Harsili Hills
-
రాజుగారి‘గది’!
హార్సిలీహిల్స్‌లోని సీడీసీఎంఎస్ భవనాల అద్దె విషయం పలు అనుమా నాలకు తావిస్తోంది. ఇక్కడ ఏడాది క్రితం సంస్థ నిధులతో ఆధునికీకరణ పనులు చేపట్టారు. కొన్ని పనులు అసంపూర్తిగా వదిలేశారు. వీటిని ఇప్పుడు వడివడిగా చేపడుతున్నారు. కొన్ని గదులు ఇష్టారాజ్యంగా అద్దెకిస్తున్నారు. సీడీసీఎంఎస్ చైర్మన్, టీడీపీ నేత శ్యామరాజు తన తనయుడి పేరుతో లీజుకు కట్టబెట్టినట్టు తెలుస్తోంది. లీజు ఎంత.. ఎన్ని సంవత్సరాలు.. ఎవరిపేరుతో ఇస్తున్నారో తెలియని పరిస్థితి. అంతా రహస్యంగా సాగుతున్న ఈ ‘రాజుగారి గది’ చర్చనీయాంశమైంది. చిత్తూరు, బి.కొత్తకోట: అధికారం అడ్డుపెట్టుకుని ప్రభుత్వ ఆస్తులను అనుభవిస్తున్న టీడీపీనేతల వ్యవహారాలు ఒక్కొక్కటికిగా వెలు గులోకి వస్తున్నాయి. తాజాగా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌లో కోట్ల విలువైన చిత్తూరు జిల్లా సహకార మార్కెట్ సంస్థ (సీడీసీఎంఎస్) భవనాల లీజు వ్యవహారం గుప్పుమంటోంది. సంస్థకు జిల్లా వ్యాప్తంగా ఆస్తులు, వ్యాపార కార్యకలాపాలు ఉన్నాయి. హార్సిలీహిల్స్‌లో భవనాలు, వాణిజ్య సముదాయం ఉంది. వీటిని 2016లో సంస్థ నిధులతో ఆధునికీకరించే పనులు ప్రారంభించారు. ఏమైందో ఏమోగానీ.. ఏడాదిగా అసంపూర్తిగా వదిలేశారు. ఇప్పుడు మళ్లీ వీటి పనులు చేపట్టడం, భవనం పైఅంతస్తులోని గదులను అతిథిగృహాలుగా మార్చి సందర్శకులకు అద్దెకు కేటాయిస్తుండడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సీడీసీఎంఎస్ చైర్మన్‌గా శాంతిపురం మండలానికి చెందిన శ్యామరాజు వ్యవహరిస్తున్నారు. కొండపై ఉన్న భవనాలను లీజు పేరుతో కుమారుడికి కట్టబెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. పాలకవర్గ సమావేశంలో ఈ మేరకు ఆమోదం తెలిపినట్టు తెలిసింది. ఈ భవనాల ఆధునికీకరణ కోసం రూ.15 లక్షలతో పనులు చేయగా, ప్రస్తుతం భవనం గ్రౌండ్ ఫ్లోర్ గదుల్లో పనులు కొనసాగుతున్నాయి. చైర్మన్ కుమారుడు వీటిని పర్యవేక్షిస్తుండడం ప్రచారానికి బలం చేకూరుతోంది. ఈ పనులకు టెండర్లు పిలిచి అప్పగించారో లేదో తెలియడం లేదు. జరుగుతున్న పనుల విలువ రూ.10 లక్షలకుపైనేఉండవచ్చని అంచనా. గ్రౌండ్ ఫ్లోర్‌లోని గదుల్లో ఆధునికీకరణ పనులు సాగుతున్నా పైనున్న గదులను అతిథిగృహాలుగా మార్చి సందర్శకులకు అద్దెకు ఇస్తూ సొమ్ము చేసుకొంటున్నారు. అంతా రహస్యమే కొండపై భవనాల వ్యవహారంలో ఒక్క సమాచారం కూడా బయటకు పొక్కనీయకుండా అంతా రహస్యంగా సాగుతోంది. కోట్ల విలువైన భవనాలను లీజుకు అప్పగించే వ్యవహారంపై ఎన్నో అనుమానాలున్నాయి. లీజు అప్పగింత కోసం బహిరంగంగా ప్రకటించ లేదు. దీంతోపాటు ఎలాంటి ప్రాతిపదికన, ఎవరి పేరుతో, ఎన్ని సంవత్సరాలు లీజుకు ఇచ్చారో తెలియదు. లీజు అప్పగింతకు ఎంత చెల్లించాలి, లీజుకు అప్పగించే ముందు కలెక్టర్‌కు నివేదించి అనుమతి పొందారా..? అన్నదానిపై అధికారులు, చైర్మన్ నుంచి సరైన సమాధానం లేదు. భవనాల లీజు విషయం రహస్యంగా ఉంచినట్టు స్పష్టమవుతోంది. ప్రభుత్వ ఆస్తులను లీజుకు అప్పగించే ముందు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆయన సూచనలు, నిర్ణయం తీసుకున్నాక తదుపరి చర్యలను చేపట్టాలి. ఇవేమీ లేకుండానే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా భవనాల ఆధునికీకరణ కోసం ఖర్చుచేసిన నిధులు ఎంత, ఏవిధంగా వాటిని ఖర్చు చేశారు..? అన్నది కూడా బయటకు చెప్పడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న పనులకు చేస్తున్న ఖర్చు సంస్థ భరిస్తోందా లేక లీజుదారుడు భరిస్తున్నాడా..? అన్నది కూడా రహస్యమే. ఆదివారం వస్తా ఈ విషయమై ఫోన్లో చైర్మన్ శ్యామరాజును వివరణ కోరగా భవనాల లీజు విషయమై స్పందించ లేదు. ఒక్క ప్రశ్నకూ వివరణ ఇవ్వలేదు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేశారు. ఆదివారం తాను హార్సిలీహిల్స్ వస్తా మాట్లాడుతా.. అని చెప్పారు. ఇదే విషయమై సంస్థ మేనేజర్ శంకర్ మాట్లాడుతూ హార్సిలీహిల్స్‌లోని భవనాలు లీజుకు ఇచ్చామన్నారు. శ్యామరాజు కుమారుడికి లీజుకు ఇవ్వలేదన్నారు. చౌడేపల్లె మండలానికి చెందిన వ్యక్తికి ఇచ్చామన్నారు. నిధుల వ్యయం, లీజు నిబంధనలు, ఎప్పుడు లీజుకు నిర్ణయం తీసుకొన్నారు.. తదితరవాటికి సంబంధించిన వివరాలు తనకు తెలియదని దాటవేశారు. -
ఎంట్రీ ఫీజు పేరుతోదోపిడి!
