నమ్మకాన్ని వమ్ము చేయను..

MLA Pendem Dorababu Sakshi Special Interview

సీఎం జగన్‌ సహకారంతో సమస్యల పరిష్కారం

నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో చర్చకు తెస్తా

ఎమ్మెల్యే పెండెం దొరబాబు  

సాక్షి, పిఠాపురం (తూర్పు గోదావరి): ప్రజలందరూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పైనా, తనపైనా అపార నమ్మకం పెట్టుకున్నారని, తనకు రెండోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు అన్నారు. రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి బుధవారం వెళుతున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి అసెంబ్లీలో చర్చించేలా చేస్తానని, తద్వారా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను అధికారుల ద్వారా తెలుసుకుని అసెంబ్లీలో ప్రస్తావిస్తారని ఆయన పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా, నియోజకవర్గంలో ఇప్పటివరకు ఏ అభివృద్ధి పని కూడా ప్రారంభించడం కానీ పనులు చేపట్టడం కానీ చేయలేదని ప్రజల అంటున్నాలు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ విషయంలో నియోజకవర్గంలో ఎవరికీ ఒక్క పైసా సక్రమంగా ఇవ్వలేదని అంటున్నారు. మాఫీ చేయకపోయినా గత పాలక పార్టీ టీడీపీ నేతలకు ఏమీ పట్టలేదని, టీడీపీ పాలనలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి లేకుండా ఉందని అంటున్నారు. ప్రజలు చేస్తున్న ఈ విమర్శలను ఆయన ప్రస్తావిస్తూ.. ఎమ్మెల్యేగా తనకు మరోసారి అవకాశం కల్పించిన నియోజకవర్గ ప్రజల సమస్యలను త్రికరణ శుద్ధిగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని, సమస్యల రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని దొరబాబు హామీ ఇచ్చారు. ఇందుకు అసెంబ్లీని వేదికగా చేసుకుని ప్రజల సమస్యలను వివరించి వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు.  

సమస్యల చిట్టా  

ఏలేరు ఆధునికీకరణ చేస్తా 
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఏలేరు ఆధునికీకరణ పనులు నియోజకవర్గంలో ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయాయి. రైతులకు పరిహారం ఇవ్వకుండా పనులు చేపట్టడం.. అందుకు రైతులు అభ్యంతరం చెప్పారు. దీంతో పనులు ఆగిపోయాయి. ఏలేరు ఆధునికీకరణలో అవినీతి చోటు చేసుకుందే తప్ప పనులు మాత్రం సాగలేదని రైతుల వాదన. నిధులు విడుదల చేయగానే ఏలేరు ఆధునికీకరణ సాధించినట్లుగా స్థానికులతో మాజీ ఎమ్మెల్యే వర్మ సన్మానం చేయించుకున్నారు. ఇప్పటికింకా ఏలేరు ఆధునికీకరణ పనులు పూర్తిస్థాయిలో చేపట్టలేదు. పైగా ఏలేరును ఆధునికీకరణ చేసిన కీర్తిని ఆయనే ఆపాదించుకున్నారు. ఈ పనులు పూర్తయ్యేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే దొరబాబు హామీ ఇచ్చారు. 
 
పాలిటెక్నిక్‌ కాలేజీ సమస్య తీరుస్తా.. 
గత టీడీపీ ప్రభుత్వం.. పాలిటెక్నిక్‌ కాలేజీకి స్థల సేకరణ చేయకుండానే అడ్మిషన్లు పూర్తి చేశారు. కాలేజీలో చేరిన విద్యార్థులను వందలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీలకు పంపుతున్నారు. పిఠాపురం పాలిటెక్నిక్‌ కాలేజీలో అడ్మిషన్లు అంటూ ఎంపిక చేసిన విద్యార్థులను పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, విశాఖ జిల్లా అనకాపల్లి తదితర ప్రాంతాల్లోని కాలేజీలకు పంపుతున్నారు. ఈ విద్యార్థులు నరకయాతన పడుతున్నారు. ఈ కాలేజీకి సొంత భవనాలను నిర్మించలేదు. ఈ కాలేజీ వ్యవహరంపై గత టీడీపీ ప్రభుత్వ తీరును ప్రజలు దుమెత్తిపోస్తున్నారు. ఎన్నికల వేళ హడావుడిగా ప్రారంభించిన ఈ కాలేజీని విద్యార్థులకు అందుబాటులోకి తెస్తానని ఎమ్మెల్యే దొరబాబు తెలిపారు.  

