కర్ణాటక కదిలింది | Karnataka moved into... | Sakshi
Sakshi News home page

కర్ణాటక కదిలింది

Jan 20 2014 4:20 AM | Updated on Sep 2 2017 2:47 AM

జిల్లాలో 87500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సిన ఆర్డీఎస్ ప్రస్తుతం 30వేల ఎకరాలకు మించి అందడం లేదు.

మన అధికారుల ప్రయత్నం ఫలించింది. ఎట్టకేలకు కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. ఆర్డీఎస్ ఆధునికీకరణకు అడ్డంకిగా మారిన ప్యాకేజీ-2 కాంట్రాక్టును రద్దుచేస్తూ  నిర్ణయం తీసుకుంది. దీంతో ఆరునెలల నిరీక్షణకు తెరపడింది. మరో కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించి ఈ వేసవిలో వీలైనంత త్వరగా పూర్తిచేయించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదే అమలైతే వచ్చే ఖరీఫ్‌లో ఆయకట్టుకు నీటిని విడుదల చేసుకునే భాగ్యం కలుగుతుంది.
 
 గద్వాల, న్యూస్‌లైన్: జిల్లాలో 87500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సిన ఆర్డీఎస్ ప్రస్తుతం 30వేల ఎకరాలకు మించి అందడం లేదు.  అయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేవిధంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2007లో ఆర్డీఎస్ ఆధునికీకరణ కోసం రూ.92 కోట్లు మంజూరుచేశారు. ఈ నిధులతో కర్ణాటక పరిధిలో రూ.72కోట్లు, మిగతా రూ.20 కోట్లతో అలంపూర్ నియోజకవర్గంలో కాల్వల పనులు చేపట్టాల్సి ఉంది. అయితే కీలకంగా మారిన ప్యాకేజీ-1,2 పనులు ఇంకా పూర్తికాలేదు.
 
 ఇందులో కర్ణాటకకు చెందిన సిరామట్ కన్‌స్ట్రక్షన్స్ అనే కంపెనీ 2008లో రూ.24 కోట్లతో ప్యాకేజీ -2 పనులను దక్కించుకుంది. ప్రారంభించిన కొన్నిరోజులకే పనులను నిలిపేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఈ కాంట్రాక్ట్ సంస్థ గత ఫిబ్రవరిలో కర్ణాటక అధికారుల నుంచి నోటీసులు అందుకుని ఏప్రిల్ చివరి వారంలో ప్రధానకాల్వలను తవ్వేసి పనులు పూర్తి చేయకుండానే మళ్లీ వదిలేసి వెళ్లిపోయింది. ఇలా వదిలేసిన పనుల్లో హెడ్‌వర్క్స్ నుంచి 13వ కి.మీ వద్ద వాగుపై ఉన్న స్లాబ్ దిగువన రంధ్రం చేసి వదిలేశారు. ఈ రంధ్రాలను గత మే నెలలో కర్ణాటక అధికారులు తాత్కాలికంగా మూసివేయించి, ఖరీఫ్‌లో నీటి విడుదలకు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు.
 
 ప్యాకేజీ-2 పనులు పూర్తయితేనే..
 ఈ వేసవిలో ప్యాకేజీ-2 పనులను పూర్తిచేస్తేనే ఖరీఫ్‌లో ఎక్కువ నీటిని ప్రధానకాల్వ ద్వారా దిగువకు విడుదల చేయించే అవకాశం ఉంటుంది. అలాగే ప్యాకేజీ-1లో దాదాపు రూ.3.30 కోట్లతో పనులు చేపట్టిన కాంట్రాక్టర్ ఈ వేసవిలో ప్రధాన నిర్మాణం ఆధునికీకరణ పనులు పూర్తి చేయాల్సి ఉంది. పనులు చేపట్టని ప్యాకేజీ-2 కాంట్రాక్టును రద్దుచేయాలని జూరాల అధికారుల ఒత్తిడితో ఎట్టకేలకు కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. దీంతో రద్దయిన కాంట్రాక్టు స్థానంలో మరో కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించి ఈ వేసవిలో పనులు పూర్తిచేయించాలని జూరాల అధికారులు కర్ణాటక అధికారులతో చర్చిచేందుకు మరో పదిరోజుల్లో అక్కడికి వెళ్తున్నారు. ఈ ఇంజనీర్ల బృందానికి జూరాల ఎస్‌ఈ ఖగేందర్ నాయకత్వం వహిస్తున్నారు. ఆర్డీఎస్‌లో కీలకమైన ప్యాకేజీ-2 పనులను పూర్తిచేయించడంతో పాటు ప్యాకేజీ-1 పనులను కూడా సకాలంలో పూర్తిచేసే విధంగా కర్ణాటక అధికారులపై ఒత్తిడి తీసుకురానున్నారు. ఇదే జరిగితే వచ్చే ఖరీఫ్‌లో ఆర్డీఎస్ ఆయకట్టుకు మెరుగైన రీతిలో సాగునీటిని విడుదల చేయించుకునేందుకు అవకాశం ఉంది.
 
 కర్ణాటక అధికారులతో చర్చిస్తాం..
 ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులను ఈ వేసవిలో పూర్తిచేసే విధంగా ప్రణాళికను రూపొందిస్తున్నాం. ఈ మేరకు కర్ణాటక అధికారులతో చర్చించేందుకు వచ్చేనెల మొదటివారంలో అక్కడికి వెళ్తున్నాం. ప్యాకేజీ-1లో ఉన్న ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్ ప్రధాన పనులు గత వేసవిలోనే ప్రారంభమైనప్పటికీ, వరి రావడంతో నిలిచిపోయాయి. ఈ వేసవిలో పూర్తి చేయిస్తాం. ప్యాకేజీ-2లో కాంట్రాక్టు రద్దుతోపాటు కొత్త కాంట్రాక్ట్ సంస్థను పిలిచి వేసవిలో పూర్తిచేసేందుకు అక్కడి అధికారులపై ఒత్తిడి తెస్తాం.
 - ఖగేందర్, జూరాల ఎస్‌ఈ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement