తురాయిపువలస(సీతంపేట):వివాహ కార్యక్రమానికి వెళ్తున్న ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన సీతంపేటకు సమీపంలోని తురాయిపువలస మలుపు వద్ద బుధవారం జరిగింది.
తురాయిపువలస(సీతంపేట):వివాహ కార్యక్రమానికి వెళ్తున్న ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన సీతంపేటకు సమీపంలోని తురాయిపువలస మలుపు వద్ద బుధవారం జరిగింది. లారీ, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో బుడగరాయి గ్రామానికి చెందిన సవర బాలకృష్ణ(35) అనే గిరిజనుడు తనువు చాలించాడు.
వివరాల్లోకి వెళితే... కొత్తూరు మండలం గొట్టిపల్లి పంచాయతీ పరిధిలోని దిబ్బగూడ గ్రామంలో జరిగే వివాహానికి బుడగరాయి గ్రామస్తులంతా వధువును తోడ్కొని రెండు వ్యాన్లలో వెళ్తున్నారు. వారి వెనుక ద్విచక్ర వాహనంపై సొటయ్య అనే వ్యక్తి డ్రైవింగ్ చేస్తుండగా బాలకృష్ణ వెనుకన కూర్చుని వెళ్తున్నారు. తురాయిపువలస మలుపు వద్ద కొత్తూరు నుంచి ఎదురుగా వస్తున్న లారీ, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకున్నాయి. దీంతో వెనుక కూర్చున్న బాలకృష్ణకు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108కి ఫోన్ చేసినప్పటికీ సమయానికి వాహనం రాలేదు.
దీంతో ఆటోలో పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో బాలకృష్ణ మృతి చెందాడు. మృతునికి భార్య సుజాత, పిల్లలు జయరాజ్, ప్రకాష్ ఉన్నారు. పెళ్లి కార్యక్రమానికి వెళ్తున్న వ్యక్తి చనిపోవడంతో కుటుంబ సభ్యులతోపాటు బంధువులు విషాదానికి గురయ్యారు. ఏఎస్సై జగన్నాథం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పాలకొండ ఏరియా ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.