మంజీరా నీటి సరఫరా ప్రాజెక్టుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి శ్రీకారం చుట్టారు.
చేవెళ్ల, న్యూస్‌లైన్: మంజీరా నీటి సరఫరా ప్రాజెక్టుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి శ్రీకారం చుట్టారు. తనకు సెంటిమెంట్‌గా ఉన్న చేవెళ్ల ప్రజల కోరిక మేరకు వారికి రక్షిత మంచినీటిని అందజేయాలన్న సంకల్పంతో2008వ సంవత్సరం నవంబర్ 19వ తేదీన ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. రూ.20కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పనులను 9నెలల్లో పూర్తిచేసి అందరికీ తాగునీటిని అందిస్తామని ఆ రోజు జరిగిన బహిరంగసభలో సీఎం రాజశేఖర రెడ్డి ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను చేపట్టిన గ్రామీణ నీటి సరఫరా విభాగం మొదటి దశ పనులను చకచకా పూర్తిచేసింది. అయితే వైఎస్సార్ హఠాన్మరణంతో అధికారం చేపట్టిన వారు నీటి సరఫరా ప్రాజెక్టును పక్కనపెట్టేశారు. నిర్మాణ పనులు మందగించడంతో పథకం కొనసా... గుతూనే ఉంది. వైఎస్సార్ బతికి ఉంటే ఇప్పటికే మంజీరా నీటి సరఫరా ప్రారంభమై తమకు వేసవిలో తాగునీటికి ఢోకా ఉండకపోయేదని ప్రజలు పేర్కొంటున్నారు.
పనులు పూర్తయినా..
రూ.20కోట్లతో చేపట్టిన పనులను పూర్తిచేసి మొదటిదశలో చేవెళ్ల మండలంలోని 18 గ్రామాలకు మంజీరా నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. చేవెళ్ల, దేవునిఎర్రవల్లి, న్యాలట, ఎనికెపల్లి, కమ్మెట, గొల్లగూడ, సింగప్పగూడ, ఊరెళ్ల, ఇబ్రహీంపల్లి తదితర గ్రామాలకు నీటిని అందించాలని సంకల్పించారు. శంకర్‌పల్లి వద్ద సింగాపూర్ గ్రామం వద్దనుంచి పైప్‌లైను, మధ్యమధ్యలో సంపులు, చేవెళ్లలో 90వేల లీటర్ల ఓవర్‌హెడ్ ట్యాంకు, ధర్మాసాగర్ వద్ద సంపు నిర్మాణాలను పూర్తిచేశారు.
పనులు గత సంవత్సరం ద్వితీయార్థంలో పూర్తయినా ఈ నాటికీ చుక్కనీరు కూడా సరఫరా కాకపోవడం శోచనీయం. ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రం త్వరలోనే తాగునీరు అందిస్తామని చెబుతూ వస్తున్నారే తప్ప ఆచరణలో విఫలమవుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.