కుగ్రామం నుంచి సుప్రీం స్థాయికి..

Justice jayachandra Reddy Died With Illness in YSR Kadapa - Sakshi

తుదిశ్వాస విడిచినన్యాయకోవిదుడు  

జస్టిస్‌ జయచంద్రారెడ్డి కన్నుమూతతో తిమ్మసముద్రంలో విషాదం

సుప్రీంకోర్టు జడ్జిగా..లాకమిషన్‌ చైర్మనుగా విశేష సేవలు

వైఎస్‌ఆర్‌ జిల్లా, రాయచోటి: అత్యున్నత న్యాయస్థాన పదవులను అలంకరించి విశేష సేవలందించిన జస్టిస్‌ కామిరెడ్డి జయచంద్రారెడ్డి ఇక లేరనే వార్త ఆయన జన్మించిన తిమ్మసముద్రాన్ని విషాదంలో ముంచింది. సాధారణ పల్లెలో జన్మించి సుప్రీం కోర్టు జడ్జి..లా కమిషను చైర్మను లాంటి పదవులలో పనిచేసిన ఈ న్యాయశాస్త్ర కోవిదుడు ఆదివారం సాయంత్రం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. సుండుపల్లి మండలం తిమ్మసముద్రం గ్రామం వండ్లపల్లెకు చెందిన కామిరెడ్డి క్రిష్ణారెడ్డి– చెన్నమ్మల సంతానం ఈయన. 1929 జులై 15వ తేదిన జన్మించారు. జయచంద్రారెడ్డికి భార్య సరోజని, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రాథమిక విద్య మదనపల్లె, రాయచోటిలలో సాగింది. ఇప్పటి చెన్నై(నాటి మద్రాసు)లో న్యాయశాస్త్రం అభ్యసించారు.

జయచంద్రారెడ్డి అంత్యక్రియలు మంగళవారం బెంగుళూరులో జరుగుతాయని బంధువులు తెలిపారు. ఆయన కన్నుమూశారనే సమాచారం తెలిసి ఆదివారం రాత్రి తిమ్మసముద్రంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఉన్నత  హోదా లో ఉన్నా కన్న ఊరి అభివృద్ధికి ఆయన పరితపించేవారని స్థానికులు ఈ సందర్భంగా గుర్తు్త చేసుకుంటూ కన్నీరు పెడుతున్నారు. సుండుపల్లితో పాటు రాయచోటి, కడప కేంద్రాల్లోని కోర్టులతో ఆయనకు సంబంధాలున్నాయి. సుండుపల్లి మండలంలో విద్యాభివృద్ధిలో ఈయన మార్కు కనిపిస్తుందని సీనియర్‌ న్యాయవాదులు చెప్పారు. జయచంద్రారెడ్డిని ఆదర్శంగా తీసుకున్న అనేకమంది చదువుబాట పట్టారు. వీరిలో కొందరు న్యాయవాదులుగా ను, ఐఏఎస్‌లు, పోలీసు శాఖలలో అత్యున్నత స్థానాల్లో ఉన్నారని గ్రామస్తులు చెప్పారు. జయ చంద్రారెడ్డి మృతికి రాయచోటి బార్‌ అసోసియేషన్‌ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది.  ఆదివారం రాత్రి బార్‌ అసొసియేషన్‌ అధ్యక్షులు నాగిరెడ్డి, కార్యదర్శి రెడ్డెప్పరెడ్డి, ఇతర న్యాయవాదులు ఒక ప్రకటన విడుదల చేశారు. 

దివంగత వైఎస్సార్‌తో అనుబందం..
జస్టీస్‌ కె.జయచంద్రారెడ్డితో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి విడదీయరాని అనుబంధం ఉండేది. సుండుపల్లికు చెందిన స్వాతంత్య్ర సమర యోధులు యర్రపురెడ్డి ఆదినారాయణరెడ్డితో మంచి సంబంధాలుండేవి. అత్యున్నత పదవులలో ఉన్నా వీరిని మర్యాదపూర్వకంగా కలిసేవారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top