కసుమూరు దర్గాలో దొంగలు పడ్డారు | Kasumuru Dargah In Thief Theft The Hundi Money In Nellore | Sakshi
Sakshi News home page

కసుమూరు దర్గాలో దొంగలు పడ్డారు

May 17 2019 3:11 PM | Updated on May 17 2019 3:18 PM

Kasumuru Dargah In Thief Theft The Hundi Money In Nellore - Sakshi

కసుమూరు మస్తాన్‌వలీ దర్గా

దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కసుమూరు మస్తాన్‌వలీ దర్గా హుండీ వేలం వాయిదా పడడం దోపిడీదారులకు వరంగా మారింది. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా వక్ఫ్‌ బోర్డు అధికారులు, కొందరు వ్యక్తులు హుండీలో భక్తులు వేసిన నగదును దోచుకుంటున్నారనే విమర్శలున్నాయి. వక్ఫ్‌ బోర్డులోని 
కొందరికి వాటాలు వెళుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 సాక్షి, వెంకటాచలం: మండలంలోని కసుమూరులో కాలేషాపీర్‌ మస్తాన్‌వలీ దర్గా ఉంది. ఇక్కడికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. వక్ఫ్‌ బోర్డు అధికారుల పర్యవేక్షణలో దర్గా కార్యకలాపాలు సాగుతుంటాయి. వేలం పాటలు నిర్వహించి దర్గా హుండీని ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగిస్తారు. వేలంపాట వాయిదా పడితే హుండీ నగదును వక్ఫ్‌ బోర్డు, రెవెన్యూ అధికారులు, పోలీసుల సమక్షంలో లెక్కించాల్సి ఉంది. గతేడాది హుండీ వేలంపాట జరగ్గా రూ.1.50 కోట్లకు వేలంపాటదారులు దక్కించుకున్నారు. దీని గడువు ఈ ఏడాది జనవరి 5వ తేదీతో ముగిసింది. అప్పటి నుంచి వక్ఫ్‌ బోర్డు అధికారుల పర్యవేక్షణలోనే హుండీ నిర్వహణ సాగుతోంది.

చర్యలు చేపట్టలేదు
జనవరి 5వ తేదీ తర్వాత హుండీ వేలం గురించి వక్ఫ్‌ బోర్డు అధికారులు దృష్టి సారించలేదు. వేలం నిర్వహణకు సంబంధించి పలువురు కాంట్రాక్టర్లు వక్ఫ్‌ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. హుండీలో భక్తులు కానుకలుగా వేసిన నగదును తొలిసారి 53 రోజులకు వక్ఫ్‌బోర్డు అధికారులు లెక్కించారు. ఈ లెక్కింపు ప్రక్రియను గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించారనే విమర్శలున్నాయి. ఈ లెక్కింపులో రూ.7.50 లక్షలు వచ్చినట్లు బోర్డు అధికారులు చెప్పడంతో స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. 

గోప్యంగా ఉంచడంతో..
రెండో దఫాగా ఈనెల 12వ తేదీన 70 రోజులకు సంబంధించిన హుండీ లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించారు. అయితే లెక్కింపు ప్రారంభమైన తర్వాత స్థానికులకు తెలియడంతో వారు అక్కడికి చేరుకుని వక్ఫ్‌ బోర్డు అధికారులు, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. హుండీ నగదును పక్కదారి పట్టించేందుకే రహస్యంగా లెక్కింపు చేస్తున్నారని ఆందోళన చేపట్టారు. స్థానికులు ఆందోళన చేస్తున్న సమయంలోనే హుండీ లెక్కింపు వీడియో తీసుకున్న ప్రైవేట్‌ వ్యక్తికి బోర్డు సూపరింటెండెంట్‌ రూ.5 వేలు నగదు ఇవ్వగా ఇతరుల చేత ఆ నగదును బయటకు పంపించడం జరిగింది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులు, వీఆర్వోకు చెప్పడంతో ఆ నగదును వెనక్కి తీసుకువచ్చారు. 

మరో ఘటనలో..
ఓ వ్యక్తి హుండీ నుంచి కిందపోసిన నగదులో ఓ కట్టను తీసుకుని బయటకు వెళ్లగా స్థానికులు వెంబడించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని నగదును లెక్కింపు వద్దకు చేర్చారు. ఈ విషయాల ఆధారంగా హుండీ నగదు దోచేస్తున్నారని భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హుండీ వేలాన్ని ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగిస్తే ప్రతి ఏటా జనవరి నుంచి మే నెల వరకు రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నగదు వచ్చేదని పలువురు చెబుతున్నారు. కానీ ఈ ఏడాది జనవరి ఐదో తేదీ నుంచి మే నెల 12వ తేదీ వరకు కేవలం రూ.19.75 లక్షలు వచ్చినట్లు చూపడంతో హండీ నగదు దోపిడీ చేస్తున్నారని అనేకమంది ఆరోపిస్తున్నారు. లెక్కింపు సమయంలో తప్పిదాలపై వక్ఫ్‌ బోర్డు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో వారి తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బోర్డులోని కొందరు ఉన్నతాధికారులకు వాటా పంపుతుండడంతో వారు పట్టించుకోవడంలేదని చెబుతున్నారు. ఈ విషయమై సమగ్ర విచారణ చేయించాలని భక్తులు కోరుతున్నారు.

పోలీసులు విచారిస్తున్నారు 
హుండీ లెక్కింపు సమయంలో ఓ వ్యక్తి నగదు కట్ట తీసుకెళ్లిన విషయం వాస్తవమే. పోలీసులు అదుపులోకి తీసుకుని నగదు వెనక్కి తీసుకువచ్చారు. ఈ విషయంపై విచారిస్తున్నారు. హుండీ నగదు దోపిడీపై నాపై వచ్చే ఆరోపణలు అవాస్తవం. కెమెరామెన్‌కు రూ.5 వేలు ఇచ్చిన విషయం వాస్తవమే. కానీ కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వెనక్కి తీసుకున్నాం. 

 – అహ్మద్‌బాషా, దర్గా సూపరింటెండెంట్‌

ఫిర్యాదు చేయలేదు 
హుండీ లెక్కింపు వద్దకు పోలీస్‌ సిబ్బందిని పంపాం. అక్కడ ఏం జరిగిందనే విషయంపై వక్ఫ్‌ బోర్డు అధికారులు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అందువల్ల విచారణ జరపలేదు.
– షేక్‌ కరీముల్లా, ఎస్సై 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement