
మాజీ సీఎం చంద్రబాబు నది ఒడ్డున నివసిస్తున్నారు. ఇప్పుడు ఆ ఇంటికి నీటి వరద వచ్చింది. చంద్రబాబు హైదరాబాద్ పారిపోయారు.
సాక్షి, విజయవాడ : పులిచింతల నుంచి వరద కొనసాగుతుండటంతో ప్రకాశం బ్యారేజీవైపు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో బ్యారేజీ పూర్తిగా నిండిపోయింది. 4.47 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రులు కురసాల కన్నబాబు ,వెల్లంపల్లి శ్రీనివాస్ కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటించారు. కలెక్టర్ ఇంతియాజ్ అహమ్మద్ ,జేసీ మాధవీ లత వరద పరిస్థితుల్ని వారికి వివరించారు. పదేళ్ల తర్వాత రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళతో ఉన్నాయని కన్నబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ..
‘కృష్ణా, గోదావరినదులు ఉప్పొంగడంతో వరదలు పోటెత్తుతున్నాయి. 4.47లక్షల క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజి నుంచి కిందకు విడుదల చేస్తున్నారు. నాగాయలంక, కంచికచర్ల, భవానీపురం ప్రాంతాల్లో లోతట్టు ప్రాంత వాసుల్ని పునరావాస కేంద్రాలకు తరలించాం. నిబంధనల పేరుతో కాలయాపన చేయకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. మునిగిపోయిన తర్వాత సహాయక కార్యక్రమాలు చేసే ప్రభుత్వం కాదిది. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో భోజనం, ఇతర సదుపాయాలు కల్పించాం. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు స్నానానికి నదిలో దిగొద్దు. ముందస్తుగా గజ ఈతగాళ్లు, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాం’అన్నారు.
మంచి చెప్పినా రాజకీయమన్నారు..
ప్రకాశం బ్యారేజీ 70గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. పదేళ్ల తర్వాత అన్ని డ్యామ్‌లు నిండుకుండలా మారాయని ఆనందం వ్యక్తం చేశారు. వరద బాధితులకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘మాజీ సీఎం చంద్రబాబు నది ఒడ్డున నివసిస్తున్నారు. ఇప్పుడు ఆ ఇంటికి నీటి వరద వచ్చింది. చంద్రబాబు హైదరాబాద్ పారిపోయారు. వరద వస్తే నదీ పరివాహక ప్రాంతంలో ముప్పు వస్తుందని సీఎం జగన్ ముందే చెప్పారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మంచి చెప్పినా రాజకీయ కోణంలోనే చూశారు’అని ఆగ్రహం వ్యక్తం చేశారు.