బాధిత కుటుంబానికి సాంత్వన | MLA Rachamallu Siva Prasad Reddy Guaranteed To poor Family | Sakshi
Sakshi News home page

బాధిత కుటుంబానికి సాంత్వన

Sep 8 2018 2:14 PM | Updated on Sep 8 2018 2:14 PM

MLA Rachamallu Siva Prasad Reddy Guaranteed To poor Family - Sakshi

బాధితురాలు రమాదేవితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి

వారిది చేనేత కుటుంబం. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. వారిలో ఒకరు ప్రైవేట్‌ పాఠశాలలో పని చేస్తుండగా వచ్చిన ఆ డబ్బుతోనే సంసారం నెట్టుకొస్తున్నారు. అలాంటి నిరుపేద కుటుం బంపై విధి పగపట్టింది. వారు ఉంటున్న పూరి గుడిసె బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. కట్టుకున్న బట్టలు మినహా ఏమీ మిగల్లేదు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి శుక్రవారం అక్కడికి వెళ్లారు. పూర్తిగా నిరాశ్రయులైన చేనేత కుటుంబాన్ని చూసి చలించిపోయారు. అసలే ఆడ పిల్లలు.. నిలువనీడ లేదు.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందే పరిస్థితి లేకపోవడంతో తన సొంత డబ్బుతో ఇల్లు నిర్మించి ఇస్తానని ఎమ్మెల్యే వారికి భరోసా ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని రెండు రోజుల్లో ఇంటి నిర్మాణ పనులు ప్రారంభిస్తానని చెప్పారు.

వైఎస్‌ఆర్‌ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : అగ్నిప్రమాదంలో నిలువ నీడ కోల్పోయిన బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి భరోసా కల్పించారు. పట్టణంలోని శ్రీరాంనగర్‌లో పోలంకి రమాదేవి పూరిల్లు బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. సర్వం కోల్పోయిన ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రమాదేవికి ఇద్దరు కుమార్తెలు. వారిలో జ్యోతి ఎంకాం వరకు చదువుకొని ప్రైవేట్‌ పాఠశాలలో పని చేస్తుండగా పద్మావతి ఎమ్మెస్సీ చదువుతోంది. వారిది చేనేత కుటుంబం. జ్యోతికి వస్తున్న నెల జీతం రూ.6 వేలతోనే వారి సంసారం నడుస్తోంది. భవనం నిర్మించుకునే స్థోమత లేని చిన్నపాటి పురిగుడిసెలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో బుధవారం విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ సంభవించడంతో జరిగిన అగ్ని ప్రమాదంలో వారి పూరి గుడిసె కాలిపోయింది. ఇంట్లో ఉన్న రెండు తులాల బంగారుతోపాటు కొంత డబ్బు, రెండు గ్యాస్‌ సిలిండర్లు, ఇద్దరు కుమార్తెల విద్యార్హతల సర్టిఫికెట్‌లు, బియ్యం, బట్టలు, పూర్తిగా కాలిపోవడంతో వారు వీధిన పడ్డారు. తలదాచుకోవడానికి నీడ లేకపోవడంతో ఏం చేయాలో వారికి పాలుపోలేదు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి శుక్రవారం వారి ఇంటి వద్దకు వెళ్లారు. అగ్నికి ఆహుతి అయిన ఇంటిని పరిశీలించారు.

రూ.2 లక్షలతో ఇంటి నిర్మాణం
రమాదేవి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే రాచమల్లు కొండంత భరోసా ఇచ్చారు. ‘ధైర్యంగా ఉండాలని.. మీ కుటుంబానికి నేను అండగా ఉంటాను’ అని అన్నారు. ‘టీడీపీ ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి సాయం అందే పరిస్థితి లేదు. నాలుగేళ్లవుతున్నా ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. అసలే ఆడపిల్లలు.. వారి గౌరవానికి రక్షణ లేని పరిస్థితి’ అని ఎమ్మెల్యే భావించి సొంత ఖర్చుతో ఇల్లు నిర్మిస్తానని రమాదేవి కుటుంబ సభ్యులకు చెప్పారు. బేస్‌మట్టం ఏర్పాటు చేసి, ఇటుకలతో ఇల్లు నిర్మిస్తానని అన్నారు. ఆదివారం నుంచి పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇంటి నిర్మాణం పూర్తయ్యాక ఎమ్మెల్యే రాచమల్లు సతీమణి రాచమల్లు రమాదేవి స్వయంగా వారిని బజారుకు తీసుకెళ్లి వంట సామగ్రి, బట్టలు, బీరువా, బియ్యం, పప్పు దినుసులు ఇప్పిస్తారన్నారు. ఇందుకు సుమారు రూ.2 లక్షలు పైగా అవసరం అవుతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఇల్లు కాలిపోయి బాధలో ఉన్న తమకు ఎమ్మెల్యే చేస్తున్న సాయం కొండంత అండగా నిలిచిందని బాధితురాలు రమాదేవి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement