బెంబేలెత్తిస్తున్న చిరుత

Leopard Fear in East Godavari Atreyapuram Village People - Sakshi

అంకంపాలెం ఇటుక బట్టీల సమీపంలో అడుగుజాడలు

7వ రోజూ గాలింపు చర్యలు

గ్రామాల్లో హెచ్చరికల టాంటాంలు

తూర్పుగోదావరి , ఆత్రేయపురం (కొత్తపేట): ఆత్రేయపురం, రావులపాలెం మండలాల వాసులను చిరుతపులి సంచారం వార్త బెంబేలెత్తిస్తోంది. తాజాగా ఆత్రేయపురం మండలం అంకంపాలెం ఇటుక బట్టీల వద్ద దాని అడుగుల ముద్రలు పడినట్టు బట్టీల యజమానులు తెలిపారు. చిరుత సంచరిస్తోందని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తూ టాంటాంలు వేయిస్తున్నారు. ఆ నేపథ్యంలో 7వరోజు ఆదివారం పోలీసు, అటవీశాఖ అధికారులు చిరుత కోసం గాలింపు చర్యలను కొనసాగించారు. అంకంపాలెం, ర్యాలి  గ్రామాల సమీప ప్రాంతాల్లో చిరుత పులి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టారు. వారు డ్రోన్‌ కెమెరాలతో లంక ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. మొదటి రోజు ఈ నెల 4వ తేదీన  అంకంపాలెంలో కనిపించిన చిరుత ఆతర్వాత ఎవరికీ కనిపించలేదు. దాని పాద ముద్రల ఆధారంగా ఈప్రాంతంలో అధికారులు ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నారు.చిరుత భయంతో కూలీలు పనులకు రాకపోవడంతో వ్యవసాయ పనులకు అంతరాయం ఏర్పడింది. చిరుత దొరికే వరకు ప్రజల్లో భయాందోళనలు తప్పవు.

అవి బావురుపిల్లి అడుగుజాడలు
రావులపాలెం/ఆలమూరు (కొత్తపేట): ఈ నెల నాలుగున అంకంపాలెంలో ప్రత్యక్షమైన చిరుతపులి శుక్రవారం రావులపాలెం మండలంలోని ఊబలంక లంక భూముల్లో కనిపించినట్టు రైతు మేడపాటి సాంబశివారెడ్డి రావులపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చేనుకు నీరు పెడుతుండగా చిరుతపులిని చూశానని అతను పేర్కొన్నాడు. దాంతో పోలీసులు అటవీశాఖ అధికారులకు ఆ సమాచారం అందించగా వారు ఆ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ ఉన్న పాదముద్రలు చిరుతపులివి కావని, అవి బావురుపిల్లి అడుగులేనని తేల్చి చెప్పారు.  రావులపాలెం, ఆత్రేయపురం మండలాల్లోని లంక భూముల్లోకి పనులు చేసుకునేందుకు అప్పుడే వెళ్లవద్దని అధికారులు సూచిస్తుండడంతో రైతులకు ఏమి చేయాలో తోచడం లేదు. ఇదిలా ఉండగా చిరుతపులి తమ గ్రామంలోకి రావచ్చని ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఊబలంక– బడుగువాని లంక గ్రామాల మధ్య గోదావరి పాయ ఉంది. అందులో నీరు లేకపోవడంతో ఏక్షణంలోనైనా చిరుతపులి తమ పంట పొలాలు, తోటల్లోకి ప్రవేశించే అవకాశం లేకపోలేదని అధికారులు చెబుతున్నారు. ఆలమూరు ఎస్సై టి.క్రాంతికుమార్‌ లంక గ్రామాల రైతులను అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే లంక గ్రామాల పరిధిలో దండోరా వేయించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top