విప్ గారి గొప్ప! | MLA Chintamaneni Prabhakar Hulchul in Eluru | Sakshi
Sakshi News home page

విప్ గారి గొప్ప!

Jan 18 2015 3:37 AM | Updated on Jul 6 2018 3:32 PM

విప్ గారి గొప్ప! - Sakshi

విప్ గారి గొప్ప!

ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇలాకాలో భోగి నుంచి ముక్కనుమ వరకూ పండగ నాలుగు రోజులూ కోడిపందాలు యధేచ్ఛగా సాగాయి.

ఏలూరు (టూటౌన్) :ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇలాకాలో భోగి నుంచి ముక్కనుమ వరకూ పండగ నాలుగు రోజులూ కోడిపందాలు యధేచ్ఛగా సాగాయి. పెదవేగి మండంల కొప్పాక గ్రామంలోని సపోటా తోటలో నిరాటంకంగా కోట్ల రూపాయల్లో పందాలు జరిగాయి. జిల్లాలో సంక్రాంతి సందర్భంగా మూడురోజుల పాటు కోడిపందాలు, పేకాట, గుండాట, కోతాట విచ్చలవిడిగా జరిగాయి. ఈ మూడురోజులు పోలీసులు అటువైపు కన్నెతి కూడా చూడలేదు. అయితే పోలీసులు శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకే జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడ పందాలు నిలిపివేసినప్పటికీ దెందులూరు నియోజకవర్గంలో మాత్రం యధేఛ్చగా శనివారం కూడా కొనసాగాయి.
 
 ఉదయం ఎనిమిది గంటల నుంచే పందాలు జరగడంతో నియోజకవర్గానికి చెందిన పందెంరాయుళ్లే కాకుండా జిల్లా నలుమూలల నుంచి పెద్దఎత్తున దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం కొప్పాక గ్రామానికి చేరుకున్నారు. జిల్లా పోలీసులు, అధికార యంత్రాంగం ఒకపక్క ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన ఏర్పాట్లలో బిజీగా ఉన్న నేపథ్యంలో చింతమనేని తన హవా కొనసాగించారు. ఆయన దగ్గర ఉండి మరీ పందాలు వేయిం చారు. దీనికి ఏలూరు పార్లమెంటు సభ్యులు మాగంటి బాబు కూడా మద్దతు ఇచ్చినట్టు ప్రచారం సాగింది. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో రాత్రి 11-00 గంటల వరకూ పందాలు యధావిధిగా జరిగాయి.
 
 ఈ విషయం జిల్లా అధికారులకు తెలిసినప్పటికీ కన్నెతి చూడలేదు. కొంతమంది పోలీసులు సాహసం చేసి కొప్పాక వెళ్లినప్పటికి వారిని చింతమనేని దూషించి పంపినట్టు సమాచారం. కోడిపందాలతో పాటు పేకాట, గుండాట, కోతాట, మద్యం విక్రయాలు విప్ కనుసన్నల్లో పెద్దఎత్తున జరిగాయి. దీంతో జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి కోడిపందాలకు వచ్చిన అ దికార పార్టీ నాయకులు దెందులూరు టైగర్ మాత్రమే పోలీసులను ఎదిరించి ఇలాంటి పనులు చేయగలడని చెప్పుకున్నారు.
 
 రూ.కోట్లలో పందాలు
 సంక్రాంతి సందర్భంగా మూడురోజుల పాటు జిల్లావ్యాప్తంగా కోడి పందాలు, పేకాట, గుండాట, కోతాటల్లో ఎన్ని రూ.కోట్లు చేతులు మారాయో శనివారం ఒక్కరోజే కొప్పాకలో జరిగిన పందాల్లో దాదాపు అంతే మొత్తంలో డబ్బు చేతులు మారిందని పందాలరాయుళ్లు తెలిపారు. చింతమనేని నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో రాత్రి వేళల్లో జరిగిన పందాల్లో  విద్యుత్ చౌర్యం భారీగా జరిగినట్టు పలువురు ఆరోపిస్తున్నారు.టోల్‌గేట్ ఏర్పాటు : నిబంధనలకు విరుద్ధంగా కోడిపందాలు నిర్వహించటం ఒక ఎత్తైతే, పందాలకు వచ్చే వారి వాహనాలకు టోల్‌గేట్ ఏర్పాటు చేసి మరీ డబ్బు వసూలు చేయటం  దారుణంగా ఆరోపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చాలా మంది కొప్పాకకు కోడిపందాలు చూడటానికి వచ్చిన నేపథ్యంలో కారుకి రూ.100, మోటార్ సైకిల్‌కు రూ.50 చొప్పున వసూలు చేశారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement