భయం..భయంగా విధులు!

kurnool Municipal Officials Fear on TDP Attacks - Sakshi

అధికారులపై పెరుగుతున్న దాడులు

దాడి చేస్తున్న వారు టీడీపీ నేతల అనుచరులు

చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు విఫలం

కర్నూలు, ఆదోని: ఇటీవల కాలంలో ప్రభుత్వ అధికారులపై టీడీపీ నేతల అనుచరుల దాడులు పెరుగుతున్నాయి. దీంతో భయం..భయంగా విధులు నిర్వహించాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదోని మున్సిపల్‌ రెవెన్యూ విభాగాధిపతి లక్ష్మీనారాయణపై జరిగిన దాడి నేపథ్యంలో మున్సిపల్‌ ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. బదిలీ చేయించుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడం మంచిదని  పలువురు పేర్కొంటున్నారు. విధినిర్వహణలో ఉన్న అధికారిపై దాడి జరిగితే వెంటనే చర్యలు లేక పోవడం ఉద్యోగులను మరింత కలవరానికి గురి చేస్తోంది.  శనివారం తన గదిలో ఉన్న ఆర్‌ఓ లక్ష్మీనారాయణ వద్దకు వచ్చిన ఓ వ్యక్తి దుర్భాషలాడుతూ దాడి చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు రోజు ఆర్‌ఓ పశువుల సంతతో సహా పలు మార్కెట్లకు వెళ్లి కిస్తు బకాయిలపై కాంట్రాక్టర్లను హెచ్చరించారు. పశువుల సంత కిస్తు బకాయి రూ.8లక్షల దాకా చెల్లించాల్సి ఉంది.

వేలాల నిబంధన మేరకు కాంట్రాక్ట్‌ తీసుకున్న మూడు నెలలలోపు మొత్తం కిస్తు చెల్లించాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో మూడు నెలలు మాత్రం గడువు ఉండడంతో ఆర్‌ఓ మార్కెట్‌ కాంట్రాక్టర్లపై కిస్తు బకాయి కోసం ఒత్తిడి పెంచారు. అయితే ఆర్‌ఓ హెచ్చరికను పశువుల సంత కాంట్రాక్టరు అనుచరుడొకరు సహించలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య మాటామాట పెరిగినట్లు సమాచారం. తన మాటకు ఆర్‌ఓ తలూపక పోవడాన్ని అవమానంగా భావించిన సదరు వ్యక్తి దాడి చేశాడు. అయితే తనపై దాడి చేసిన వ్యక్తి పేరు తెలియదని, చూస్తే గుర్తించగలమని బాధితుడితో సహా ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు.  దాడి ఘటన కార్యాలయంలోని సీసీ పుటేజీల్లో కూడా రికార్డు అయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. అయితే శని,ఆది వరుస సెలవులు కావడంతో సీసీ పుటేజీలను పరిశీలించేందుకు అవకాశం లేకుండా పోయింది. విధి నిర్వహణలో ఉన్న ఓ స్థాయి అధికారిపైనే దాడి జరిగితే చిరు ఉద్యోగులను ఎవరు పట్టించుకుంటారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి  
మున్సిపల్‌ రెవెన్యూ విభాగాధిపతి లక్ష్మీనారాయణ ను దుర్భాషలాడుతూ చేయి చేసుకున్న వ్యక్తిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆదివారం రాత్రి సంఘం అధ్యక్ష, కార్యదర్శులు విష్ణువర్ధన్‌ రెడ్డి, కల్యాణ్‌ కుమార్, సభ్యులు నరసన్న, లెనిన్, మద్దిలేటి, పలువురు ఉద్యోగులు పత్రికా ప్రకటన విడుదల చేశారు.  

అధికార పార్టీ మద్దతు దారుడైనందుకేనా..?
ఆర్‌ఓ లక్ష్మినారాయణపై దాడికి పాల్పడిన వ్యక్తి అధికార పార్టీ మద్దతు దారుడు. దీంతో అధికారులు చర్యలకు వెనుకాడుతున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గడిచిన ఏడాదిన్నరలో ఇద్దరు చిరు ఉద్యోగులపై ప్రజా ప్రతినిధులు దాడులకు యత్నించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన మున్సిపల్‌ ఉద్యోగ సంఘాల నాయకులు భారీ ఆందోళనకు సిద్ధం అయ్యారు. ఆ ఇద్దరు ప్రజా ప్రతినిధులు బహిరంగ క్షమాపణ చెప్పడంతో వివాదం ముగిసి పోయింది. అయితే ఆర్‌ఓపై జరిగిన దాడిని తేలికగా తీసుకుంటే అధికార పార్టీ మద్దతు దారులు తాము ఏమి చేసినా చెల్లుబాటు అవుతోందని భావించే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top