హార్సిలీహిల్స్‌ను పేదవాడి ఊటీగా పిలుస్తారు. ఇక్కడికి వచ్చే వారిలో అత్యధికులు సామాన్యులు. ఆహ్లాదకరమైన వాతావరణంలో సేదతీరేందుకు వచ్చే సందర్శకులే. ఖర్చులేకుండా ప్రకృతి అందాలను తిలకిస్తుంటే అటవీశాఖ మాత్రం తన సముదాయంలో అడుగుపెట్టాలంటే ఎంట్రీ ఫీజును ముక్కు పిండి మరీ వసూలు చేస్తోంది. పేద పర్యాటకులను దోపిడీ చేస్తోంది. వసూలు చేస్తున్న ఫీజుకు తగ్గట్టుగా ఆహ్లాదం ఉంటుందా అంటే ఏమీలేదు. బి.కొత్తకోట:మండలంలోని హార్సిలీహిల్స్‌లో అట వీశాఖ ఏడు హెక్టార్ల విస్తీర్ణంలో పర్యావరణ సముదాయం నిర్వహిస్తోంది. ఇందులో మినీ జంతుప్రదర్శనశాల ఉండగా ముసళ్లు, జింకలు, కుందేళ్లు, పలురకాల పక్షులు, నెమళ్లు, కొన్ని విదేశీ పక్షులు పెంచేవారు. చిన్నపిల్లలు ఆడుకునేందుకు చిన్నపార్కు ఉంది. సందర్శకులను రుసుము లేకుండా అనుమతించేవారు. చీఫ్ కన్సర్వేటర్ శ్రీధర్ ఏడాది క్రితం సముదాయంలోకి ప్రవేశించాలంటే రూ.10 వసూలుచేయాలని నిర్ణయించారు. మూడు నెలల పాటు అటవీశాఖ సిబ్బంది రశీదులు తయారుచేసి రూ.10 వసూలు చేయగా ఏడాది క్రితం టెండర్ ద్వారా రూ.6,07,500కు కాంట్రాక్టర్‌కు అప్పగించగా వారు వసూలు చేçసుకుంటున్నారు. పాత టెండర్ కాలపరిమితి ముగియడంతో కొత్త టెండర్లను ఆహ్వానించారు. ఆహ్లాదం ఎక్కడ ? సందర్శకుల నుంచి రూ.10 వసూలు చేస్తున్నా కనీస ఆహ్లాదం లేదు. సముదాయంలో మినీ జంతుప్రదర్శనశాల పేరుకు మాత్రమే ఉంది. ఇందులో ఇంతకు ముందున్న పక్షులు, కుందేళ్లు, పక్షులు లేవు. సగానికిపైగా తగ్గిపోవడం వెనుక కారణాలు అధికారులకే తెలియాలి. ఒక మొసలి మరణిస్తే గోప్యం పాటించింది ఎందుకనో∙అధికారులే చెప్పాలి. పార్కులో గతంలో ప్లేపేన్ ఉండగా.. ఇప్పుడు లేదు. సౌకర్యాలు తగ్గిపోయాయి. సందర్శకులు కూర్చునేందుకు బల్లలైనా ఏర్పాటు చేయలేదు. తాగేందుకు నీటి సౌకర్యం లేదు. ప్రకృతి అందమూ కనిపించదు. చెట్ల మధ్యలో సంచరించి..బోసిపోయిన మినీ జంతుప్రదర్శనశాలను చూసి బయటకు వెళ్లాల్సిందే. దీనిపై సందర్శకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వసూలు నిలిపివేయాలని, లేనిపక్షంలో రుసుము తగ్గట్టు ఆహ్లాదం, సౌకర్యాలు, వసతులు అందేలా చూడాలని కోరుతున్నారు. మిగిలిన చోట్ల ఉచితమే ప్రకృతి అందాలకు పెట్టింది పేరైన హార్సిలీహిల్స్ అందాలన్నీ ఉచితంగానే వీక్షించవచ్చు. గాలిబండ, పాత వ్యూ పాయింట్, కొత్త వ్యూ పాయింట్ నుంచి ప్రకృతి అందాలను తిలకించాల్సిందే. వీటికి రుసుము లేదు. దీనికితోడు పర్యాటక శాఖ చిన్నారుల కోసం ఫీజు లేకుండా కొత్త కార్యక్రమాలను అమలుచేస్తోంది. కొండకు వచ్చే పిల్లలు రోజంతా ఆడుకునేలా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. అటవీశాఖ ఫీజుతో దీన్ని పోల్చితే ఒక్కొ చిన్నారికి రూ.20 వసూలు చేయవచ్చు. అయినప్పటికీ పర్యాటకశాఖ అందరికీ ఉచితంగానే ప్రవేశం కల్పిస్తోంది. తద్వారా సందర్శకులను ఆకట్టుకొంటోంది. మా చేతుల్లో లేదు రూ.10 వసూలు నిలిపివేత లేదా తగ్గించే విషయం మా చేతుల్లో లేదు. ఉన్నతాధికారులు తీసుకోవాల్సిన చర్యలు. వసూలు కోసం కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించేందుకు టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. – ఈశ్వరయ్య,రేంజర్, మదనపల్లె -
భూమి లీజు కథ కంచికే !
