పొరపాటున ఎలుకల మందు తిన్న కుమారుడిని తీసుకుని తల్లిదండ్రులు ద్విచక్ర వాహనంపై ఆస్పత్రికి బయలుదేరారు.
మైలవరం, న్యూస్‌లైన్ : పొరపాటున ఎలుకల మందు తిన్న కుమారుడిని తీసుకుని తల్లిదండ్రులు ద్విచక్ర వాహనంపై ఆస్పత్రికి బయలుదేరారు. మార్గమధ్యంలో ఎదురైన ఓ లారీ మోటార్‌సైకిల్‌ను ఢీకొని ఆ ముగ్గురినీ బలి తీసుకుంది. మండలంలోని పుల్లూరు జిల్లా పరిషత్ హై స్కూల్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు.
సేకరించిన వివరాల ప్రకారం.. పుల్లూరు పంచాయతీ శివారు మంగాపురం గ్రామంలో నక్కబోయిన శ్రీనివాసరావు, రమాదేవి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు పవన్(3) ఆదివారం తెలియక ఎలుకల మందు తిన్నాడు. తల్లిదండ్రులు దీనిని గమనించి కుమారుడిని తీసుకుని శ్రీనివాసరావు అనే మరోవ్యక్తితో కలిసి అతడి ద్విచక్ర వాహనంపై మైలవరం ఆస్పత్రికి బయలుదేరా రు. పుల్లూరు జిల్లాపరిషత్ హైస్కూల్ వద్ద ఎదురుగా వస్తున్న లోడు లారీ వీరి వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో నక్కబోయిన శ్రీనివాసరావు(30), పవన్ కింద పడిపోయారు. లారీ టైర్లు మీదకు ఎక్కడంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. మరోవైపు పడిపోయిన రమాదేవికి తీవ్రంగానూ, వాహనం నడుపుతు న్న శ్రీనివాసరావుకు స్వల్పంగా గాయాలయ్యాయి. రమాదేవిని హుటాహుటిన మైలవరం ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం 108లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యం లో మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై దుర్గారావు తెలిపారు.