మెరుగైన వైద్యానికి చర్యలు | Measures to better medical | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్యానికి చర్యలు

Sep 3 2014 12:26 AM | Updated on Mar 21 2019 8:35 PM

గిరిజన ప్రాంతంలో మెరుగైన వైద్య సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ ఎన్. యువరాజ్ తెలిపారు.

అరకు రూరల్ : గిరిజన ప్రాంతంలో మెరుగైన వైద్య సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ ఎన్. యువరాజ్ తెలిపారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అరకు ఏరియా ఆస్పత్రిలో వైద్య నిపుణులు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారానికి ఒకరోజు వైద్య నిపుణులతో కూడిన బృందంతో అరకు ఏరియా ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలు చేసేలా చర్య తీసుకుంటామన్నారు. ఏజెన్సీలో మార్పు ప్రోగ్రాం బాగుందన్నారు. అమృతహస్తం ద్వారా అందుతున్న పౌష్టికాహారం వల్ల మన్యంలో శిశు మరణాలు తక్కువగా ఉన్నాయన్నారు.
 
ఏజెన్సీలో విధులకు ఎంబీబీఎస్ డాక్టర్లు మాత్రమే వస్తున్నారని, పీజీలు ముందుకువస్తే బాగుంటుందన్నారు. బాక్సైట్ తవ్వకాలకు తమకు ఎటువంటి సమాచారం రాలేదన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం దీనిపై స్పష్టత రావచ్చన్నారు. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు గతేడాది మంజూరు కాలేదన్నారు. మొత్తం 45 శాఖలుంటే కేవలం నాలుగింటికి మాత్రమే గతేడాది నిధులు మంజూరయ్యాయన్నారు. ఇసుక రీచ్‌లకు త్వరలో జిల్లా స్థాయి కమిటీతో చర్చించి, విధి విధానాలు రూపొందిస్తామన్నారు. పెదలబుడు, పద్మాపురం మేజర్ పంచాయతీలకు పద్మాపురం సమీపంలో డంపింగ్ యార్డు ఏర్పాటుకు స్థలం కేటాయించాలని తహశీల్దార్ జయప్రకాష్‌ను ఆదేశించారు.
 
వైద్య సేవల తీరుపై ఆరా
కలెక్టర్ అంతకుముందు స్థానిక ఏరియా ఆస్పత్రి, మాడగడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఏరియా ఆస్పత్రిలో రోజుకు ఎంతమంది ఓపీకి వస్తున్నారు? ఎందరు ఆస్పత్రిలో చేరుతున్నారు? రోగులకు ఏఏ సేవలు అందుతున్నాయి వంటి వివరాలను కాంట్రాక్టు డాక్టర్‌లను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో గైనిక్, జనరల్ వార్డులలో రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు.
 
మరుగుదొడ్లు పరిశీలించారు. రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారిని చూసి ఆస్పత్రిలోని బ్లడ్‌బ్యాంక్‌లో ఎన్ని యూనిట్‌ల రక్తం నిల్వ ఉంచేందుకు అవకాశం ఉందో డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. నర్సులు ఎంతమంది ఉన్నారు, వారికి నివాస గృహాలు (క్వార్టర్లు) ఉన్నాయా లేదా అని ఆరా తీశారు. ల్యాబ్‌లు, చిన్నపిల్లల కేర్ సెంటర్ పరిశీలించారు. వైద్య నిపుణులు ఎంతమంది ఉన్నారు? ఎన్ని బెడ్లు ఉన్నాయో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
 
అంతకుముందు మండలంలోని మాడగడ పీహెచ్‌సీని కలెక్టర్ తనిఖీ చేశారు. 12 గంటల పీహెచ్‌సీ కావడంతో రాత్రివేళల్లో సిబ్బంది లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరిజనులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. పీహెచ్‌సీలో డాక్టర్ లేకపోవడంతో హాజరు పట్టికలో ఆబ్సెంట్ నమోదు చేశారు. ఏఎన్‌ఎంలు స్థానికంగా ఉండడం లేదని చెప్పడంతో స్థానికంగా ఏఎన్‌ఎంలు నివాసం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement