పైలాన్... | Lotus vikasincukunna two hands | Sakshi
Sakshi News home page

పైలాన్...

Dec 15 2013 2:25 AM | Updated on Sep 2 2017 1:36 AM

పైలాన్...

పైలాన్...

కమలంలా వికసించుకున్న రెండు హస్తాలు. దాని మధ్యలోంచి నిటారుగా నిల్చున్న కాకతీయుల కాలం నాటి స్తంభం. దానిపై రాజసం ఉట్టిపడేలా హంస.

సాక్షి, హన్మకొండ : కమలంలా వికసించుకున్న రెండు హస్తాలు. దాని మధ్యలోంచి నిటారుగా నిల్చున్న కాకతీయుల కాలం నాటి స్తంభం. దానిపై రాజసం ఉట్టిపడేలా హంస. కాకతీయ ఉత్సవాల్లో భాగంగా వరంగల్ నగరంలో నిర్మిస్తున్న పైలాన్ డిజైన్ ఇది. పైలాన్ కింది భాగంలో స్వచ్ఛతకు గుర్తుగా కమలం ముద్ర... దానిపై కాకతీయల సాంకే తిక నైపుణ్యం, నిర్మాణ కౌశలానికి ప్రతిబింబించేలా కీర్తితోరణాల స్తంభం... దాని మీద కాకతీయ కళలు, సంస్కృతి చిహ్నాలు ముద్రిస్తూ... స్తంభం పైభాగంలో హంస నిల్చుని ఉండేలా కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పైలాన్‌ను నిర్మిస్తున్నారు.

రూ.6.5 లక్షల వ్యయంతో వడ్డేపల్లి చెరువు గట్టుపై ఇది రూపుదిద్దుకుంటోంది. ఈ నెల 20వ తేదీ నాటికి పైలాన్ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధం కానుంది. కాకతీయ ఉత్సవాల సందర్భంగా పైలాన్ నిర్మించాలని గతంలోనే నిర్ణయించినా... పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు కాకతీయ ఫెస్టివల్ ముగింపు సమయంలో పైలాన్ నిర్మాణ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. పైలాన్‌ను ఎక్కడ నిర్మించాలనే అంశంపై నగరంలో చాలా ప్రాంతాలను పరిశీలించారు.

చివరకు హన్మకొండ పబ్లిక్ గార్డెన్, వడ్డేపల్లి చెరువును ఎంపిక చేశారు. ఈ క్రమంలో పది రోజుల క్రితం వడ్డేపల్లి చెరువు కట్టపై బతుకమ్మ విగ్రహం పక్కన స్థలాన్ని పైలాన్ నిర్మాణానికి అనువైనదిగా అధికారులు గుర్తించారు. అదేవిధంగా పైలాన్ నిర్మాణానికి సంబంధించి వందలాది డిజైన్లు వచ్చినా... చివరికి ఏడు డిజైన్లు ఉత్తమమైనవిగా నిర్ధారించారు. దానిలో చిలువేరు మనోహర్ డిజైన్‌ని అత్యుత్తమంగా ఎంపిక చేసి నిర్మాణ ప్రక్రియ మొదలుపెట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement