బలితీసుకున్న భూతం | Killed the demon | Sakshi
Sakshi News home page

బలితీసుకున్న భూతం

Feb 11 2014 4:37 AM | Updated on Sep 2 2017 3:33 AM

అమ్మవారి నామస్మరణతో మారుమోగే తిరుచానూరు పట్టణం శోకసంద్రమైంది. సాయినగర్‌లో తల్లీబిడ్డలు మృతిచెందడంతో ప్రతి ఒక్కరూ కన్నీళ్లు కార్చారు.

తిరుచానూరు, న్యూస్‌లైన్: అమ్మవారి నామస్మరణతో మారుమోగే తిరుచానూరు పట్టణం శోకసంద్రమైంది. సాయినగర్‌లో తల్లీబిడ్డలు మృతిచెందడంతో ప్రతి ఒక్కరూ కన్నీళ్లు కార్చారు. మద్యానికి బానిసైన భర్తను భరించలేక క్షణికావేశంలో ఆమె ఈ పని చేసింది. చెడు సావాసాలు మానేయాలని కల్పన ఎంతగా చెప్పినా ఆమె భర్త కిశోర్‌ఆచారిలో మార్పు రాలేదు. నెల్లూరుకు కాపురం మార్చితే పుట్టింటివాళ్లు రూ.20లక్షలు ఇచ్చి సొంత వాహనం కొనిస్తారని ఆమె చెప్పినా అతను వినిపించుకోలేదు. దీంతో ఆమె మానసికంగా కృంగిపోయింది.

ఆదివారం సాయంత్రం ఇంట్లో భర్తలేని సమయంలో పాయసం వండి అందులో పురుగులమందు కలిపి పిల్లలకు తినిపించింది. తాను ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకుంది. చీకటిపడ్డా ఇంట్లో లైట్లు వెలగకపోవడంతో సమీపంలోని కిశోర్‌ఆచారి సోదరి అక్కడకు వచ్చింది. స్థానికుల సహాయంతో ముగ్గురినీ ఆస్పత్రికి తరలించింది. అప్పటికే వారు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాలకు సోమవారం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement