విశాఖపై విషమెందుకు?

Minister Avanthi Srinivas Comments On Chandrababu - Sakshi

ఉత్తరాంధ్ర ఓట్లతో ఏళ్లతరబడి బాబు ఏలుబడి

రాజధాని విషయమొచ్చేసరికి వెన్నుపోటు

చంద్రబాబుపై మంత్రి ముత్తంశెట్టి ధ్వజం

‘విశాఖ రాజధాని’కి మద్దతుగా కాగడాల ప్రదర్శన 

అల్లిపురం(విశాఖ దక్షిణం): ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లతో గెలిచిన చంద్రబాబు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖల మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నం కాస్మొపాలిటిన్‌ సిటీగా రాజధానికి అన్ని అర్హతలున్న నగరమని అభివర్ణించారు. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా ప్రతిపాదిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటనను స్వాగతిస్తూ  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం డాబాగార్డెన్స్‌లోని అంబేడ్కర్‌ సర్కిల్‌ నుంచి రెడ్‌నమ్‌ గార్డెన్స్‌ మీదుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు కాగడాలతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ విశాఖపట్నం అభివృద్ధి చెందిన నగరంగా రాజధానికి అన్ని అర్హతులు ఉన్నాయన్నారు. దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమన్నారు.

ముంబై నగరానికి దీటుగా విశాఖ అభివృద్ధి చెందుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా విశాఖను తక్కువ ఖర్చుతోనే అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ముఖ్యమంత్రి జగన్‌ ప్రజల నుంచి ఎక్కడ క్రెడిట్‌ కొట్టేస్తారోననే అక్కసుతో చంద్రబాబు రైతులను రెచ్చగొడుతున్నారన్నారు. ఆయనకు సిగ్గు, లజ్జ ఉంటే ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లతో.. ముఖ్యంగా విశాఖ నగర ప్రజల ఓట్లతో గెలిచిన తన నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్‌ చేశారు. వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు పరిపాలన వికేంద్రీకరణను కోరుకుంటున్నారన్నారు. విశాఖ ప్రజలు ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారన్నారు. కార్యక్రమంలో గాజువాక, అనకాపల్లి, పెందుర్తి ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గుడివాడ అమర్‌నాథ్, అన్నంరెడ్డి అదీప్‌రాజు, పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్‌ డాక్టర్‌ మళ్ల విజయప్రసాద్, మంత్రి రాజశేఖర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా గురువులు, కొయ్యప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top