
కరణం బలరాంపై ధ్వజమెత్తిన ‘కత్తి’
రాష్ట్ర శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో మాజీ మంత్రి కరణం బలరాంకు టిక్కెట్టు ఇవ్వడం ఎంతవరకు సబబని నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కత్తి పద్మారావు ప్రశ్నించారు.
గుంటూరు: రాష్ట్ర శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో మాజీ మంత్రి కరణం బలరాంకు టిక్కెట్టు ఇవ్వడం ఎంతవరకు సబబని నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కత్తి పద్మారావు ప్రశ్నించారు. స్థానిక లుంబినీ వనంలోని నవ్యాంధ్ర పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కరణం బలరాం హత్యలకు పాల్పడి జైలు జీవితం అనుభవించి వచ్చాక కూడా సొంత ఊరిలోని దళితవాడపై దాడి చేసి తగులబెట్టిన చరిత్ర ఉందని ఆయన గుర్తు చేశారు.
శాసనమండలికి రాజ్యాంగం ప్రకారం మేధావులు, రాజ్యాంగ నిపుణులు, పండితులను ఎన్నుకోవాల్సి ఉందన్నారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేని సీఎం కుమారుడు లోకేష్‌కు కూడా ఎమ్మెల్సీ టిక్కెట్టు ఇవ్వడం ద్వారా వంశపారంపర్య రాజకీయాలకు చంద్రబాబు తెర తీశారని ధ్వజమెత్తారు. ఇప్పటికే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక సామాజిక వర్గం జులుం అధికమైందని, నూతన శాసనసభ కొలువు తీరిన రోజు అందువల్లే ప్రతిపక్షం స్వేచ్ఛగా వ్యవహరించలేని పరిస్ధితి కనిపించిందని అన్నారు.
రాష్ట్రంలో అనంతపురం, చిత్తూరు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల నుంచి ప్రజలు వలస వెళుతున్న పరిస్థితులుంటే తొలి అర్ధ సంవత్సరంలో ప్రభుత్వం 12.23 శాతాన్ని వృద్ధి రేటుగా పేర్కొనడం శోచనీయమన్నారు. నూతనంగా నిర్మించిన శాసనసభలో కొలువు కావడం చారిత్రక ఘట్టమని, అయితే నూతన శాసనసభను కులాధిపత్యంతో కాకుండా ప్రజాస్వామిక, సామ్యవాద, లౌకిక భావ జాలంతో నడపాలని పద్మారావు సూచించారు.