అగ్రి డైరెక్టర్లందరినీ ఏలూరు జైలులోనే ఉంచండి

Keep Agri directors in Eluru jail itself - Sakshi

ఈ నెల 30 నుంచి ఓ నెల పాటు ఇలా ఉంచండి

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: అగ్రిగోల్డ్‌ టేకోవర్‌కు ముందుకొచ్చిన ఎస్సెల్‌ గ్రూపునకు తగిన సహాయ, సహకారాలు అందించేందుకు వివిధ జైళ్లలో ఉన్న అగ్రిగోల్డ్‌ డైరెక్టర్లు, ఇతర అధికారులందరినీ ఏలూరు జైలులోనే ఉంచాలని ఉమ్మడి హైకోర్టు మంగళవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 30వ తేదీ నుంచి నెలరోజుల పాటు అందరినీ ఒకే చోట ఉంచాలని అధికారులకు స్పష్టం చేసింది. డాక్యుమెంట్ల పరిశీలన మొదలు మిగిలిన అన్ని వ్యవహారాల్లోనూ ఎస్సెల్‌ గ్రూపు ప్రతినిధిగా వ్యవహరిస్తున్న డెలాయిట్‌ కంపెనీకి అన్ని ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు, ఐటీ అధికారులు సహకరించాలని తేల్చి చెప్పింది. ఇదే సమయంలో వేలం నిమిత్తం అగ్రిగోల్డ్‌ యాజమాన్యం సమర్పించిన ఆస్తుల్లో కొన్ని ఆస్తుల పట్ల ఉమ్మడి హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.

ఈ ఆస్తులు ఎప్పటికీ అమ్ముడుపోయేటట్లు కనిపించడం లేదని పేర్కొంది. మంచి ఆస్తులు అలానే ఉండేటట్లు చేయడం ద్వారా ఎస్సెల్‌ గ్రూపునకు లబ్ధి చేకూర్చాలని అగ్రిగోల్డ్‌ యాజమాన్యం భావిస్తున్నట్లు ఉందని వ్యాఖ్యానించింది. కోర్టు ముందుంచిన ఆస్తులను ఈ పోర్టల్‌ ద్వారా వేలం వేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఐడీ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30వ తేదీ నుంచి స్వాధీన ప్రక్రియ ప్రారంభమైనట్లు పరిగణిస్తామని ఈ సందర్భంగా డెలాయిట్‌కు తేల్చి చెప్పింది. తదుపరి విచారణకు డిసెంబర్‌ 4కి వాయిదా వేస్తూ, ఆ రోజున ఆస్తుల వేలం ప్రక్రియలో పురోగతిని వివరించాలని సీఐడీని ఆదేశించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top