యూరియా, డీఏపీ, ఏవోపీ లాంటి ఎరువుల ధరలను టన్నుకు రూ.5వేల వరకు తగ్గించామని కేంద్రం అట్టహాసంగా ప్రకటించింది.
తగ్గని ఎరువుల ధర
కేంద్రం ప్రకటించినా పట్టించుకోని డీలర్లు
ఖరీఫ్‌లో 1.08 లక్షల టన్నుల వినియోగం
రూ.50 కోట్లపైగా రైతులపై అదనపు భారం!
యూరియా, డీఏపీ, ఏవోపీ లాంటి ఎరువుల ధరలను టన్నుకు రూ.5వేల వరకు తగ్గించామని కేంద్రం అట్టహాసంగా ప్రకటించింది. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని ఊదరగొట్టేసింది. ఇలా ప్రకటించి పది రోజులు కావస్తున్నా ఎరువుల ధరలు తగ్గలేదు. అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో డీలర్లు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నారు. దీంతో ఈ ఒక్క ఖరీఫ్‌లోనే రైతులపై రూ.50 కోట్లపైగా అదనపు భారం పడనున్నట్టు సమాచారం.
చిత్తూరు : రసాయన ఎరువులకు ఉపయోగించే ముడి సరుకుల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుముఖంపట్టాయి. దీంతో ఎరువుల ధరలను తగ్గించాలని కేం ద్రం నిర్ణయించింది. టన్నుకు రూ.5వేలు తగ్గిస్తున్నామని, ఇవి తక్షణం అమల్లోకి వస్తాయని పది రోజుల క్రితం పత్రికల ద్వారా ప్రకటనలు గుప్పించింది. కానీ జిల్లాలో ఇప్పటివరకు ఆ ధరలు అమలు కాలేదు. ఎరువుల ధరల విషయమై తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని డీలర్లు చెబుతున్నారు. అధికారులు తమ పరిధిలో లేదంటూ చేతులెత్తేయడంతో రైతులు ఈ ఒక్క ఖరీఫ్‌లోనే సుమారు రూ.50 కోట్ల వరకు నష్టపోవాల్సి వస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం
ఎరువుల ధరల విషయమై రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడంలేదు. చిన్నచిన్న సమస్యలను కూడా రాష్ర్ట ప్రభుత్వ పెద్దలు కేంద్రాన్ని అడిగే సాహసం చేయలేకపోవడంపై రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ప్రకటనలు ఆర్భాటంగా చేస్తూ చేతలకు వచ్చే సరికి రిక్త హస్తాలు చూపించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు షరా మామూలైపోయిందని విమర్శిస్తున్నారు. జిల్లాలో ఉన్న సగం కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్నాయి. వీరిపై కరుణ చూపడానికి మాత్రం వారికి మనసు రావడం లేదని పలువురు నాయకులు వాపోతున్నారు.
ఇప్పటివర కు ఆదేశాలు ఇవ్వలేదు
ఎరువుల ధరలు తగ్గించామని కేంద్రం ప్రకటించిందే కానీ ఇప్పటివరకు వ్యవసాయ శాఖకు ఆదేశాలు ఇవ్వలేదు. కేంద్రం మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. తగ్గించిన ధరలకు అనుగుణంగా ఎరువులు అమ్మాలని వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలి. - మాగంటి గోపాల్‌రెడ్డి, రాష్ట్ర రైతు సంఘ నాయకుడు
ఇంకో వారంలో కొత్త ధరలు
ఇంకో వారంలో కొత్త ధరలతో ఎరువులు అందుబాటులోకి వస్తాయి. దిగుమతి చేసుకున్న ఎరువులను కొంత వరకు తగ్గించి అమ్ముతున్నాం. దేశంలో ఉత్పత్తయ్యే ఎరువులు ఇప్పటికీ పాత ధరలకే అమ్ముతున్నాం. వీటిపై ఇంకో వారంలో స్పష్టత వస్తుంది.
- సురేష్‌బాబు, సుబ్రమణ్యేశ్వర ట్రేడర్స్, ఆర్సీ రోడ్, తిరుపతి
తగ్గించిన ధరలకే అమ్మాలి
కేంద్రం డీపీ, ఎంవోపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలను తగ్గించింది. ఈ విషయం చాలా మంది రైతులకు తెలీదు. అయినా మునుపటి ధరలకే షాపుల వారు అమ్ముతున్నారు. దీని వల్ల రైతు బాగుండాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరకుండా పోతోంది. కేంద్రం తగ్గించిన ధరలకే ఎరువులను అమ్మేలా చూడాలి. - గుర్రాల కుమార్, కురబలకోట మండలం