చిత్తూరులో కనిపించని శాంతిభద్రతలు

Law and Order Missing in Chittoor - Sakshi

మాజీ మేయర్‌ దంపతుల హత్యాకాండ

దేవాదాయశాఖ ఆఫీసులో గూండాగిరి

టెండరు వేసినందుకు ఆర్యవైశ్యుడిపై దాడి

కార్పొరేషన్‌లో దళిత ఉద్యోగులపై వేధింపులు

టీడీపీ అధికారంలోకి వస్తే చిత్తూరులో రౌడీయిజాన్ని రూపుమాపుతామని శపథం చేశారు. ఇంటింటా తిరిగి కరపత్రాలు పంచారు. అదే రౌడీయిజానికి మాజీ మేయర్‌ అనూరాధ, ఆమె భర్త మోహన్‌ బలైపోయారు. పచ్చ కండువా వేసుకుంటే ఎవర్నైనా కొట్టొచ్చంటూ టీడీపీ కార్యకర్తలు గూండాగిరి ప్రదర్శించారు. మున్సిపాలిటీ, దేవాదాయశాఖల అధికారులను చావబాదారు. విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పైనా దాడి చేశారు. ఇది చాలదన్నట్లు జిల్లా కలెక్టరేట్‌లో దౌర్జన్యకాండకు దిగారు. ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ లోపలికి చొరబడి ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తిని కొట్టారు. గత ఐదేళ్లల్లో చిత్తూరు నగరంలో రౌడీయిజం పెచ్చుమీరిందన్నది జనం మాట్లాడుతున్న సత్యం.

చిత్తూరు అర్బన్‌: అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పిన చిన్నపాటి పనులు ప్రభుత్వ శాఖల్లో జరగడం సహజంగా కనిపించే విషయమే. ఇది పోలీసుశాఖకు వర్తించదు. తప్పు ఎవరు చేసినా చట్టం ముందు సమానమే. చిత్తూరులో చట్టం టీడీపీ నేతల చేతుల్లో చుట్టమైంది. కొందరు పోలీసు అధికారులు తమ విధులను పక్కనబెట్టి అధికారపార్టీ నాయకులకు సాగిలపడ్డారు. గడచిన ఐదేళ్లల్లో చిత్తూరు నగరంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసుల్లో కొందరు కులపిచ్చిని తలకెక్కించుకుని పోస్టింగులు కాపాడుకోవడానికి టీడీపీ నేతలు ఆడమన్నట్టు  ఆడారు. ఫలితంగా అధిరపార్టీ నాయకుల రౌడీయిజానికి చిత్తూరులో జరిగిన ఘటనలు పరాకాష్టగా నిలిచాయి.

ఆర్డర్‌ తప్పిన లా..
2015 జూన్‌ 9.. ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న జమదగ్ని చర్చీవీధిలో విధుల్లో ఉంటూ త్రిబుల్‌ రైడింగ్‌ చేస్తున్న వారిని ఎస్‌ఐకి పట్టించారు. ఆ మరుసటి రోజు రెచ్చిపోయిన పది మంది యువకులు జమదగ్నిపై నడిరోడ్డుపై దాడి చేశారు. వారిపై బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసు పెట్టారు. దాడిచేసిన యువకుడు చిత్తూరు సింగిల్‌విండో అధ్యక్షుడి కుమారుడు. అధికారులపై ఒత్తిడి తెచ్చింది జెడ్పీ కార్యాలయంలోని ప్రజాప్రతినిధి భర్త.
ఆన్‌లైన్‌లో సాంకేతిక సమస్య నెలకొనగా పింఛన్‌ దరఖాస్తు అప్‌లోడ్‌ చేయలేకపోయిన చిత్తూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయ ఉద్యోగి కోదండన్‌పై 2015 జూలై 8న టీడీపీ కార్యకర్త బాబు చేయిచేసుకున్నాడు. దీనిపై ఉద్యోగులంతా కలిసి కమిషనర్‌ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదుకాలేదు. బాధితుడు దళితుడు కావడంతో అట్రాసిటీ కేసు పెట్టాల్సిన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
చంద్రబాబు నాయుడు హామీలు నెరవెర్చలేదని శాంతియుత నిరసన తెలియచేయడానికి వచ్చిన కాంగ్రెస్‌ నేతలపై టీడీపీ నాయకులు చిత్తూరు నడిబొడ్డున గాంధీ విగ్రహం వద్ద 2015 జూన్‌ 8న దౌర్జన్యానికి పాల్పడ్డారు. వాహనాలను ధ్వంసం చేసినా పోలీసులు పట్టించుకోలేదు.
2015 నవబంరు 17.. చిత్తూరు మునిసిపల్‌ కార్యాలయంలో అప్పటి సిట్టింగ్‌ మేయర్‌ అనురాధను పట్టపగలు కాల్చి చంపగా, ఆమె భర్తను కత్తులతో నరికి చంపారు. ఈ ఘనటకు పాల్పడిన వారు జైలులో ఉండగా.. రెండు కుటుంబాల మధ్య పగ, పత్రీకారం రలిగ్చి కుట్రకు కారణమైన వారు మాత్రం పచ్చ కండువాలు కప్పుకుని సమాజంలో పెద్ద మనుషుల్లా చలామణి అవుతున్నారు.
2016లో గంగాధరనెల్లూరుకు చెందిన టీడీపీ నేత మనోహర్‌ ఫోన్‌లో సరిగా సమాధానం చెప్పలేదని చిత్తూరులోని దేవాదాయశాఖ కార్యాలయంలో గూండారి చేసి విధ్వంసం చేశాడు. దీనిపై ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదుచేస్తే ప్రతిగా టీడీపీ నేత నుంచి కూడా ఓ ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఉద్యోగులపై కేసు పెట్టి స్వామిభక్తి చాటుకున్నారు.
2017లో చిత్తూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో సహాయ ఇంజినీరుగా పనిచేస్తున్న ఓ దళిత మహిళా గెజిటెడ్‌ ఉద్యోగిపై టీడీపీ కార్పొరేటర్‌ భర్త అందరి ఎదుటే నానా బూతులు తిట్టి కొట్టడానికి కుర్చీ ఎత్తారు. దానిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు నిట్టూర్చడం అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు నిదర్శనం.
2017 మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వంలో చిత్తూరులోని కలెక్టరేట్‌ వద్ద టీడీపీ నేతలు చేసిన గూండాగిరి అంతా ఇంతా కాదు. పెద్దమండ్యం ఎంపీపీ ప్రసాద్‌రెడ్డిని చిత్తూరు కలెక్టరేట్‌ వద్ద డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ ఎదుటే కిడ్నాప్‌ చేశారు. వెదురుకుప్పం జెడ్పీటీసీ సభ్యుడు మాధవరావుపై దాడిచేసి నామినేషన్‌ పత్రాలు చించేశారు. పీలేరుకు చెందిన భానుప్రకాష్‌ అనే వ్యక్తి నామినేషన్‌ను పోలీసుల ఎదుటే లాక్కున్నారు. అయినా ఎలాంటి కేసు లేదు. అరెస్టు లేదు.
ఆన్‌లైన్‌లో టెండరు వేసిన ఆర్యవైశుడిని గత ఏడాది మునిసిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలోని కౌన్సిల్‌ హాలుకు పిలిపించిమరీ చావబాదారు. ఇద్దరు టీడీపీ మహిళా కార్పొరేటర్ల భర్తలు, ముగ్గురు కాంట్రాక్టర్లు కలిసి ఆర్యవైశుడిని నిర్భందించి కొడితే.. పోలీసులు బెయిలబుల్‌ సెక్షన్ల కంద కేసు పెట్టారు.
గతేడాది చర్చి వీధిలో వాహనం వేగంగా నడిపి దుకాణంపైకి వెళ్లినందుకు ఓ కారును ట్రాఫిక్‌ పోలీసులు స్టేషన్‌కు తీసుకెళితే.. రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్త ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లోకే చొరబడి కారు నడిపిన వ్యక్తిని కొట్టడం పోలీసులపై ప్రజలకున్న నమ్మకానికి అద్దం పడుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top