ఐతే ఓకే! | Key postings racing | Sakshi
Sakshi News home page

ఐతే ఓకే!

Sep 10 2015 11:51 PM | Updated on Sep 3 2017 9:08 AM

పోలీస్ కమిషనరేట్‌లో ‘సూపర్ పవర్’ వర్గీయులకు కీలక పోస్టింగుల పందేరం యథేచ్ఛగా సాగిపోతోంది.

అస్మదీయ అధికారి పట్ల అవ్యాజ ప్రేమ
ఉన్న అధికారికి పొగబెట్టి మరీ...
జోడు అధికారాలు కట్టబెట్టిన వైనం
 

విశాఖపట్నం:పోలీస్ కమిషనరేట్‌లో ‘సూపర్ పవర్’ వర్గీయులకు కీలక పోస్టింగుల పందేరం యథేచ్ఛగా సాగిపోతోంది. వాయుమార్గం, జల మా ర్గాల గుండా ఎగుమతులు, దిగుమతుల వ్యవహారాలపై నిఘా వేసే రెండు కీలకమైన పోస్టింగులు అస్మదీయుడైన ఒకే అధి కారికి కట్టబెట్టారు. అందుకోసం పక్కాగా రెండెంచల వ్యూహంతో కథ నడిపారు. మొదటి అడుగుగా తమ ‘వర్గీయుడైన’ ఓ మధ్యస్థాయి పోలీస్ అధికారికి కొన్ని రోజుల క్రితం నగర శివారులోని కీలకమైన పోస్టింగు కట్టబెట్టారు. విదేశాల నుంచి బం గారం స్మగ్లింగ్ వ్యవహారాలు ఎక్కువ కావడంతో కీలకంగా మారిన ఆ పోస్టులో ఆ యన్ని నియమించారు. అంతటితో ఆ ‘వర్గం’ సంతృప్తి చెందలేదు. ఎగుమతి, దిగుమతి వ్యాపార లావాదేవీలు జరిగే ప్రదేశాలన్నీ తమ నియంత్రణలోనే ఉండాలని భావించింది.

 పాత నగరంపై రెండో అడుగు
 పాత నగర పరిధిలోని ఎగుమతులు, దిగుమతులను  పర్యవేక్షించే అదే స్థాయి పోస్టుపై కూడా కన్నేశారు. నగర శివారులో కీలకమైన పోస్టు ఇచ్చిన అధికారికే ఈ పోస్టు కూడా అదనపు బాధ్యతల కింద అప్పగించాలని ఎత్తుగడ వేశారు. హైదరాబాద్‌లోని తమ వర్గీయులైన ఇద్దరు రిటైర్ట్ రాష్ట్రస్థాయి పోలీసు ఉన్నతాధికారుల ద్వారా చక్రం తిప్పారు. వారిద్దరు సిఫార్సును నగరంలోని పోలీస్ ఉన్నతాధికారి సానుకూలంగా స్పందించారు. వెంటనే అస్మదీయుడైన పోలీస్ అధికారికి పాత నగరంలోని కీలకమైన పోస్టును కూడా అదనపు బాధ్యతలు కింద అప్పగించేశారు. అందుకోసం పాత నగరంలో ఆ పోస్టు నిర్వహిస్తున్న అధికారిని పక్కకు తప్పించి మరీ అస్మదీయ అధికారిని తప్పించారు. పోలీస్ ఉన్నతాధికారి హైదరాబాద్ వెళ్తూ ఎయిర్‌పోర్టులో ఆ అస్మదీయ అధికారిని పిలిచి మరీ ఆయనకు ఆ అదనపు పోస్టు ఇస్తున్న విషయాన్ని చెప్పి మరీ వెళ్లారు.

 దెబ్బతింటున్న మనోస్థైర్యం
 అంతవరకు పాత నగరంలో ఆ పోస్టు బాధ్యతలు చూస్తున్న అధికారి తాజా పరిణామాలతో మనస్తాపానికి గురయ్యారు. దాంతో ఆయన దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. ఈ పరిణామాలు పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తమ సన్నిహితుల కోసం ఇతర అధికారుల మనోభావాలను దెబ్బతీస్తుండటం పోలీస్ యంత్రాంగం మనోస్థైర్యాన్ని కుంగదీస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
 
 

Advertisement
 
Advertisement
Advertisement