రాజుగారి‘గది’! | Sakshi
Sakshi News home page

రాజుగారి‘గది’!

Published Fri, Jan 18 2019 11:40 AM

Horsley Hills Rent Rooms Renovations Pending - Sakshi

హార్సిలీహిల్స్‌లోని సీడీసీఎంఎస్‌ భవనాల అద్దె విషయం పలు అనుమా నాలకు తావిస్తోంది. ఇక్కడ ఏడాది క్రితం సంస్థ నిధులతో ఆధునికీకరణ పనులు చేపట్టారు. కొన్ని పనులు అసంపూర్తిగా వదిలేశారు. వీటిని ఇప్పుడు వడివడిగా చేపడుతున్నారు. కొన్ని గదులు ఇష్టారాజ్యంగా అద్దెకిస్తున్నారు. సీడీసీఎంఎస్‌ చైర్మన్, టీడీపీ నేత శ్యామరాజు తన తనయుడి పేరుతో లీజుకు కట్టబెట్టినట్టు తెలుస్తోంది. లీజు ఎంత.. ఎన్ని సంవత్సరాలు.. ఎవరిపేరుతో ఇస్తున్నారో తెలియని పరిస్థితి. అంతా రహస్యంగా సాగుతున్న ఈ ‘రాజుగారి గది’ చర్చనీయాంశమైంది.

చిత్తూరు, బి.కొత్తకోట: అధికారం అడ్డుపెట్టుకుని ప్రభుత్వ ఆస్తులను అనుభవిస్తున్న టీడీపీనేతల వ్యవహారాలు ఒక్కొక్కటికిగా వెలు గులోకి వస్తున్నాయి. తాజాగా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌లో కోట్ల విలువైన చిత్తూరు జిల్లా సహకార మార్కెట్‌ సంస్థ (సీడీసీఎంఎస్‌) భవనాల లీజు వ్యవహారం గుప్పుమంటోంది. సంస్థకు జిల్లా వ్యాప్తంగా ఆస్తులు, వ్యాపార కార్యకలాపాలు ఉన్నాయి. హార్సిలీహిల్స్‌లో భవనాలు, వాణిజ్య సముదాయం ఉంది. వీటిని 2016లో సంస్థ నిధులతో ఆధునికీకరించే పనులు ప్రారంభించారు.

ఏమైందో ఏమోగానీ.. ఏడాదిగా అసంపూర్తిగా వదిలేశారు. ఇప్పుడు మళ్లీ వీటి పనులు చేపట్టడం, భవనం పైఅంతస్తులోని గదులను అతిథిగృహాలుగా మార్చి సందర్శకులకు అద్దెకు కేటాయిస్తుండడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సీడీసీఎంఎస్‌ చైర్మన్‌గా శాంతిపురం మండలానికి చెందిన శ్యామరాజు వ్యవహరిస్తున్నారు. కొండపై ఉన్న భవనాలను లీజు పేరుతో కుమారుడికి కట్టబెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. పాలకవర్గ సమావేశంలో ఈ మేరకు ఆమోదం తెలిపినట్టు తెలిసింది. ఈ భవనాల ఆధునికీకరణ కోసం రూ.15 లక్షలతో పనులు చేయగా, ప్రస్తుతం భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌ గదుల్లో పనులు కొనసాగుతున్నాయి. చైర్మన్‌ కుమారుడు వీటిని పర్యవేక్షిస్తుండడం ప్రచారానికి బలం చేకూరుతోంది. ఈ పనులకు టెండర్లు పిలిచి అప్పగించారో లేదో తెలియడం లేదు. జరుగుతున్న పనుల విలువ రూ.10 లక్షలకుపైనేఉండవచ్చని అంచనా. గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని గదుల్లో ఆధునికీకరణ పనులు సాగుతున్నా పైనున్న గదులను అతిథిగృహాలుగా మార్చి సందర్శకులకు అద్దెకు ఇస్తూ సొమ్ము చేసుకొంటున్నారు.

అంతా రహస్యమే
కొండపై భవనాల వ్యవహారంలో ఒక్క సమాచారం కూడా బయటకు పొక్కనీయకుండా అంతా రహస్యంగా సాగుతోంది. కోట్ల విలువైన భవనాలను లీజుకు అప్పగించే వ్యవహారంపై ఎన్నో అనుమానాలున్నాయి. లీజు అప్పగింత కోసం బహిరంగంగా ప్రకటించ లేదు. దీంతోపాటు ఎలాంటి ప్రాతిపదికన, ఎవరి పేరుతో, ఎన్ని సంవత్సరాలు లీజుకు ఇచ్చారో తెలియదు. లీజు అప్పగింతకు ఎంత చెల్లించాలి, లీజుకు అప్పగించే ముందు కలెక్టర్‌కు నివేదించి అనుమతి పొందారా..? అన్నదానిపై అధికారులు, చైర్మన్‌ నుంచి సరైన సమాధానం లేదు. భవనాల లీజు విషయం రహస్యంగా ఉంచినట్టు స్పష్టమవుతోంది. ప్రభుత్వ ఆస్తులను లీజుకు అప్పగించే ముందు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి ఆయన సూచనలు, నిర్ణయం తీసుకున్నాక తదుపరి చర్యలను చేపట్టాలి. ఇవేమీ లేకుండానే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా భవనాల ఆధునికీకరణ కోసం ఖర్చుచేసిన నిధులు ఎంత, ఏవిధంగా వాటిని ఖర్చు చేశారు..? అన్నది కూడా బయటకు చెప్పడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న పనులకు చేస్తున్న ఖర్చు సంస్థ భరిస్తోందా లేక లీజుదారుడు భరిస్తున్నాడా..? అన్నది కూడా రహస్యమే.

ఆదివారం వస్తా
ఈ విషయమై ఫోన్లో చైర్మన్‌ శ్యామరాజును వివరణ కోరగా భవనాల లీజు విషయమై స్పందించ లేదు. ఒక్క ప్రశ్నకూ  వివరణ ఇవ్వలేదు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేశారు. ఆదివారం తాను హార్సిలీహిల్స్‌ వస్తా మాట్లాడుతా.. అని చెప్పారు. ఇదే విషయమై సంస్థ మేనేజర్‌ శంకర్‌ మాట్లాడుతూ హార్సిలీహిల్స్‌లోని భవనాలు లీజుకు ఇచ్చామన్నారు. శ్యామరాజు కుమారుడికి లీజుకు ఇవ్వలేదన్నారు. చౌడేపల్లె మండలానికి చెందిన వ్యక్తికి ఇచ్చామన్నారు. నిధుల వ్యయం, లీజు నిబంధనలు, ఎప్పుడు లీజుకు నిర్ణయం తీసుకొన్నారు.. తదితరవాటికి సంబంధించిన వివరాలు తనకు తెలియదని దాటవేశారు.

Advertisement
Advertisement