మినీ స్టేడియం వచ్చేలా చూస్తా... 
దేశంలోనే పేరెన్నికగన్న క్రీడాకారులను ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో ఆటలాడుకోడానికి చోటు లేకుండా ఉంది. మినీ స్టేడియం నిర్మిస్తామని టీడీపీ నేతలు చేసిన వాగ్దానాలు నెరవేరలేదు. పైగా ఉన్న ఆట స్థలాలను వేరే నిర్మాణాలకు కేటాయించి విద్యార్థులకు ఆడుకునేందుకు చోటు లేకుండా చేశారు. మినీ స్టేడియం నిర్మిస్తామన్న హామీని తుంగలోకి తొక్కారు. క్రీడల పరంగా వెనుకబడిపోతున్నామని క్రీడాకారులు, విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయంపై అసెంబ్లీలో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించి క్రీడాకారులకు మినీ స్టేడియం అందుబాటులోకి వచ్చేలా చూస్తానని ఎమ్మెల్యే దొరబాబు 
తెలిపారు. 

మినీ హార్బర్‌ నిర్మాణానికి కృషి 
వేలాదిమంది మత్స్యకారులకు జీవన్మరణ సమస్యగా మారిన మినీ హార్బర్‌ నిర్మాణం.. గత టీడీపీ పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా కనిపిస్తుంది. నాలుగేళ్లుగా ఇవిగో నిధులు.. అదిగో పనులు అంటూ మభ్య పెట్టారు. ఇప్పటికీ నిధులు విడుదల కాలేదు. పనులూ ప్రారంభించలేదు. దీంతో వేలాది మంది మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మత్స్యకారుల సమస్యల పరిష్కారంలో ముందున్నారు. ఆయన సహకారంతో మినీ హార్బర్‌ నిర్మాణం పూర్తి చేయిస్తానని ఎమ్మెల్యే దొరబాబు భరోసా ఇచ్చారు. 

డిగ్రీ కాలేజీ భవనానికి కృషి 
ఎందరో విద్యావంతులకు పుట్టినిల్లుగా ఉన్న పిఠాపురంలో డిగ్రీ కాలేజీ నిర్మాణం కోసం పట్టణ ప్రజల వినతి మేరకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి నిధులు కేటాయించారు. ఆయన మరణం తరువాత నేతలు ఎవరూ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో ఇంటర్‌ నుంచి డిగ్రీ విద్యార్థుల క్లాసులన్నీ ఒకే భవనంలో నిర్వహిస్తున్నారు. దీంతో ఈ రెండు కాలేజీలను వంటిపూట నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. డిగ్రీ కాలేజీ భవనాలను నిర్మించి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చేస్తానని ఎమ్మెల్యే దొరబాబు తెలిపారు. 
 
పీబీసీ ఆధునికీకరణ లేక పంటలు నాశనం 
నాలుగు మండలాలకు ప్రధాన సాగునీటి ఆధారమైన పిఠాపురం బ్రాంచి కెనాల్‌ (పీబీసీ) ఆధునికీకరణను తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోవడం మానేసిందని రైతులు విమర్శిస్తున్నారు. ఏటా సాగునీరందక, వరదల సమయంలో ముంపునకు గురై పంటలు నాశనమవుతున్నా ఆనాటి పాలకులు పట్టించుకోలేదు. అరకొర మరమ్మతుల పేరుతో రూ.కోట్లు ఖర్చు చేసినట్లు చూపించారు తప్ప శాశ్వత పరిష్కారం చూపించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరలో పీబీసీ ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే దొరబాబు తెలిపారు. 

హోటల్‌ మేనేజ్‌మెంటు కాలేజీ ఏర్పాటుకు చర్యలు 
మండల కేంద్రం కొత్తపల్లి హైస్కూలు స్థలంలో నిర్మాణం చేపట్టిన హోటల్‌ మేనేజ్‌మెంటు కాలేజీ నిర్మాణం రెండేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఈ నిర్మాణ విషయంలో ఎవరైనా వేలెత్తి చూపిస్తే వేలు తీస్తా నంటూ మాజీ ఎమ్మెల్యే వర్మ బహిరంగంగా హెచ్చరించారు. ఆ కాలేజీ నిర్మాణం పూర్తి చేయించడంలో విఫలమయ్యారని విద్యార్థులు విమర్శిస్తున్నారు. ఎక్కడో కేటాయించిన స్థలాన్ని మార్పు చేసి హైస్కూలు స్థలంలో ఈ కాలేజీని నిర్మాణం చేపట్టినప్పుడు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయినా సరే తాము కట్టి తీరుతామని చెప్పిన నేతలు తెగేసి చెప్పారు. ఈ కాలేజీ విషయంలో అందరి సహకారంతో తగిన నిర్ణయం తీసుకుని కాలేజీ పూర్తయేలా చూస్తానని ఎమ్మెల్యే దొరబాబు తెలిపారు.  

