మహిళలే... మహరాణులు 

Majority Of  Voters Are Women In East Godavari District - Sakshi

స్థానిక ఎన్నికలలోనూ స్త్రీలదే పైచేయి

ఎస్సీ, ఎస్టీ, బీసీ  వర్గాల్లోనూ వారే కీలకం

50 శాతం పంచాయతీల్లో అందలమెక్కనున్న అతివలు 

650 ఓట్లు దాటితే మరో పోలింగ్‌ స్టేషన్‌

సాక్షి, తూర్పు గోదావరి : ప్రతీ ఓటు కీలకంగా భావించే పంచాయతీ పోరులో మహిళలు ప్రధాన భూమిక పోషించనున్నారు. అధికంగా ఓటుహక్కు కలిగి ఉండటం ద్వారా అభ్యర్థి జయాపజయాలను ప్రభావితం చేయనున్నారు. జిల్లాలో మొత్తం ఓటర్లలో అధికంగా మహిళలు 14,102 మంది ఓటుహక్కును కలిగి ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో వీరిదే పైచేయి. 50 శాతం పంచాయతీల్లో అతివలే అందలమెక్కనున్నారు. త్వరలో నోటిఫికేషన్‌ వెలువడుతుందన్న ఊహాగానాలు నేపథ్యంలో రిజర్వేషన్లపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. జిల్లాలో 1,072 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కుల,గణన పూర్తి చేసి ఓటరు జాబితాలను సిద్ధం చేసింది.

జిల్లాలోని పంచాయతీల్లో మొత్తం 32,52,069 మంది ఓటర్లుండగా పురుషులు 16,18,930 మంది, మహిళలు 16,33,032 మంది, ఇతరులు 107 మంది ఉన్నారు. పురుషులతో పోలిస్తే 14,102 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో వీరి ఓట్లు అధికంగా ఉన్నాయి. పంచాయతీ పోరులో ప్రతి ఓటూ ముఖ్యమైనదే...దీంతో మహిళా ఓటర్లు కీలకం కానున్నారు. అభ్యర్థుల గెలుపు ఓటములను వీరు ప్రభావితం చేయనున్నారు. 50 శాతం పంచాయతీల్లో మహిళలు అందలమెక్కనున్నారు. 

12,514కు పెరిగిన పోలింగ్‌ కేంద్రాలు
సాధారణంగా వార్డుకు ఒక పోలింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసేవారు. ఈ మేరకు గత పంచాయతీ ఎన్నికల్లో 1,007 పంచాయతీల్లో ఎన్నికల కోసం 11,434 పొలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 1072 పంచాయతీల్లో ఎన్నికలకు అధికారులు సన్నాహాలు చేశారు. తాజా నిబంధనల మేరకు వార్డులో 650 ఓట్లు దాటితే మరొక పోలింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేశారు. అలాగే వార్డులో ఎస్సీ, ఎస్టీ ఓటర్లు మూడో వంతు ఉన్నా, పంచాయతీకి దూరంగా రెండు నుంచి ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న వాటికి అదనంగా మరొక పోలింగ్‌ బూత్‌ను ఏర్పాటు చేశారు. జిల్లాలో 11994 వార్డులకుగాను అధికారులు 12,514 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

రిజర్వేషన్లపై జోరుగా చర్చలు 
సుప్రీంకోర్టు సూచనమేరకు 50 శాతానికి మించకుండా రిజర్వేషన్లు అమలు చేయాలి. ప్రభుత్వ నిర్ణయం మేరకు పంచాయతీ, వార్డుల్లో రిజర్వేషన్ల కేటాయింపుపై అధికారులు కసరత్తు చేయనున్నారు. ఓసీ జనరల్, ఓసీ లేడీ, బీసీ జనరల్, బీసీ లేడీ, ఎస్సీ జనరల్, ఎస్సీ లేడీ, ఎస్టీ జనరల్, ఎస్టీ లేడీ కేటగిరీలుగా రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. గతంలో పంచాయతీ, వాటిలోని ఆయా వార్డులు ఏ సామాజిక వర్గాలకు రిజర్వయ్యాయి, ఇప్పుడు ఏ సామాజిక వర్గాలకు రిజర్వవుతాయనే విషయమై గ్రామాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. త్వరలో ఎన్నికలు జరగనుండటంతో ఇప్పటి నుంచే ఆయా రాజకీయ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు, ఆశావాహులు గ్రామాల్లో పట్టు నిలుపుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. తమ వారితో లోపాయికారీ సమావేశాలు నిర్వహించుకుంటున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top