
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగం కావాలంటే తెలుగు వచ్చి ఉండాలన్న నిబంధన పెట్టాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లో తెలుగు భాషను కచ్చితంగా నేర్చుకోవాలనే నిబంధన పెట్టాలని, తెలంగాణ రాష్ట్రంలో తన సూచనల మేరకే అక్కడి సీఎం కె. చంద్రశేఖర్‌రావు ఇటీవల ఉత్తర్వులు జారీచేశారని ఆయనను అభినందించారు. విజయవాడలో మంగళవారం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కేంద్ర ఉపరితల, జలరవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కలసి ఏడు జాతీయ రహదారులను జాతికి అంకితంచేసి.. ఆరు జాతీయ రహదారులు, కృష్ణా నదిపై అంతర్గత జలమార్గం పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సభలో ఆయన మాట్లాడారు. పాశ్చాత్య వ్యామోహంలో పడి మాతృభాషను తక్కువ చేయడం మంచిది కాదన్నారు.
నదుల పరిరక్షణను జాతీయ ఉద్యమంగా చేపట్టాలని.. లేని పక్షంలో చరిత్ర క్షమించదన్నారు. రాష్ట్రంలో కృష్ణా, పెన్నా, తుంగభద్ర నదుల్లో నీళ్లు లేవని.. ఇసుక ఏమవుతోందో అందరికీ తెలుసనని వెంకయ్యనాయుడు చురకలు అంటించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడం ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు గోదావరి జలాలను తరలించవచ్చునన్నారు. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం కోసం భారీఎత్తున డ్రిప్, స్పింక్లర్ విధానాన్ని అమలుచేస్తున్నామని చెప్పారు.