అందుబాటులోకి రాని మంచినీటి పథకం 
ఎన్నో ఏళ్లుగా పూర్తిగాని పిఠాపురం తాగునీటి ప్రాజెక్టు పనులు నెల రోజుల్లో పూర్తి చేస్తామని గొప్పలు చెప్పుకున్న టీడీపీ నేతలు.. హడావుడిగా మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో వాటర్‌ టాంకును ప్రారంభింపజేశారు. ఈ ఘనకీర్తి తమదేనంటూ చెప్పుకొచ్చారు. మూడేళ్ల క్రితం నీటిని విడుదల చేసిన నాయకులు వెళ్లగానే.. నీటి సరఫరా నిలిచిపోయింది. తాగునీటిని అందించక పోగా ఈ ప్రాజెక్టుకు ఆదిలోనే మరమ్మతులు చేయకతప్పలేదు. దీంతో నీటి సమస్యలు పరిష్కారం కాలేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగేళ్ల నుంచి ఇప్పటి వరకు ఏ రోజున పూర్తిస్థాయిలో తాగునీటిని అందించలేదు. ఇప్పటికీ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ పరిస్థితి ఆ నాటి పాలకులకు కనిపించలేదని ప్రజలు ఇప్పటికీ విమర్శిస్తున్నారు. రూ.21 కోట్ల వ్యయంతో ఎనిమిదేళ్ల క్రితం ఈ ప్రాజెక్టుకు పనులు ప్రారంభించారు. ఈ పథకాన్ని నెల రోజుల్లో పూర్తి చేస్తామని టీడీపీ నేతలు ప్రకటించి నాలుగేళ్లు దాటింది. ఇప్పటికీ ఈ పథకం పనులు పూర్తి కాలేదు. ఎన్నికల ముందు మంత్రి లోకేష్‌ చేతుల మీదుగా కూడా ఈ పథకాన్ని ప్రారంభించారు. అయినా చుక్క నీరు కూడా ఇవ్వలేక పోయారు. ఈ పథకాన్ని పూర్తి చేసి పూర్తి స్థాయిలో నీటి సరఫరాకు కృషి చేస్తానని ఎమ్మెల్యే దొరబాబు తెలిపారు. 

రైతు బజార్‌ సమస్యను... 
అన్ని రకాల పంటలు పండే నియోజకవర్గంలో రైతు బజార్‌ లేకపోవడం సమస్యగా ఉంది. గత ఎమ్మెల్యే వర్మ రైతు బజార్‌ పేరిట నిర్మించిన భవనాలను అప్పటి మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పతో ప్రారంభింపజేశారు. అయితే ఆ భవనాలు అనధికారమైనవని లోకాయుక్తా మొట్టికాయలు వేస్తూ... ఆ భవనాలను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీచేసింది. ఈ వ్యవహరం టీడీపీ పాలకుల నిర్వాకాన్ని బట్టబయలు చేసింది. దీంతో వేలాదిమంది రైతులకు రైతు బజార్‌ లేక దళారుల చేతుల్లో దోపిడీకి గురవుతున్నారు. రైతు భరోసా ద్వారా ప్రభుత్వం రైతులకు అనేక సంక్షేమ పధకాలను అమలు చేయడానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కోర్టులో ఉన్న ఈ కేసు పరిష్కరించేలా చేసి రైతులకు రైతు బజార్‌ను అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే దొరబాబు హామీ ఇచ్చారు. 

పిఠాపురం మెయిన్‌ రోడ్డు విస్తరణకు కృషి 
నియోజకవర్గ కేంద్రం పిఠాపురంలో మెయిన్‌ రోడ్డు విస్తరణను టీడీపీ పాలకులు పట్టించుకోలేదు. అరకొరగా> చేపట్టిన పనులకు కేటాయించిన రూ.కోట్లు బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారిపోయాయి. కేవలం ప్రభుత్వ స్థలాలను ఖాళీ చేయించి కొంత మేర విస్తరించి ఆపై వదిలేశారు. పట్టణంలో ప్రధాన సమస్యగా ఉన్న ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. అసంపూర్తిగా ఉన్న రోడ్డును వదిలేసి ఉన్న రోడ్డులో డివైడర్లు కట్టి రోడ్డును మరింత ఇరుకు చేసిన ఘనత టీడీపీ పాలకులదే. ఈ పనులపై విచారణ చేయించి ప్రజలకు అనువుగా రోడ్డును విస్తరించేలా చూసి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తా ఎమ్మెల్యే దొరబాబు పేర్కొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top