పించుకోవచ్చు. కానీ, ఇలా వాడుకునేందుకు ప్రభుత్వం వద్ద ఆచరణాత్మక ప్రణాళిక లేదని ఇంజనీర్లు చెబుతుండ గా.. వరద నీటిని లిఫ్ట్ ద్వారా తీసుకుంటే ఎగువ రాష్ట్రాలకు వాటా ఇవ్వక్కర్లేదని ప్రభుత్వం అంటోంది.

 

 నీటి నిల్వ ఎక్కడ..?

 వాస్తవానికి గోదావరికి సగటున వరద కాలం 45 రోజులు. అయితే గత కొన్నేళ్లుగా కనీసం 30 రోజులకు కూడా వరద నీరు వస్తున్న దాఖలాలు లేవు. అదే సమయంలో కృష్ణా నదికి కూడా వరదలుంటాయి. కృష్ణా పొంగి ప్రవహిస్తే గోదావరి నీరు తీసుకెళ్లాల్సిన అవసరం ఏమిటని అధికారులు ప్రశ్నిస్తున్నారు. గోదావరిలో వరద ఉన్నప్పుడు తీసుకెళ్లిన నీటిని నిల్వ చేయడానికి ఎక్కడా అవకాశం లేదు. గోదావరి నీటిని ప్రకాశం బ్యారేజీ ఎగువన కలపనున్నారు. ఆ బ్యారేజీ గరిష్ట సామర్థ్యం 3 టీఎంసీలే. కృష్ణాలో ప్రవాహం ఉన్నప్పుడు బ్యారేజీ వద్ద నీటిని నిల్వ చేయాల్సిన అవసరం ఉండదు. గోదావరి నుంచి లిఫ్ట్ చేసిన నీటిని కాల్వలో 2 టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే వరద తగ్గిన తర్వాత వినియోగించుకోవడానికి అవకాశం ఉంటే నీరు కేవలం 2 టీఎంసీలే!

 

 పోలవరం కుడి కాల్వ పనులు కదలవేం?

 పోలవరం కుడి కాల్వ పనులు ఇప్పటికే 70 శాతానికిపైగా పూర్తయ్యాయి. మిగతా 30 శాతం పనులు ఎక్కడిక్కడే ఆగిపోయాయి. ఈ పనులు పూర్తి కావాలంటే ఇంకా 1,770 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఈ భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానాలకు వెళ్లారు. రైతుల సమస్యలు పరిష్కరించి తక్షణం భూసేకరణ చేయడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. న్యాయస్థానాల్లో ప్రభుత్వానికి అనుకూలంగా వెంటనే తీర్పులు రాకపోతే.. ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నట్లుగా గోదావరి నీటిని వచ్చే ఖరీఫ్‌కు కాదు కదా మూడేళ్ల తర్వాత వచ్చే ఖరీఫ్‌కు కూడా కృష్ణా డెల్టాకు ఇవ్వడం సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. ఎత్తిపోతల పథకం పూర్తి చేయడంలో జాప్యం మరీ ఎక్కువైతే.. పట్టిసీమ పథకం చేపట్టీ ప్రయోజనం ఉండదు. పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత.. ఎటూ కుడి కాల్వ ద్వారా నీరు కష్ణా డెల్టాకు చేరుతుంది. ఎవరికీ ప్రయోజనం చేకూర్చని పథకాన్ని రూ.1,300 కోట్ల వ్యయంతో చేపట్టాలా అని గోదావరి జిల్లాల ప్రజలతో పాటు కృష్ణా డెల్టా రైతులూ ప్రశ్నిస్తున్నారు.

 

 ఉట్టికెక్కలేనమ్మ..

 ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతానంటే ఇదే! కృష్ణమ్మ నీరు పోటెత్తి ప్రవహించినప్పుడు ఆ జలాలను రాయలసీమకు తీసుకెళ్లడంలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం.. గోదావరి నీటిని మళ్లించగా, కృష్ణా డెల్టాలో మిగిలే నీటిని సీమలో వినియోగిస్తామని చెబుతోంది. శ్రీశైలం నిండిన తర్వాత పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44 వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని రాయలసీమకు తీసుకెళ్లడానికి అవకాశం ఉంది. విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించే మరో 4,500 క్యూసెక్కుల నీరు దీనికి అదనం. కృష్ణాలో 30 రోజుల పాటు వరద ఉంటుందని అంచనా. కిందటేడాది అంతకంటే ఎక్కువ రోజులే కృష్ణాకు వరద పోటెత్తింతి. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ గరిష్ట సామర్థ్యం మేరకు నీటిని తీసుకెళితే.. 30 రోజుల్లో 120 టీఎంసీల కన్నా ఎక్కువ నీటినే తీసుకెళ్లవచ్చు. కానీ ఈ ఏడాది తీసుకెళ్లింది 45-50 టీఎంసీలే! కృష్ణాలో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోలేని సర్కారు.. గోదావరి నీటిని తీసుకొచ్చి వాడుకుంటామని చెప్పడం వెనక అంతరార్థం ఏమిటోనని అధికార వర్గాలే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

 

 ఎవరి ప్రయోజనాల కోసం?

 పట్టిసీమ ఎత్తిపోతల పథకం లక్ష్యం ఏమిటి? గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు మళ్లించడం. మరి పోలవరం అందుకే కదా..? మళ్లీ ఈ లిఫ్ట్ ఎందుకు? ఎవరికైనా ఈ అనుమానం రావడం సహజం. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబును అడిగితే.. ‘పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి నాలుగేళ్లు పడుతుంది. ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిలో పూర్తి చేసి నీళ్లిస్తే.. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడాని కంటే మూడేళ్ల ముందే గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు ఇవ్వొచ్చు. ఎత్తిపోతల పథకం కోసం కొత్తగా కాల్వ తవ్వాల్సిన అవసరం లేదు.

 

 పోలవరం ప్రాజెక్టు కుడి కాల్వ ఎలాగూ ఉంది’ అని సమాధానమిస్తున్నారు. చంద్రబాబు అధికారం చేపట్టేనాటికి పోలవరం ప్రాజెక్టు కుడికాల్వ పనులు 70 శాతం పూర్తయ్యాయి. అధికారం చేపట్టి 8 నెలలు పూర్తయినా.. ఆ మిగిలిపోయిన 30 శాతం పనుల్లో కనీసం ఒక్కశాతమైనా పూర్తి చేశారా అని అడిగితే ప్రభుత్వం నుంచి సమాధానం ఉండదు. ఏడాదిలో పట్టిసీమ లిఫ్ట్ ద్వారా గోదావరి నీటిని కృష్ణాకు ఎలా మళ్లిస్తారని అడిగినా.. బదులు ఉండదు. భూసేకరణలో సమస్యలు రావడంతో ఆగిపోయిన పనుల సంగతి అటుంచితే, రెండు మేజర్ అక్విడెక్టులు నిర్మించాల్సి ఉంది. వీటి నిర్మాణానికి ఎవరి అనుమతులు అక్కర్లేదు. కానీ ఆ పనులను మొదలేపెట్టకపోవడం గమనార్హం. కొత్త కాంట్రాక్టుల్లో కాసుల కోసమే  లిఫ్ట్‌ను  ప్రభుత్వం చేపట్టిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

 

 పోలవరం మరుగున పెట్టేందుకే..

 పోలవరం ప్రాజెక్టును మరుగున పెట్టేందుకే ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతలను నిర్మించాలని యత్నిస్తోంది. ఇది పూర్తయ్యేందుకు మూడేళ్లు పట్టే అవకాశముంది. నాలుగేళ్లలో పోలవరం పూర్తి చేస్తామని సీఎం ప్రక టిస్తున్నప్పుడు పట్టిసీమ పథకం అనవసరం.  

 - విప్పర్తి వే ణుగోపాలరావు,

 రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, గోదావరి హెడ్ వర్క్స్, ధవళేశ్వరం


 

 ప్రాణమైనా ఇస్తా.. భూములివ్వను

 ప్రాణాలైనా అర్పిస్తా గానీ పట్టిసీమ ఎత్తిపోతల  పధకానికి భూమి ఇచ్చేది లేదు. ప్రస్తుతం నాకున్నది రెండెకరాల భూమే.  ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇళ్ళ స్ధలాలకు 3 ఎకరాల భూమి ఇచ్చాను. మిగిలింది 2 ఎకరాలే. అదే నాకుటుంబ జీవనాధారం...

 - పప్పల సత్యనారాయణ, బంగారంపేట

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top