తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్‌లో రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ మార్చి 15న జరగనుంది.
- ఏపీ, తెలంగాణలో నేడు నోటిఫికేషన్ జారీ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్‌లో రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ మార్చి 15న జరగనుంది. తొలుత ఈ స్థానాలకు మార్చి 16న పోలింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) షెడ్యూలు విడుదల చేసింది. అయితే.. ఇరు రాష్ట్రాల్లోనూ మార్చి 16న ఇంటర్మీడియెట్ పరీక్షలు ఉండడంతో మార్చి 15న (ఆదివారం) పోలింగ్ నిర్వహించనున్నారు.
పరీక్షల విషయమై ఇరు రాష్ట్రాల నుంచి నివేదిక అందిన నేపథ్యంలో సీఈసీ ఈ మేరకు నిర్ణయించింది. తెలంగాణలో మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి, వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మె ల్సీ స్థానానికి గురువారం నోటిఫికేషన్ జారీ కానుంది.
అలాగే ఆంధ్రప్రదేశ్‌లో తూర్పుగోదావరి-పశ్చిమగోదావరి ఉపాధ్యాయ ఎమ్మె ల్సీ నియోజకవర్గానికి, కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి కూడా గురువారమే నోటిఫికేషన్ జారీ కానుంది. తాజాగా జారీ చేయనున్న నోటిఫికేషన్‌లో పోలింగ్ తేదీని మార్చి 15గా ప్రకటించాలని కమిషన్ నిర్ణయించింది. ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.