ఎంట్రీ ఫీజు పేరుతోదోపిడి!

money Collecting On Harsili Hills Chittoor - Sakshi

హార్సిలీకొండపై అటవీశాఖ నిర్వాకం

పర్యావరణ సముదాయంలో అడుగుపెట్టాలంటే రూ.10 చెల్లించాలి

జేబులకు చిల్లు తప్ప రుసుముకుతగ్గ ఆహ్లాదం కరవు

హార్సిలీహిల్స్‌ను పేదవాడి ఊటీగా పిలుస్తారు. ఇక్కడికి వచ్చే వారిలో అత్యధికులు సామాన్యులు. ఆహ్లాదకరమైన వాతావరణంలో సేదతీరేందుకు వచ్చే సందర్శకులే.  ఖర్చులేకుండా ప్రకృతి అందాలను తిలకిస్తుంటే అటవీశాఖ మాత్రం తన సముదాయంలో అడుగుపెట్టాలంటే ఎంట్రీ ఫీజును ముక్కు పిండి మరీ వసూలు చేస్తోంది.  పేద పర్యాటకులను దోపిడీ చేస్తోంది.  వసూలు చేస్తున్న ఫీజుకు తగ్గట్టుగా ఆహ్లాదం ఉంటుందా అంటే ఏమీలేదు.

బి.కొత్తకోట:మండలంలోని హార్సిలీహిల్స్‌లో అట వీశాఖ ఏడు హెక్టార్ల విస్తీర్ణంలో పర్యావరణ సముదాయం నిర్వహిస్తోంది. ఇందులో మినీ జంతుప్రదర్శనశాల ఉండగా ముసళ్లు, జింకలు, కుందేళ్లు, పలురకాల పక్షులు, నెమళ్లు, కొన్ని విదేశీ పక్షులు పెంచేవారు. చిన్నపిల్లలు ఆడుకునేందుకు చిన్నపార్కు ఉంది. సందర్శకులను రుసుము లేకుండా అనుమతించేవారు.  చీఫ్‌ కన్సర్వేటర్‌ శ్రీధర్‌ ఏడాది క్రితం సముదాయంలోకి ప్రవేశించాలంటే రూ.10 వసూలుచేయాలని నిర్ణయించారు.  మూడు నెలల పాటు అటవీశాఖ సిబ్బంది రశీదులు తయారుచేసి రూ.10 వసూలు చేయగా ఏడాది క్రితం టెండర్‌ ద్వారా రూ.6,07,500కు కాంట్రాక్టర్‌కు అప్పగించగా వారు వసూలు చేçసుకుంటున్నారు. పాత టెండర్‌ కాలపరిమితి ముగియడంతో కొత్త టెండర్లను ఆహ్వానించారు.

ఆహ్లాదం ఎక్కడ ?
సందర్శకుల నుంచి రూ.10 వసూలు చేస్తున్నా కనీస ఆహ్లాదం లేదు. సముదాయంలో మినీ జంతుప్రదర్శనశాల పేరుకు మాత్రమే ఉంది. ఇందులో ఇంతకు ముందున్న పక్షులు, కుందేళ్లు, పక్షులు లేవు. సగానికిపైగా తగ్గిపోవడం వెనుక కారణాలు అధికారులకే తెలియాలి. ఒక మొసలి మరణిస్తే గోప్యం పాటించింది ఎందుకనో∙అధికారులే చెప్పాలి. పార్కులో గతంలో ప్లేపేన్‌ ఉండగా.. ఇప్పుడు లేదు.  సౌకర్యాలు తగ్గిపోయాయి. సందర్శకులు కూర్చునేందుకు బల్లలైనా ఏర్పాటు చేయలేదు.   తాగేందుకు నీటి సౌకర్యం లేదు. ప్రకృతి అందమూ కనిపించదు. చెట్ల మధ్యలో సంచరించి..బోసిపోయిన మినీ జంతుప్రదర్శనశాలను చూసి బయటకు వెళ్లాల్సిందే. దీనిపై సందర్శకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వసూలు నిలిపివేయాలని, లేనిపక్షంలో రుసుము తగ్గట్టు ఆహ్లాదం, సౌకర్యాలు, వసతులు అందేలా చూడాలని కోరుతున్నారు.

మిగిలిన చోట్ల ఉచితమే
ప్రకృతి అందాలకు పెట్టింది పేరైన హార్సిలీహిల్స్‌ అందాలన్నీ ఉచితంగానే వీక్షించవచ్చు. గాలిబండ, పాత వ్యూ పాయింట్, కొత్త వ్యూ పాయింట్‌ నుంచి ప్రకృతి అందాలను తిలకించాల్సిందే. వీటికి రుసుము లేదు. దీనికితోడు పర్యాటక శాఖ చిన్నారుల కోసం ఫీజు లేకుండా కొత్త కార్యక్రమాలను అమలుచేస్తోంది. కొండకు వచ్చే పిల్లలు రోజంతా ఆడుకునేలా  ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. అటవీశాఖ ఫీజుతో దీన్ని పోల్చితే ఒక్కొ చిన్నారికి రూ.20 వసూలు చేయవచ్చు. అయినప్పటికీ పర్యాటకశాఖ అందరికీ ఉచితంగానే ప్రవేశం కల్పిస్తోంది. తద్వారా సందర్శకులను ఆకట్టుకొంటోంది.

మా చేతుల్లో లేదు
రూ.10 వసూలు నిలిపివేత లేదా తగ్గించే విషయం మా చేతుల్లో లేదు. ఉన్నతాధికారులు తీసుకోవాల్సిన చర్యలు. వసూలు కోసం కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించేందుకు టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది.
– ఈశ్వరయ్య,రేంజర్, మదనపల్లె

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top