హార్సిలీహిల్స్‌లో అడ్వంచర్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు బ్రేక్ జిల్లా పర్యాటక కమిటీ సమావేశంలో కలెక్టర్ నిర్ణయం బి.కొత్తకోట: వేసవి విడిది కేంద్రం హార్సిలీహిల్స్‌లో జిల్లాకు చెందిన ఓ ప్రయివేటు సంస్థకు 3 ఎకరాల భూమిని లీజుకు ఇచ్చే కథ కంచికి చేరింది. 33 ఏళ్లపాటు లీజుకు 5శాతం పన్ను చెల్లింపు ప్రాతిపదికన అప్పగించేందుకు సిద్ధమైన చర్యలను నిలిపివేస్తూ ఇటీవల కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పర్యాటక శాఖ కమిటీ సమావేశం నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.చిత్తూరుకు చెందిన ఓ ప్రయివేటు సంస్థ 2005లో కొండపై సాహస విన్యాసాల ప్రాంగణ (అడ్వంచర్ కాంప్లెక్స్) నిర్వహణకు అప్పటి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ సంస్థకు మూడెకరాల భూమిని 33 ఏళ్లపాటు లీజు ప్రాతిపదికన అప్పగించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అయితే ఈ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఆ సంస్థ తొలుత ఆసక్తి చూపలేదు. తరువాత 2011లో అదే సంస్థ యాజమాన్యం ఆ భూమిని స్వీకరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అప్పటి కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ ఈ వ్యవహారంలో ప్రభుత్వ నిర్ణయాన్ని కీలకంగా చేశారు. పలుమార్లు లేఖలు రాయడమేకాక పర్యాటకశాఖ కమిటీ సమావేశాలు నిర్వహించారు. చివరకు లీజుకు ఇచ్చే భూమి విలువ ఆధారంగా 5శాతం పన్ను ప్రభుత్వానికి చెల్లించేలా తీర్మానం చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించారు. తర్వాత ఆరోగ్యరాజ్ బదిలీ కావడంతో ఆయన స్థానంలో వచ్చిన కలెక్టర్ రాంగోపాల్ ఈ ఫైల్‌ను శరవేగంగా ముందుకు తీసుకొచ్చారు. తక్షణమే భూమి అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలనీ బి.కొత్తకోట తహశీల్దార్‌ను ఆదేశించారు. దీనిపై హర్సిలీహిల్స్లో సర్వే నంబర్ 592-1లో మూడెకరాల భూమిని గుర్తించి హద్దులు నిర్ణయించారు. ఆ భూమి విలువ ఎకరా రూ.40లక్షలుగా నిర్ణయించి నివేదించారు. ఈ విలువలో 5 శాతం విలువను ఫీజుగా ప్రయివేటు సంస్థ ప్రభుత్వానికి చెల్లించాలని నిర్ణయించారు. రెవెన్యూశాఖ ఆ భూమిని పర్యాటక శాఖకు అధికారికంగా అప్పగించింది. పర్యాటకశాఖ అధికారికంగా ప్రయివేటు సంస్థకు అప్పగించేందుకు సిద్ధమైన తరుణంలో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ చర్యల వేగం తగ్గింది. అధికారుల బదిలీ పరిస్థితుల అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు వేచిచూశారు. ఈ పరిస్థితుల్లో కలెక్టర్‌గా సిద్ధార్థ్‌జైన్ రావడంతో భూమి అప్పగింత మరుగునపడింది. ఇటీవల నిర్వహించిన పర్యాటకశాఖ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. అధికారులు ఈ వ్యవ హారం గురించి వివరించారు. ప్రయివేటు కార్యకలాపాలకు కొండపై అవకాశమిస్తే ఇబ్బందులు వస్తాయని భావించి లీజు భూమిని ప్రయివేటు సంస్థకు అప్పగించబోమని చెబుతూ తీర్మానం చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.