దివ్యమంగళ స్వరూపుడైన దేవదేవుని నిలువెత్తు రూపం, పండితుల వేదఘోష, మంగళవాయిద్యాలతో ఆ ప్రాంతం వైకుంఠమే అనిపించింది.
కడప కల్చరల్, న్యూస్‌లైన్ : దివ్యమంగళ స్వరూపుడైన దేవదేవుని నిలువెత్తు రూపం, పండితుల వేదఘోష, మంగళవాయిద్యాలతో ఆ ప్రాంతం వైకుంఠమే అనిపించింది. శ్రీ గోవిందమాల భక్తబృందసేవా సమితి కడప శాఖ వారు శుక్రవారం కడప నగరంలోని మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన శ్రీవారి పూజోత్సవాలు భక్తులకు కన్నుల పండువే అయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం మున్సిపల్ హైస్కూలు మెయిన్ వద్దగల శ్రీ అన్నమయ్య విగ్రహానికి పూజలు నిర్వహించి ఊరేగింపుగా ఉభయదారులు స్టేడియంలోని కళ్యాణ వేదిక వద్దకు చేరుకున్నారు.
ఉదయం 5 గంటల నుంచి సుప్రభాతం, తోమాలసేవ, సహస్ర నామార్చన, గోపూజ నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు నిశ్చితార్థం నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లను అలంకరించి ఎదుర్కోళ్ల ఉత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామిని ఈ సందర్భంగా చిన్ని కృష్ణుడిగా అలంకరించారు. ఈ సందర్భంగా సంగీత విభావరిలో గాయకులు భక్తి గీతాలు, అన్నమయ్య కీర్తనలను ఆలపించారు. పూజోత్సవాలలో భాగంగా శనివారం స్వామివారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.