కంపసముద్రానికి మహర్దశ | Kampasamudra to boom | Sakshi
Sakshi News home page

కంపసముద్రానికి మహర్దశ

Nov 14 2014 3:42 AM | Updated on Oct 20 2018 6:13 PM

కంపసముద్రానికి మహర్దశ - Sakshi

కంపసముద్రానికి మహర్దశ

జిల్లాలోని కంపసముద్రానికి మహర్దశ పట్టింది. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కంపసముద్రాన్ని దత్తత తీసుకోవడంతో గ్రామస్తులు తన్మయత్వానికి లోనయ్యారు.

మర్రిపాడు: జిల్లాలోని కంపసముద్రానికి మహర్దశ పట్టింది. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కంపసముద్రాన్ని దత్తత తీసుకోవడంతో గ్రామస్తులు తన్మయత్వానికి లోనయ్యారు. మెట్ట ప్రాంతమైన కంపసముద్రం గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో ఇక అభివృద్ధికి కొదవలేదంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మేకపాటి రాజమోహన్‌రెడ్డి కంపసముద్రంలో 8వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ మమకారంతోనే గ్రామాన్ని దత్తత తీసుకున్నారని స్థానికులు అభిప్రాయపడ్డారు. గ్రామంలో 470 కుటుంబాలు, 2,400 మంది జనాభా ఉన్నారు. గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది. అయితే తగినన్ని గదులు లేవు. ఎంపీ దత్తత తీసుకోవడంతో ఆ సమస్య తీరనుంది. గ్రామానికి కీలకమైన పంచాయతీ కార్యాలయం లేదు.

దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో అంతర్గత రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. గ్రామ ఎగవూరులో తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎంపీ మేకపాటి చొరవతో గ్రామానికి ఎస్సీ బాలుర వసతిగృహం మంజూరైందని స్థానికులు చెప్పారు. ఇప్పటికే మేకపాటి సోదరుల సహకారంతో గ్రామం కొంత వరకు అభివృద్ధి చెందిందన్నారు. రైతులకు అవసరమైన చెరువులను కూడా అభివృద్ధి చేయాలని, పంట కాలువను బాగు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
 
ఎంతో ఆనందంగా ఉంది

మా గ్రామాన్ని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉంది. గ్రామాభివృద్ధి కోసం గతంలో పలు అభివృద్ధి పనులు చేశారు. ప్రస్తుతం దత్తత తీసుకునేందుకు ముందుకు రావడం ఆనందంగా ఉంది. మేకపాటి కుటుంబానికి మేము ఎంతో రుణపడి ఉంటాం.       

-గోపవరం కాంతారెడ్డి
 
 సమస్యలు తీరనున్నాయి

 కంపసముద్రం గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చిన ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డికి గ్రామస్తులందరం కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మా గ్రామంపై మమకారంతో అభివృద్ధి చేయాలని ముందుకు రావడంతో ఆనందంగా ఉంది. మా గ్రామానికి ఇక మంచి రోజులే రాబోతున్నాయి. సాగు,తాగునీరు సమస్యలు కూడా తీరనున్నాయి.    

 -మల్లు సుధాకర్‌రెడ్డి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement